e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home Top Slides ఇంత నిర్లక్ష్యమా

ఇంత నిర్లక్ష్యమా

 • వైరస్‌ విజృంభిస్తున్నా ప్రజలు బేఖాతర్‌
 • ప్రాణాలు పోతున్నా కనిపించని పట్టింపు
 • ఒకరి నిర్లక్ష్యం.. కొన్ని కుటుంబాలకు శిక్ష
 • మాస్క్‌లు లేవు.. భౌతికదూరం లేనేలేదు
 • తుంపర్లతో విస్తరిస్తున్నదన్న భయం లేదు
 • మాస్క్‌లు ధరించడంలోనూ మొక్కుబడి
 • ప్రభుత్వం చెప్పినా పట్టించుకోని వైనం
 • ‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో వెల్లడైన
 • హైదరాబాద్‌ సిటీ ప్రజల నిర్లక్ష్యపు పోకడ
ఇంత నిర్లక్ష్యమా

ఎవరికీ ప్రాణమంటే భయంలేదు. తమ నిర్లక్ష్యానికి మరొకరు బలవుతారన్న ఇంగితం అంతకంటే లేదు. మందు కావాలి. బిర్యానీ కావాలి.. ఇవాళే విడుదలైన సినిమా చూసెయ్యాలి.. ఒకటే నిర్లక్ష్యం.. ‘ఏమైతది?’ఓ వైపు సుడిగాలిలా వైరస్‌ విస్తరిస్తున్నది. మనుషులు పిట్టల్లా
రాలిపోతున్నారు. నిబంధనలు పాటించాలని ప్రభుత్వం నెత్తీనోరూ బాదుకొని మరీ చెప్తున్నది. గతేడాది ఇదే సమయానికి వైరస్‌ విజృంభిస్తే.. భయంతో వణికిపోయి ఇండ్లల్లో కూర్చున్నరు. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. గాలిలో, ధూళిలో, తుంపర్లలో ఎక్కడ పడితే అక్కడ.. అత్యంత వేగంగా వైరస్‌వ్యాప్తి చెందుతున్నది. అయినా ఎవ్వరికీ పట్టింపు లేదు. అదే నిర్లక్ష్యం.. ‘ఏమైతది?’పట్టింపులేని యువత వైఖరికి నిష్కారణంగా పెద్దల బతుకులు, దీర్ఘకాలిక రోగుల బతుకులు తెల్లారిపోతున్నయి. కరోనా సెకండ్‌ వేవ్‌ రెట్టింపు వేగంతో విస్తరిస్తున్నా..
ముఖ్యంగా యువతకు ఆ భయంలేకుండా పోయింది. ప్రభుత్వ మార్గదర్శకాలు చెవికెక్కడంలేదు. పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయన్న వార్తలు కూడా వారికి పట్టడంలేదు. తమ బాధ్యతారాహిత్యంతో కరోనాకు వాహకాలుగా మారిపోతున్నారు.

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (నమస్తే తెలంగాణ): తన అభిమాన హీరో సినిమాచూసేందుకు భౌతికదూరం పాటించకుండా థియేటర్‌కు వెళ్లాడు రాజేశ్‌.. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోకుండా రెస్టారెంట్‌కు వెళ్లి వచ్చాడు ముఖేశ్‌.. మటన్‌కోసం మాస్క్‌ లేకుండా మార్కెట్‌కు వెళ్లాడు మల్లేశ్‌.. ఈ ముగ్గురూ కరోనా బారినపడ్డారు. వీరు చేసిన తప్పుకు వీరి కుటుంబ సభ్యులంతా హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు. వీరేకాదు.. ఇప్పుడు రాష్ట్రంలో అనేకమంది కిక్కిరిసిన జనం మధ్య ఇలా స్వేచ్ఛా విహారాలు చేసి.. కరోనా వైరస్‌ను తమకు అంటించుకోవడమే కాకుండా.. దానిని వేరే అనారోగ్యాలతో బాధపడుతున్న ఇతరులకు అంటిస్తున్నారు. ఈ తప్పు చేస్తున్నవారు బాగానే ఉంటున్నా.. శిక్ష మాత్రం వేరే కుటుంబాలకు పడుతున్నది. కరోనా తీవ్రతకు తట్టుకోలేక వేరేవాళ్లు బలైపోతున్నారు. వైరస్‌ రెండోదశ రెట్టించిన వేగంతో వ్యాప్తి చెందుతున్నా.. రోజుకు ఎన్నెన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నా.. కొందరిలో మాత్రం ఇంకా చలనం రావటంలేదు. ఓవరాక్షన్‌తో కొందరు, సరదాల కోసం మరికొందరు కొవిడ్‌ జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా తిరిగి.. వైరస్‌ అంటించుకొని.. కొవిడ్‌ వాహకాలుగా మారుతున్నారు. వైరస్‌ సోకిన 80% మందిలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవటం వల్ల.. ఇలాంటి వారి నుంచి మరొకరికి వైరస్‌ త్వరగా వ్యాప్తి చెందుతున్నది. వ్యాప్తివేగం ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో వారం

దరినీ అతి తక్కువ సమయంలో కబళిస్తున్నది. ఒకరి నుంచి మరొకరికి.. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి.. ఇంటి నుంచి వీధికి.. వీధి నుంచి ఊరుకు వైరస్‌ సునామీలా విస్తరిస్తున్నది. మొదటి దశ కరోనా నుంచి ప్రజలు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని దీంతో స్పష్టమవుతున్నది. బాధ్యతగా ఉండాల్సిన ప్రజలు ఇష్టారీతిగా వ్యవహరించడంవల్లే కరోనా వ్యాప్తి పెరుగుతున్నదని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకొంటున్నా.. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. ప్రజలవైపు నుంచి సహకారం లేనిదే మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నట్టు చరిత్రలోలేదని, సాధ్యంకాదని కూడా హెచ్చరిస్తున్నారు.

ఇంత నిర్లక్ష్యమా

రద్దీ ప్రాంతాల్లో జోరు
‘నమస్తే తెలంగాణ’ హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి లోతుగా పరిశీలించింది. ఆదివారం రాగానే ముక్క లేకుండా ముద్ద దిగదని చెప్తూ మాస్కులు లేకుండా ఎందరో తిరుగుతున్నారు. మటన్‌ షాపులు, చికెన్‌ షాపులు, చేపల మార్కెట్లు సాధారణ సమయంలో మాదిరిగానే కిటకిటలాడుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ మూడు గంటలపాటు ఒకే హాల్లో వందల మందితో కలిసి సినిమా చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. బిర్యానీ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. పలు రెస్టారెంట్లలో డైనింగ్‌ హాళ్లు నిండిపోయి వెయింటింగ్‌ హాళ్లు ఫుల్‌గా ఉంటున్నాయి. రాత్రి పన్నెండు దాటినా ఐస్‌క్రీం షాపులు, చికెన్‌ సెంటర్లు జనంతో నిం డుగా కనిపిస్తున్నాయి. మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్సుల్లోనూ అంతులేని నిర్లక్ష్యం తాండవిస్తున్నది.

మాస్కు వినియోగంలో అశ్రద్ధ
తొలిదశ కరోనా నుంచి ఇప్పటివరకు ప్రచారం వల్ల మాస్కు వాడకంపై కొంత అవగాహన పెరిగింది. 60% మందికిపైగా మాస్కులు ధరిస్తున్నారు. కానీ, వీరిలో సగంమంది మాట్లాడుతున్నప్పడు మాస్కులు కిందకు దిం చుతున్నారు. కొందరు మాస్క్‌లను ముక్కు కింద, గదుమ మీద తగిలించుకొనే తిరిగేస్తున్నారు. నోటి తుంపర్ల (ఎయిరోసాల్‌) ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకే మాస్కు వినియోగం అన్న అసలు విషయాన్ని గాల్లో కలిపేస్తున్నా రు. మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తుండటం వల్ల కొంత మార్పు కనిపిస్తున్నది. బైకులు, కార్లలో వెళ్తున్న చాలామందిలో మాస్కులు పెట్టుకొంటున్నారు. ఇందులో కొందరు పోలీసులను గుర్తించి మాస్కులు ధరిస్తున్నారు.

భౌతికదూరం దూరమైంది
కరోనా వైరస్‌.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడంలో భౌతికదూరం కీలక అంశం. వైరస్‌కు కాళ్లు, చేతులు లేవు కాబట్టి స్వతహాగా వైరస్‌ కదలదు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తించేందుకు కచ్చితంగా వాహకం అవసరం. కరోనా వైరస్‌కు ఆ వాహకమే మన తుంపర్లు. దీని నుంచి రక్షించుకొనేందుకు కనీసం ఒక మీటర్‌ భౌతికదూరం పాటించడం ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. దీన్ని పాటించడంలో నగర ప్రజలు.. దాదాపు అన్ని ప్రాంతాల్లో పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రార్థనా మందిరాలు, మాల్స్‌, మార్కెట్లు, ఫుడ్‌ కోర్ట్స్‌ ఇలా ఎక్కడ చూసినా భౌతికదూరం పాటించిన దాఖలాలు లేవు. ఈ విషయంలో మొదటిదశ వైరస్‌ సమయంలో కనిపించిన జాగ్రత్త కూడా ఇప్పుడు లేదు.

తప్పు యువతది.. శిక్ష పెద్దలకు..
మొదటి దశ, రెండో దశ కరోనా వ్యాప్తిలో తేడా స్ప ష్టం గా కనిపిస్తున్నదని నిపుణులు చెప్తున్నారు. గతేడాది వచ్చిం ది ప్రాథమిక వైరస్‌ కాగా, ఇప్పుడు విజృంభిస్తున్నది మ్యు టేషన్లు చెందిన కొత్తరకం వైరస్‌. ఇది రెట్టింపు వేగంతో వ్యాపిస్తున్నది. విద్య, ఉపాధి, ఉద్యోగం, ఇంటి అవసరాలు.. తదితర కారణాల వల్ల ఎక్కువగా యువత ఇండ్లు దాటి బయట అడుగుపెడు తున్నది. ఈ సందర్భంలో వీరికి వైరస్‌ సోకుతున్నది. రోగనిరోధక శక్తి పటిష్ఠంగా ఉండటం వల్ల వీరిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. తమకు వైరస్‌ సోకలేదనే ధీమాతో ఉండటం వల్ల అది ఇంట్లో వారికి అంటుకొని బయటపడుతున్నది. ఎక్కువగా 50 ఏండ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందిపడుతున్న వారికి ఈ వైరస్‌ చేరుకోగానే వారిని ప్రాణాల మీదకు నెట్టివేస్తున్నది. వైరస్‌ సోకి ఎక్కువ రోజుల సమయం తీసుకోకుండానే వారు సీరియస్‌ పరిస్థితికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

పట్టణాల కంటే గ్రామాలే ఆదర్శనీయం
మొదటి వేవ్‌, రెండో వేవ్‌.. ఈ రెండు సమయాల్లో గ్రామాలు పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్కచేయకుండా పట్టణాల్లోని ప్రజలు పగలు రాత్రి తేడా లేకుండా తిరుగుతున్నా రు. కానీ గ్రామాల్లో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మాస్కులు పెట్టుకోవడం, భౌతికదూరం పాటించడం, శుభ్రత విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రత్యేక నిబంధనలు ఏర్పరుచుకొని అమలుచేస్తున్నాయి. కొన్ని గ్రామాలు మాస్క్‌ లేకుండా తిరిగితే జరిమానా విధిస్తుంటే, మరికొన్ని గ్రామాలు రాత్రి కర్ఫ్యూలను విధించుకొంటున్నాయి. పొలాలకు వెళ్లే రైతులు సైతం మాస్కులు పెట్టుకోవడం, కిరాణాల ముందు భౌతిక దూరం పాటించేలా సర్కిల్స్‌ ఏర్పాటుచేయడం, ఉచితంగా సబ్బులు, శానిటైజర్లు పంపిణీచేయడం వంటి నియమాలతో కొన్ని గ్రామ పంచాయతీలు పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కొన్ని చోట్ల మా ఇంటికి రాకండి.. మీ ఇంటికీ మేం రాము.. అంటూ స్వచ్ఛందంగా కట్టడి విధించుకుంటున్నాయి.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొరతను కేంద్రం వెంటనే పరిష్కరించాలి. టీకాలు అందుబాటులో లేక ఆదివారం వ్యాక్సినేషన్‌ నిలిపివేశాం. 25 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే స్పందన లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదు. ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నాం. మందులు, వ్యాక్సిన్‌ కొరత విషయంలో సీఎం కేసీఆర్‌ నిత్యం సమీక్షిస్తున్నారు. రెమ్‌డెసివిర్‌ వంటి మందుల కొరత లేకుండా ఆయా కంపెనీలతో ఇప్పటికే మాట్లాడారు.

చిన్న నిర్లక్ష్యంతో పెద్ద నష్టం
ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. వైరస్‌ రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతున్నది. ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నది. కానీ ప్రజలు సైతం పూర్తిగా సహకరించాలి. మహమ్మారులను ఎదుర్కోవడం అనేది సముద్రాన్ని ఈదడంతో సమానం. ఇలాంటి సమయంలో ప్రజలు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి. కరోనా సోకి సీరియస్‌ అయిన వారిలో ఐదు నుంచి ఏడు రోజుల్లోనే పరిస్థితి విషమిస్తున్నది. భౌతి కదూరం పాటించడంలో ప్రజలు అశ్రద్ధ చేయొద్దు.

 • డాక్టర్‌ రాజారావు, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌

చార్మినార్‌ ఎందుకు కట్టారో గుర్తుంచుకోవాలి
ఒక వ్యాధి నివారణకు గుర్తుగా నిర్మించిన చిహ్నం చార్మినార్‌ మన నగరంలోనే ఉన్నది. అంటు వ్యాధులు రాకుండా పరిశుభ్ర వాతావరణంలో పెరుగాల్సిన అవసరం ఉన్నది. ఇందుకు ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. కొవిడ్‌ విషయంలో మాస్కులు కట్టుకోవడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం మరచిపోవద్దు. ‘వైరస్‌ వచ్చింది.. పోయింది.. మళ్లీ వచ్చింది.. పోతుంది’ అనే భ్రమ నుంచి యువత బయటపడాలి. మరింత బాధ్యతగా మెలగాలి.

 • డాక్టర్‌ భవాని, నేచర్‌ క్యూర్‌ దవాఖాన సూపరింటెండెంట్‌
Advertisement
ఇంత నిర్లక్ష్యమా
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement