శనివారం 29 ఫిబ్రవరి 2020
సాగర్‌ టూ శ్రీశైలం.. రోడ్‌ కమ్‌ రివర్‌ టూర్‌ ప్రారంభం

సాగర్‌ టూ శ్రీశైలం.. రోడ్‌ కమ్‌ రివర్‌ టూర్‌ ప్రారంభం

Jan 08, 2020 , 17:44:09
PRINT
సాగర్‌ టూ శ్రీశైలం.. రోడ్‌ కమ్‌ రివర్‌ టూర్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు ఏర్పాటు చేసిన రోడ్‌ కమ్‌ రివర్‌ క్రూజ్‌ టూర్‌ను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రకృతి సౌందర్యాలను చూసేందుకు టూరిజం ఆధ్వర్యంలో బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో కాళేశ్వరం, వరంగల్‌ జిల్లాలోని ప్రాచీన కట్టడాలను చూసేందుకు ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇవాళ నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు వెళ్లేందుకు హైదరాబాద్‌లో బస్సు బయల్దేరి శ్రీశైలంలో దర్శనం చేయించి హైదరాబాద్‌కు తీసుకువస్తారని పేర్కొన్నారు. అతి తక్కువ ధరకే ఈ ప్యాకేజీని అందిస్తున్నామని స్పష్టం చేశారు.


అద్భుతమైన సౌందర్య దృశ్యాలు తెలంగాణలో ఉన్నాయి. గతంలో టూరిజంను పాలకులు నిర్లక్ష్యం చేశారు. సీఎం కేసీఆర్‌ టూరింజను మరింత అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల చుట్టు పక్కల టూరిజం స్పాట్‌లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ చెప్పారని మంత్రి తెలిపారు.

హైదరాబాద్ నుంచి నందికొండ వరకు బస్సు ప్రయాణం, ఇక్కడి నుంచి లాంచీలో శ్రీశైలానికి పోయి అక్కడినుంచి బస్సులో హైదరాబాద్‌కు వెళ్లేందుకు రూ.2999 పెద్దలకు, పిల్లలకు రూ.2399 చార్జ్ చేయనున్నట్టు తెలిపారు. నందికొండ నుంచి శ్రీశైలానికి లాంచీలో వెళ్లి వచ్చేందుకు పెద్దలకు రూ.2200, పిల్లలకు రూ.1760, నందికొండ నుంచి శ్రీశైలం లేదా శ్రీశైలం నుంచి నందికొండకు అంటే కేవలం ఒకవైపునకు పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.800ను చార్జ్ చేయనున్నట్టు టూరిజం అధికారులు వివరించారు.


logo