e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home Top Slides రామప్ప ఇక ప్రపంచ సంపద

రామప్ప ఇక ప్రపంచ సంపద

 • ప్రపంచ వారసత్వ జాబితాలో చారిత్రక ఆలయం
 • యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ ఆమోదం
 • కాకతీయుల కళా వైభవానికి ఇక విశ్వకీర్తి
 • రాష్ట్ర ప్రభుత్వ సుదీర్ఘ కృషికి దక్కిన ఫలం
 • ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ హర్షం

రాళ్లలో పూలు పూయించిన అలనాటి శిల్పి అపురూప కళాఖండమైన రామప్ప అస్తిత్వం నేడు అంతర్జాతీయంగా వైభవోపేతమైంది. భారతీయ శిల్ప కళాచరిత్రలో అతి విలక్షణమైన స్థానాన్ని చాటిన శైలి కాకతీయ శిల్పానిది. ఈ శైలిలో కూడా మరింత విశిష్టమైనది రామప్ప. రామప్ప గుడిగోడల రమణీయ మంజరులని మహాకవులు కీర్తించిన మదనికలు.. లలిత కళాభిమానులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఈ శిల్ప సౌందర్యం ఒకరికి కవిత్వానుభూతి కలిగిస్తే.. మరొకరి హృదయంలో పాటై అలరించింది. జాయపసేనానిచేత నూతన నాట్యభంగిమలనే ఆవిర్భవింపజేసింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపుపొందిన రామప్ప రెండు తెలుగు రాష్ర్టాల్లోనే ఈ ఖ్యాతి గొన్న తొలి నిర్మాణం. ఏండ్లపాటు రాష్ట్రప్రభుత్వం సలిపిన అవిరళ కృషికి దక్కిన ఫలితం ఇది..

హైదరాబాద్‌, జూలై 25 (నమస్తే తెలంగాణ): కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప (రుద్రేశ్వరాలయం) దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా అవతరించింది. ఈ శిల్పకళా అద్భుతాన్ని వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రకటించింది. చైనాలోని ఫ్యూజీలో జరిగిన ప్రపంచ వారసత్వ కట్టడాలు, ప్రాంతాల కమిటీ సమావేశంలో రామప్ప దేవాలయాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చుతూ తీర్మానం చేశారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోని కట్టడాలు, ప్రాంతాల్లో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన తొలి కట్టడం రామప్ప ఆలయమే కావటం విశేషం. రామప్పతో వరల్డ్‌ హెరిటేజ్‌ జాబితాలో చేరిన భారతదేశ కట్టడాలు, ప్రాంతాల సంఖ్య 39కి చేరింది. యునెస్కో ప్రకటనపై ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, దేశ ప్రజలంతా ఈ ఆలయాన్ని సందర్శించాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రతీకకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించటం గొప్పవిషయమని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం చేసిన కృషికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు.

- Advertisement -

రామప్ప అందానికి కమిటీ ఫిదా
రామప్ప ఆలయ శిల్ప సౌందర్యానికి యునెస్కో హెరిటేక్‌ కమిటీ సభ్యులు ముగ్ధులయ్యారు. 24 సభ్యదేశాలున్న ఈ కమిటీలో రష్యా సహా 17 దేశాలు రామప్పను వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చేందుకు మద్దతు తెలిపాయి. ఈ ఆలయ ప్రతిపాదనలో కొన్ని లోపాలున్నాయంటూ నార్వే వ్యతిరేకించింది. అమేమీ పెద్ద లోపాలుకాదని ఇతర దేశాలు నార్వే అభ్యంతరాలను తోసిపుచ్చాయి. వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ రూల్‌ 22.7ను అనుసరించి ఆలయ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని రష్యా పట్టుబట్టింది. దీనికి ఇథియోపియా, ఒమన్‌, బ్రెజిల్‌, ఈజిప్ట్‌, స్పెయిన్‌, థాయ్‌లాండ్‌, హంగేరి, సౌదీఅరేబియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల మద్దతు లభించింది.

చెక్కు చెదరని నిర్మాణం..
ఆలయ నిర్మాణాల్లో కాకతీయులది ప్రత్యేక శైలి. వీరు నిర్మించినవాటిలో ఎక్కువ త్రికూటాలయాలే. రామప్ప ఆలయాన్ని కూడా ఆ శైలిలోనే నిర్మించారు. ఆలయానికి మూడు వైపుల ప్రవేశ ద్వారాలు, మధ్యలో పెద్ద మండపం ఉన్నది. ఆలయ గోపుర నిర్మాణానికి వినియోగించిన ఇటుకలు నీటిలో తేలుతాయి. ఆలయం గోపురంపై బరువును తగ్గించేందుకు వీటిని ప్రత్యేక మట్టి, ఏనుగు లద్దె, అడవి మొకల జిగురు, ఊకపొట్టు వంటి పదార్థాలతో సాంద్రత తక్కువ ఉండేలా తయారుచేశారు. గ్రానైట్‌, డోలమైట్‌, బ్లాక్‌ గ్రానైట్‌ రాళ్లతో ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. భూకంపాలు, వరదలు వంటి విపత్తులకు చెక్కు చెదరకుండా ఇసుక పునాది (శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీ)తో దీన్ని నిర్మించారు.

రాష్ట్ర ప్రభుత్వ కృషికి ఫలితం
రామప్ప ఆలయానికి వారసత్వ గుర్తింపు సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచి ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వ కృషి ఫలితంగా 2019 సెప్టెంబర్‌లో యునెస్కో తరఫున ఐకోమాస్‌ ప్రతినిధి వాసుపోశానందన్‌ ఆలయాన్ని పరిశీలించి వెళ్లారు. ఆయన సూచనలతో 2020 సంవత్సరానికి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరేందుకు భారత్‌ తరఫున రామప్ప దేవాలయం నామినేట్‌ అయ్యింది. గత నెలలో రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసింది. రామప్పకు వారసత్వ హోదా కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని నేతలు కోరారు. కట్టడం విశిష్టతలను తెలుపుతూ రాష్ట్రప్రభుత్వం వీడియోలు, పుస్తకాలను రూపొందించింది. ఐకోమాస్‌ సూచన మేరకు రామప్ప సమీపంలోని రెండు ఆలయాలను ప్రధాన ఆలయ పరిధిలోకి తెచ్చారు. రాష్ట్రస్థాయిలో వివిధ శాఖలతో సమన్వయానికి కమిటీ వేశారు.

సాంస్కృతిక కేంద్రం
ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలో క్రీస్తుశకం 1213లో ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు గుడిని నిర్మించాడు. నాటి ప్రఖ్యాత శిల్పి రామప్ప ఈ ఆలయాన్ని 40 ఏండ్లపాటు కష్టపడి అద్భుత కళాఖండంగా మలిచారు. అందువల్లనే ఆలయం ఆయన పేరు మీదనే ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం కాకతీయుల హయాంలో గొప్ప సామాజిక, సాంసృతిక కేంద్రంగా వర్ధిల్లింది. విద్య, వైద్య, వాణిజ్యాలకు కేంద్రంగా భాసిల్లింది. ఆలయంలో రామలింగేశ్వరస్వామి రూపంలో శివుడు పూజలందుకొంటున్నాడు. ఆలయ ద్వారానికి రెండువైపులా మృదంగాన్ని వాయిస్తున్న పురుషుడు, నాట్యం చేస్తున్న స్త్రీ శిల్పాలు కాకతీయులకే ప్రత్యేకమైన నృత్య శైలి పేరిణి శివతాండవంలోని భంగిమలతో ఉన్నాయి. ఇక్కడి శిల్పాలను తాకితే సంగీత స్వరాల శబ్ధం వస్తుంది. ఆలయంలోని మదనిక శిల్పాలు చూపు తిప్పుకోనివ్వవు. గుడి గోడలపై ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల పొడవు వరకు శిల్పాలు చెక్కటం విశేషం. ఆలయ ప్రదక్షిణ పీఠం గోడల చుట్టూ 526 ఏనుగుల శిల్పాలు ఉంటే ప్రతి ఒక్కటీ విభిన్న శైలిలోనే ఉంటాయి. గర్భగుడిలో పగలంతా వెలుతురు ఉంటుంది. భవిష్యత్‌ తరాలు ఆలయాన్ని కాపాడుకోవాలని సూచిస్తూ ఓ శాసనం కూడా ఇక్కడ ఉన్నది.

గుర్తింపుతో ప్రయోజనాలు ఇవీ
రామప్పకు ప్రపంచ వారసత్వ హోదాతో కాకతీయుల శిల్పకళా వైభవం ఖండాతరాలకు వ్యాపించనున్నది. భూగోళం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివచ్చే అవకాశం ఉన్నది. కల్చరల్‌ ఎక్స్‌చేంజ్‌ (సాంస్కృతిక మార్పడి) జరుగుతుంది.

 • ఆలయ పరిరక్షణకు యునెస్కో ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తుంది. వరల్డ్‌ హెరిటేజ్‌ ఫండ్‌-1977 కింద ఆలయ అభివృద్ధికి నిధులు అందుతాయి. భూకంపాలు, వరదలు వచ్చినప్పుడు కట్టడానికి ప్రమాదం వాటిల్లితే పునరుద్ధరించేందుకు ర్యాపిడ్‌ రెస్పాండ్‌ ఫండింగ్‌ కూడా లభిస్తుంది. కట్టడం రక్షణకు యునెస్కో సాంకేతిక సహకారం, శిక్షణ ఇస్తుంది.
 • రామప్ప ఆలయంపై ఐకోమాస్‌ లేవనెత్తిన 9 లోపాలపై 2022లో మరో నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. ఆలయ సరిహద్దుల విస్తరణ, కామేశ్వరాలయం, రామప్ప చెరువు తదితరల ప్రాంతాలపై మరింత స్పష్టత రానున్నది. ఐకోమాస్‌ సూచనల మేరకు రామప్ప ఆలయ పరిధిని మరింత పెంచే వీలున్నది.

తెలంగాణ ప్రజలకు అభినందనలు

రామప్పకు యునెస్కో గుర్తింపు రావటం హర్షణీయం. భారత ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు. రామప్ప ఆలయం కాకతీయుల అద్భుతమైన శిల్పకళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ పురాతన ఆలయాన్ని సందర్శించి, దాని గొప్పతనం గురించి తెలుసుకోవాలి.

 • నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

రాష్ట్ర వారసత్వానికి గుర్తింపు


13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రుద్రేశ్వర(రామప్ప) ఆలయానికి యునెస్కో గుర్తింపు రావటం ఆనందంగా ఉన్నది. ఇది తెలంగాణ వారసత్వానికి దక్కిన గుర్తింపు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.

 • వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

మన చారిత్రకవైభవానికి ప్రతీక రామప్ప


కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకం గా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంసృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనది. స్వరాష్ట్రంలో తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంసృతికి పూర్వ వైభవం తేవడానికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నది. రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు రావటానికి మద్దతు తెలిపిన యునెసో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలు. హోదాకోసం కృషిచేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులు, అధికారులకు అభినందనలు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.

హైదరాబాద్‌కు గుర్తింపే తదుపరి లక్ష్యం
800 ఏండ్ల చరిత్ర కలిగిన రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. ఈ శుభవార్త చెప్తున్నందుకు సంతోషంగా ఉన్నది. తెలంగాణ నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప. ఇందుకోసం ప్రయత్నించిన అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్‌ ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు తీసుకురావటం తదుపరి లక్ష్యం.

 • మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌


తెలంగాణ శిల్పకళావైభవం ఖండాంతరాలకు..
రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు లభించటం మన అందరికీ గర్వకారణం. 800 ఏండ్ల నాటి ఈ చారిత్రక కట్టడం తెలంగాణ శిల్పకళావైభవాన్ని ఖండాంతరాల్లో చాటింది. ఇందుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు.

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

వారసత్వ సంపదను కాపాడుతున్న కేసీఆర్‌
తెలంగాణ వారసత్వ, చారిత్రక, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ వాటికి పూర్వవైభవం తీసుకొస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. అద్భుత శిల్పకళాఖండమైన రామప్పకు యునెస్కో గుర్తింపు రావటం సంతోషం. ఇందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు. వారి కృషి ఫలితంగానే రామప్పకు గుర్తింపు వచ్చింది. పర్యాటకంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందటానికి రామప్పకు గుర్తింపు రావటం ఎంతగానో ఉపయోగపడుతుంది.

 • పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

స్వరాష్ట్రంలోనే సాధ్యమైంది
రామప్పకు వారసత్వ గుర్తింపు రావటం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఈ ఘనకీర్తిలో సీఎం కేసీఆర్‌ కృషి ఎంతో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో యునెస్కో గుర్తింపునకు ప్రయత్నించినా అప్పటి ప్రభుత్వం సరైన దృష్టి పెట్టక సాధ్యం కాలేదు. తెలంగాణ సాధించాక రామప్పకు యునెస్కోకు గుర్తింపు ప్రయత్నించాలని కేసీఆర్‌ ఎంతగానో ప్రోత్సహించారు. కేంద్రానికి లేఖ కూడా రాశారు. జూన్‌ 23న మంత్రులు, వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర పర్యాటకశాఖ మంత్రిని కూడా కలిశాం.

 • ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి

తెలంగాణ ప్రజలు గర్వించే విషయం
కేసీఆర్‌ నాయకత్వంతోనే రామప్పకు గుర్తింపు సాధ్యమైంది. కాకతీయుల శిల్పకళకు నిలయమైన ఆలయానికి గుర్తింపుదక్కటం తెలంగాణకు గర్వకారణం. ఇందులో నేనూ భాగస్వామిని అయ్యా.

 • గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి, సత్యవతి రాథోడ్‌

కాకతీయ కళకు దక్కిన గౌరవం
అద్భుత శిల్పసంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కటం భారతీయులందరికీ, ప్రత్యేకంగా తెలంగాణకు గర్వకారణం. ఇది కాకతీయ శిల్పకళావైభవానికి దక్కిన అరుదైన గౌరవం.

 • దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

పర్యాటకం మరింత వర్ధిల్లుతుంది
రామప్పకు గుర్తింపుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. దీంతో తెలంగాణ పర్యాటకం మరింత వర్ధిల్లుతుంది.

 • ఎస్సీ, ఎస్టీ, మైనార్జీ సంక్షేమశాఖ మంత్రి కొప్పల ఈశ్వర్‌

సీఎం కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలించాయి
సీఎం కేసీఆర్‌ రామప్పకు గుర్తింపు తెచ్చేందుకు చేసిన యత్నాలు ఫలించాయి. 2018లో ప్రధానికి లేఖ రాయడంతోపాటు, నిరంతరం పర్యవేక్షించారు. గుర్తింపు వచ్చేందుకు కృషిచేసిన కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు పాపారావు, పాండురంగారావుకు కృతజ్ఞతలు.

 • వినోద్‌ కుమార్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు
రామప్పకు వారసత్వ హోదా రావటం హర్షణీయం. ఇందుకు కృషిచేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఇది కాకతీయుల శిల్పకళకు, వరంగల్‌ ప్రజలకు లభించిన అరుదైన గౌరవం. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వరంగల్‌ ప్రజల పక్షాన ధన్యవాదాలు.

 • ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావటం హర్షణీయం. ఇందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌కు కృతజ్ఞతలు.

 • ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్‌

సమైక్యరాష్ట్రంలో సాధ్యంకానిది తెలంగాణలో సాధ్యమైంది. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడటంతోనే ఇది సాధ్యమైంది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషికి మరో నిదర్శనం.రాష్ట్రప్రజలకు గర్వకారణం.

 • రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి

రామప్పను ప్రపంచ చిత్రపటం మీద నిలిపేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. పాలంపేట బిడ్డగా గర్వపడుతున్నా. రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించాలని కేసీఆర్‌ అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. కాకతీయ వారసత్వ నిర్మాణాల పరిరక్షణకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీవీ పాపారావు, ప్రొఫెసర్‌ ఎం పాండురంగారావు కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ను ఏర్పాటుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం ద్వారా దేవాదుల సొరంగాన్ని పాలంపేట మీదుగా తీసుకెళ్లే కుట్ర జరిగింది. ఈ కుట్రను ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది.

 • రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీ ప్రకాశ్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana