శుక్రవారం 07 ఆగస్టు 2020
Tourism - Jan 08, 2020 , 17:46:46

పర్యాటక కేంద్రంగా మొలంగూర్ ఖిల్లా

పర్యాటక కేంద్రంగా మొలంగూర్ ఖిల్లా

శంకరపట్నం: మొలంగూర్ ఖిల్లాకు కొత్తశోభ రానుంది. పోలీస్ శాఖ కృషితో పర్యాటక కేంద్రంగా మారనుంది. కాకతీయుల కాలంలో ఆయుధాగారంగా, రక్షణ కవచంగా, శత్రు దుర్భేద్యంగా భాసిల్లిన మొలంగూర్ ఖిల్లా ఖ్యాతి కాలంతోపాటు కనుమరుగైంది. జిల్లాలో పేరెన్నికగన్న చారిత్రక ప్రదేశంగా వెలుగొందాల్సిన ఖిల్లా సీమాంధ్ర పాలకుల వల్ల ఆదరణకు నోచుకోలేకపోయింది. కానీ, తెలంగాణ వచ్చాక ఇప్పుడిప్పుడే ఖిల్లా పునరుద్ధరణకు పురావస్తు శాఖ ప్రయత్నాలు ప్రారంభించగా, పోలీసు శాఖ ఒకడుగు ముందుకేసింది. సెప్టెంబర్ 9, 2017న పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి, అప్పటి బల్దియా కమిషనర్ శశాంక, ఏసీపీ రవిందర్‌రెడ్డి, జడ్పీ సభ్యుడు సంజీవరెడ్డి, ఎస్‌ఐ ఎల్. శ్రీను, జిల్లాలోని పలువురు పోలీసు అధికారులతో కలిసి ఖిల్లాపై ట్రెక్కింగ్ నిర్వహించారు. దాదాపు 4 గంటలపాటు గుట్టపై ఉన్న చారిత్రక కట్టడాలను సీపీ పరిశీలించారు. స్థానిక గైడ్ ద్వారా ఖిల్లా నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అలనాటి గొప్ప నిర్మాణాల్లో ఒకటైన ఖిల్లాకు ప్రాచుర్యం కల్పించాలనీ, వసతులను మెరుగుపరిచి పర్యాటకులను రప్పించాలన్నారు. ఇందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుట్ట మధ్యలో ట్రెక్కింగ్ నిర్వహణకు అవరోధంగా ఉన్న ఓ పరుపుబండ ప్రదేశంలో రెయిలింగ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే పర్యాటకుల భద్రతకు ఖిల్లా మధ్యలో ఉన్న పరుపుబండపై రెయిలింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ట్రెక్కింగ్‌కు అనువుగా మారింది.
ఖిల్లాపై కలెక్టర్, సీపీ ట్రెక్కింగ్
కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి ఈ రోజు రెయిలింగ్‌ను ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన 9 మంది రాక్ క్లైంబర్స్, స్థానిక క్లైంబర్స్, మీడియా ప్రతినిధులతో కలిసి గుట్టపైకి ట్రెక్కింగ్ నిర్వహించారు. గుట్టపైకి వెళ్లే దారిలో మెట్లకు ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.


logo