సోమవారం 13 జూలై 2020
Tourism - Feb 02, 2020 , T00:40

దక్షిణాది చిరపుంజి అగుంబె

 దక్షిణాది చిరపుంజి అగుంబె

నింగిని తాకే కొండలు, నీలిమబ్బులను చుంబించే దృశ్యాలు ఈశాన్యంలోని చిరపుంజిలోనే కాదు, దక్షిణాదిలో అగుంబెలోనూ చూడవచ్చు. అందుకే, కర్ణాటకలోని అగుంబెను చిరపుంజి ఆఫ్ సౌత్ అంటారు. అరేబియన్ సముద్ర తీరానికి 55 కి.మీ దూరంలో పడమటి కనుమల్లోని ఈ గ్రామం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమే.

కర్ణాటకలోని షిమోగా జిల్లాలో మూడు చదరపు కి.మీచిన్న గ్రామం అగుంబే. జనాభా దాదాపు ఐదువందలు. పక్షుల కిలకిలలు తప్ప పట్టణ ప్రాంతపు రణగొణధ్వనులేవీ ఇక్కడ వినిపించవు. పడమటి కనుమల్లో పుష్కలంగా వర్షాలు కురిసే ప్రదేశం ఇది. అందుకే పచ్చదనానికి చిరునామాలా ఉంటుంది.  అగుంబె (పొగమంచుతో కూడిన అడవి అందాలు అగుంబెలో కనువిందు చేస్తాయి) ఈ ప్రదేశాన్ని దక్షిణ భారతదేశపు చిరపుంజి అని పిలుస్తారు. పశ్చిమ కనుమలకలోని ఈ ప్రదేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో అత్యధిక వర్షపాతం పడుతుంది. ఈ మాన్సూన్ సీజన్‌లో అడవి మొత్తం పొగమంచుతో ఉంటుంది. వాటర్‌ఫాల్స్ కనువిందు చేస్తా యి. కుంచికల్ ఫాల్స్, బర్కానా ఫాల్స్ అందాలు తనివితీరా చూడాల్సిందే. ఇక్కడున్న అగుంబె రెయిన్‌ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్‌ను ప్రతి ఒక్కరు సందర్శించాల్సిందే. అగుంబె చుట్టుపక్కల ముఖ్యంగా చూడాల్సినవి ఇక్కడి జలపాతాలనే. కొండల మీదుగా నేల మీదకు ఉరికే జలపాతాలు ఇక్కడ అడుగడుగునా తారసపడతాయి. ముఖ్యంగా బర్కానా జలపాతం, కూడ్లుతీర్థ జలపాతం, జోగిగుండి తదితర జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.  


కింగ్ కోబ్రా

కింగ్ కోబ్రా అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. కింగ్ కోబ్రా పుట్టింది ఈ అగుంబెలోనే. పాముల రాజధానిగా పిలువబడే ఈ అగుంబెలో ప్రిసిద్ది చెందిన రోములన్ అనే అతను కింగ్ కోబ్రాను 1970లో ఈ ఇక్కడే కనుగొన్నాడు.  


కుంచికాళ్  

వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా జలపాతాలు సహజంగా ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి కుంచికాళ్ జలపాతం. ఇది ఇక్కడి టూరిస్టులకు మరో అట్రాక్షన్. ఇది దేశంలోనే ఎక్కువ ఎత్తు నుంచి పడుతున్న జలపాతాల్లో ఒకటి. ఇది 1493 అడుగుల ఎత్తు నుంచి పడుతూ చూసేవాళ్లకి చిన్నపాటి నయాగరాలా అనిపిస్తుంది. వారాహి నది ఇక్కడే పుడుతుంది. 


బర్కానా  

మరో జలపాతం బర్కానా. ఇది 850 అడుగుల ఎత్తు నుంచి పడుతుంది. సీతానది కొండలపై నుంచి ప్రవహిస్తుంది కాబట్టి దీనికి సీతా జలపాతం అనే  పేరు కూడా ఉంది. ఈ జలపాతాన్ని చేరాలంటే గుంబో ఘాట్ల ద్వారా ట్రెక్కింగ్ చేయాలి లేదా  బైక్ రూట్లో వెళ్లాలి.


ఒనకి అబ్బి  

అగుంబెకు దగ్గర్లో ఉండే మరో జలపాతం ఒనకి జలపాతం. కన్నడలో ఒనకి అంటే దంపుడు కర్ర అని అర్థం. ఈ జలపాతం చూడ్డానికి అలాగే కనిపిస్తుందని ఆ పేరు పెట్టారు. మెట్ల ద్వారా అక్కడికి చేరుకోవచ్చు.


జోగి గుండి  

ఇక్కడికి మూడు కిలో మీటర్ల దూరంలో జోగి గుండి జలపాతాలు ఉంటాయి. ఇవి చాలా పురాతనమైనవి. సుమారు 829 అడుగుల ఎత్తునుంచి పడతాయి. ఇక్కడకు చేరుకోవాలంటే సగం దూరం బైక్ లేదా కార్లో వెళ్లి మిగిలిన దూరం ట్రెక్కింగ్ చేయాలి.  


కూడ్లు తీర్థ  

కూడ్లు తీర్థ జలపాతాలను అగుంబే వచ్చిన ప్రతి ఒక్కళ్లూ చూసి తీరాల్సిందే. ఈ జలపాతం 126 అడుగుల ఎత్తునుంచి ఒక సరస్సులోకి పడుతుంది. ౩ కి.మీ అడవిలో ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి చేరుకోవాలి.   అగుంబె-ఉడిపి రోడ్డుకు చేరువలోని ఎత్తయిన శిఖరంపై ఉన్న సన్‌సెట్ వ్యూపాయింట్ నుంచి సూర్యాస్తమయ దృశ్యాన్ని తిలకించడానికి పర్యాటకులు ఇష్టపడతారు. ఇక్కడి నుంచి చూస్తే సుదూరాన అరేబియన్ సముద్రంలోకి కుంగుతున్న సూర్యబింబం కనిపిస్తుంది. 


అగుంబె రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ 

ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో అగుంబె రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఒకటి. ఏడాది మొత్తంలో 7 వేల మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అగుంబేలోని అడవుల వైవిధ్యంపై ఇక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూ ఉంటారు. వాటి విశేషాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.  


శ్రీకృష్ణ , శ్రీ సిద్ధి వినాయక ఆలయాలు

అగుంబెలోని శ్రీకృష్ణ, శ్రీ సిద్ధి వినాయక ఆలయాలు, నడబర ఈశ్వరాలయం, ఇక్కడకు చేరువలోని నాగూరులో ఆంజనేయ ఆలయం వంటి పురాతన ఆలయాలు ఆధ్యాత్మిక ఆసక్తి గల పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడికి చేరువలోని ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రం, శృంగేరీ శంకరాచార్య పీఠం ఉన్నాయి. అగుంబెలో విహారయాత్ర తర్వాత వీటిని కూడా సందర్శించవచ్చు.  ఇక్కడి జీవవైవిధ్యాన్ని తిలకించాలనుకునే వారు అగుంబే చేరువలోని సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యాన్ని సందర్శించవచ్చు


ఏం చేయాలి? 

అగుంబెలోని ఎత్తయిన కొండలు పర్వతారోహకులకు అనుకూలం. సరదాగా ఈ కొండలపై ట్రెక్కింగ్ చేయవచ్చు. అయితే తరచూ కురిసే వానలవల్ల నిత్యం తడిగా ఉండే ఈ కొండలపై ఆచి తూచి అడుగులేయాల్సి ఉంటుంది. వాహనాల రద్దీ తక్కువగా ఉండే ఇక్కడి వీధులు నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యా యామ కాలక్షేపాలకు అనువుగానూఉంటాయి. ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో వనవిహారాలకు వెళ్లవచ్చు. జలపాతాల వద్ద జలక్రీడలు ఆడవచ్చు.


logo