e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home టాప్ స్టోరీస్ Bhavani Devi | అప్పుడు అమ్మ న‌గ‌లు అమ్మి శిక్ష‌ణ‌.. ఇప్పుడు ఒలింపిక్స్‌లో.. ఆమెపైనే ఆశ‌లు

Bhavani Devi | అప్పుడు అమ్మ న‌గ‌లు అమ్మి శిక్ష‌ణ‌.. ఇప్పుడు ఒలింపిక్స్‌లో.. ఆమెపైనే ఆశ‌లు

రాణి రుద్ర‌మ‌దేవి, ఝాన్సీ రాణి వంటి ధీర వ‌నిత‌లు ఒక‌ప్పుడు క‌ద‌న‌రంగంలో క‌త్తులు తిప్పార‌ని చ‌దువుకున్నాం. క‌త్తి విద్య ప్రావీణ్యం గురించి చ‌రిత్ర‌లో గొప్ప‌లు విని అబ్బుర‌ప‌డిపోయాం. ఇప్పుడు ఇన్నేళ్ల‌కు ఒక అమ్మాయి క‌త్తిసాముతో ఒలింపిక్స్‌లో ప‌త‌కం కొట్టేందుకు సిద్ధ‌మైంది. వెయిట్ లిఫ్టింగ్‌, హాకీ, రెజ్లింగ్‌, జిమ్నాస్టిక్స్‌, బ్యాడ్మింట‌న్ వంటి విభాగాల్లోకి అంద‌రూ వెళ్తుంటే.. వాళ్లంద‌రికీ భిన్నంగా పెన్సింగ్ను ఎంచుకుంది సీఏ భ‌వానీ దేవి. ఆ విభాగంలో దూసుకెళ్తూ ప‌త‌కాలు సాధిస్తుంది. తాజాగా ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన తొలి భార‌తీయ ఫెన్స‌ర్‌గా రికార్డుల‌కెక్కింది.

ఫెన్సింగ్‌పై ఆస‌క్తి ఎలా వ‌చ్చిందంటే..

సీఏ భ‌వానీ ఈ స్థాయికి చేరుకోవ‌డానికి చాలా క‌ష్టాల‌నే ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. చెన్నైకి చెందిన ఒక స‌గటు మ‌ధ్య త‌ర‌గ‌తి బ్రాహ్మ‌ణ కుటుంబంలో జ‌న్మించింది సీఏ భ‌వానీ. ఆమె పూర్తి పేరు చ‌ద‌ల‌వాడ ఆనంద సుంద‌రరామ‌న్ భ‌వానీ దేవి. ఆమె తండ్రి ఆల‌య పూజారి. త‌ల్లి గృహిణి. ఆమెకు 11 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం స్పోర్ట్స్ ఇన్ స్కూల్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఆ స‌మ‌యంలో ఫెన్సింగ్ ఆడుతున్న సీనియ‌ర్ విద్యార్థినుల‌ను చూసి ముచ్చ‌ట‌ప‌డింది. తాను కూడా వాళ్ల‌లా ఆ గేమ్‌ను నేర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. అలా ఫెన్సింగ్ నేర్చుకునే 40 మంది ఆడ‌పిల్ల‌ల బృందంలో తానూ ఒక‌రిగా చేరింది. కానీ ఐదేళ్ల‌లోనే ఆ బృందంలోని అమ్మాయిలంతా ఒక్కొక్క‌రిగా అందులో నుంచి త‌ప్పుకున్నారు. కానీ భ‌వానీ దేవి మాత్రం ఆ ఆట‌పై రోజు రోజుకు త‌న ఆస‌క్తిని పెంచుకుంటూ వెళ్లింది. ఫెన్సింగ్‌లో మెళుకువ‌లు నేర్చుకుంటూ ప్రావీణ్యం సంపాదించింది.

న‌గ‌లు అమ్మి కిట్ కొనిచ్చిన అమ్మ‌

- Advertisement -

ఫెన్సింగ్ గేమ్‌కి అస‌లు మ‌న దేశంలో ఆద‌ర‌ణే లేదు. అలాంటి స‌మ‌యంలో ఈ ఫెన్సింగ్ గేమ్‌పై ఆస‌క్తి పెంచుకుంది భ‌వానీ దేవి. అయితే సేబ‌ర్ ఫెన్సింగ్ క్రీడ‌లో ఎల‌క్ట్రిక్ సూట్‌, మాస్క్ ధ‌రించి.. ప్ర‌త్య‌ర్థి ఆయుధం మ‌న శ‌రీరాన్ని తాకేలోపే మెరుపులా క‌దులుతూ ఒడుపులా క‌త్తిని విస‌ర‌గ‌ల‌గాలి. ఈ ఆట కోసం క‌చ్చితంగా ఫెన్సింగ్ కిట్ కావాలి. కానీ అప్పటికీ ఫెన్సింగ్ కిట్ కొనేందుకు స‌రిప‌డా డ‌బ్బులు కూడా లేని దుస్థితి భ‌వానీ కుటుంబానిది. అయినా స‌రే కూతురు ఇష్టాన్ని ప్రోత్స‌హించాల‌ని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. ఇందుకోసం వాళ్ల అమ్మ న‌గ‌లు అమ్మితే వ‌చ్చిన 6 వేల రూపాయ‌ల‌తో తొలి ఫెన్సింగ్ కిట్‌ను కొని వేసుకుంది భ‌వానీదేవి.

వెదురు క‌ర్ర‌ల‌తో ప్రాక్టీస్‌

అంత ఖ‌ర్చు పెట్టి కొన్న ఆయుధాన్ని పోటీల కోసం దాచుకునేది భ‌వానీదేవి. ఆ ఆయుధానికి బ‌దులు ఏ వ‌స్తువు తన ప్రాక్టిస్‌కు వీలుగా ఉంటే దాంతోనే సాధ‌న చేసేది. ప్రారంభంలో వెదురు క‌ర్ర‌ల‌తో ప్రాక్టీస్ మొద‌లుపెట్టింది. ఉద‌యాన్నే ఐదున్న‌ర‌కు లేని స్టేడియానికి వెళ్లి సాధ‌న చేసేది. ఆ త‌ర్వాతే బ‌డికి వెళ్లేది. స్కూలు అయిపోగానే మ‌ళ్లీ స్టేడియానికి వెళ్లి ప్రాక్టీస్ చేసిన త‌ర్వాత‌నే ఇంటికి వెళ్లేది. ఆ స‌మ‌యంలో భ‌వానీదేవి త‌ల్లిదండ్రులు ఆమెకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ముఖ్యంగా భ‌వానీ దేవి వాళ్ల అమ్మ ఆమెను ఎంత‌గానో ప్రోత్స‌హించింది.

అమ్మ ప్రోత్సాహంతోనే..

ఎవ‌రైనా ఆడ‌పిల్ల‌ల‌కు ఇలాంటి ఆట‌లు నేర్పిస్తారా? ఇలాంటి ఆట‌లు అమ్మాయిల‌కు అవ‌స‌ర‌మా? అని చాలామంది భ‌వానీదేవి త‌ల్లిదండ్రుల‌కు స‌ల‌హా ఇచ్చేవారు. కొంద‌రైతే ఆట‌లు ప‌క్క‌న‌బెట్టి చ‌దువు మీద దృష్టి పెట్ట‌మ‌ని చెప్పేవాళ్లంట‌. కానీ భ‌వానీ వాళ్ల అమ్మ మాత్రం ఆమెకు అండ‌గా నిల‌బ‌డింది. ‘అమ్మాయి ఇష్ట‌ప‌డింది.. ఆట నేర్చుకుంటుంది. ఇందులో మీకేం ఇబ్బంది? ’ అంటూ అంద‌రి నోళ్లు మూయించేది. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో ఫెన్సింగ్‌పై మ‌రింత దృష్టి పెట్టింది భ‌వానీదేవి. అయితే ఒక్కోసారి ఎంత క‌ష్ట‌ప‌డినా ఫ‌లితం ఉండేది కాదు. అలాంటి స‌మ‌యంలో ఒక మెంట‌ర్ ఉంటే బాగుండేది అని భ‌వానీదేవికి అనిపించేది. అప్పుడే భ‌వానీ ప్ర‌తిభ‌ను గుర్తించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ సాగ‌ర్ లులూ.. ఆమెను కేర‌ళ‌లోని త‌ల‌స్సేరిలో ఉన్న అకాడ‌మీకి ఆహ్వానించాడు. త‌ల‌స్సేరి వెళ్లి అక్క‌డే ఫెన్సింగ్ సాధ‌న‌తో పాటు చ‌దువునూ కొన‌సాగించి ఇంజినీరింగ్ పూర్తి చేసింది.

ఆర్థిక ఇబ్బందుల‌తో ఆట వ‌దిలేద్దామ‌నుకుంది..

పద్నాలుగేళ్ల వయస్సులో టర్కీలో జరిగిన పోటీల్లో తొలి సారిగా భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రీడల్లో భవానీ దేవి పాల్గొంది. అయితే, దురదృష్టవశాత్తూ.. మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన కారణంగా ఆ టోర్నీ నుంచి నిష్క్ర‌మించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మలేషియాలో జరిగిన కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌-2009లో పాల్గొన్న భవానీ దేవి.. తొలిసారిగా పతకం సాధించింది. అయితే విదేశీ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చులు భ‌రించే స్థోమ‌త లేక 2013లో ఫెన్సింగ్ వ‌దిలేయాల‌ని భ‌వానీ దేవి భావించింది. అప్ప‌టికే త‌న కోసం రూ. 10 ల‌క్ష‌ల లోన్ కూడా తీసుకున్నారు. దీంతో ఆమె ఆట‌లు మానేయాల‌ని అనుకుంది. ఇదే విష‌యాన్ని వాళ్ల అమ్మ‌కు చెప్పింది. కానీ అందుకు వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు. శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం క‌చ్చితంగా వ‌స్తుంది.. వెనుక‌డుగు వేయ‌వ‌ద్దు అని ఓదార్చి.. భ‌వానీలో ధైర్యం నింపింది. దీంతో అప్ప‌టి నుంచి క‌ఠోర సాధ‌న చేసిన భ‌వానీ దేవి 2014లో జరిగిన సబ్‌ జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో మొదటిసారి గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది.

తండ్రి మ‌ర‌ణించిన బాధ‌లోనూ..

ఆ త‌ర్వాత 2017 ఐస్‌లాండ్‌లో జరిగిన ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కొల్లగొట్టింది. 2019లో కామన్‌వెల్త్‌ ఫెన్సింగ్‌ క్రీడల్లోనూ స్వర్ణపతకాన్ని ముద్దాడింది. ఈ పోటీల్లో పాల్గొంటున్న స‌మ‌యంలోనే భ‌వానీ తండ్రి క‌న్నుమూశాడు. తండ్రి మ‌ర‌ణించిన దుఃఖాన్ని దిగ‌మింగుకొని.. ధైర్యంగా పోరాడి విజ‌యం సాధించింది.

నేను వైర‌స్‌తో గెలుస్తా.. నువ్వు ఆట‌లో గెలువు

గ‌త మార్చిలో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ కోసం హంగేరీ వెళ్లాల్సి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో భవానీ త‌ల్లి క‌రోనాతో ఐసీయూలో చికిత్స తీసుకుంటుంది. ఇప్ప‌టికే తండ్రిని కోల్పోయిన భ‌వానీ.. ఆ స‌మ‌యంలో మ్యాచ్ వ‌దులుకుని త‌ల్లి ద‌గ్గ‌రే ఉండాల‌ని అనుకుంది. కానీ ఆమె తల్లి మాత్రం భ‌వానీకి ధైర్యం చెప్పింది. ‘నేను వైరస్‌ను గెలుస్తా.. నువ్వు ఆటలో గెలువు’ అని కూతురిని సాగనంపింది. అలా హంగేరీ వెళ్లిన భ‌వానీ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో విజ‌యకేత‌నం ఎగుర‌వేసి ఒలింపిక్స్ బెర్త్ ప‌క్కా చేసుకుంది. సోమ‌వారం ఉద‌యం ఒలింపిక్స్‌లో ఆడ‌నుంది భ‌వానీ. ఈ ఫెన్సర్‌ స్వర్ణ పతకంతో తిరిగి రావాలని కోరుకుందాం.

భ‌వానీ దేవి సాధించిన విజ‌యాలు

ఇటలీకి చెందిన కోచ్‌ నికొలా జనోటీ దగ్గర శిక్షణ తీసుకుంటున్న‌ భవానీ ఫెన్సింగ్‌లో చాలా విజ‌యాలు సాధించింది.
2009లో మలేషియాలో జరిగిన కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది.
2010లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఏషియన్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకుంది.
2012లో జెర్సీలో జరిగిన కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో బృందంతో కలిసి రజత పతకం, వ్యక్తిగతంగా కాంస్య పతకం పొందింది.
2014, 2015ల్లో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఒక రజతం, ఒక కాంస్య పతకం దక్కించుకుంది.
2018 టోర్నోయి శాటిలైట్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రజత పతకం పొందింది.

ఫెన్సింగ్ గేమ్ ఎలా ఉంటుంది

ఆధునిక ఫెన్సింగ్ గేమ్‌ ఎపీ, సెబ‌ర్‌, ఫాయిల్ అని మూడు ర‌కాలుగా ఉంటుంది. ఎపీలో పూర్తి శ‌రీరం ల‌క్ష్యంగా ఉంటే.. సేబ‌ర్‌లో శ‌రీర పైభాగం, ఫాయిల్‌లో శ‌రీర కింది భాగం ల‌క్ష్యంగా పోరాటం జ‌రుగుతుంది. ఈ మూడు ర‌కాల ఫెన్సింగ్ గేమ్‌ల‌కు వాడే ఆయుధాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఈ గేమ్ నిడివి 10 నిమిషాలు. ఇక భార‌త్ త‌ర‌ఫున ఆడుతున్న భ‌వానీ దేవి సేబ‌ర్ ఫెన్సింగ్ నిపుణురాలు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana