e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home Top Slides ‘గులాబ్‌' ప్రభావంతో కుండపోత.. మరో రెండు రోజులు వర్షాలకు చాన్స్‌

‘గులాబ్‌’ ప్రభావంతో కుండపోత.. మరో రెండు రోజులు వర్షాలకు చాన్స్‌

  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డలో 18.2 సెంటీమీటర్ల వర్షం
  • రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • జలమయమైన లోతట్టు ప్రాంతాలు
  • అప్రమత్తమైన అధికార యంత్రాంగం
  • ఎక్కడికక్కడ కంట్రోల్‌ రూంల ఏర్పాటు

గులాబ్‌ ప్రభావంతో సోమవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతున్నది. పలు జిల్లాల్లో దినమంతా ఎడతెరిపిలేకుండా భారీ నుంచి అతి భారీవర్షం కురిసింది. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డలో 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ కేంద్రం 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ టెలికాన్ఫరెన్స్‌లో అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంగళవారం సీఎస్‌ సెలవు ప్రకటించారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కంట్రోల్‌రూంలను ఏర్పాటుచేసి సహాయకచర్యలను ముమ్మరంచేసింది.

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను వాన ముంచెత్తింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం దంచికొట్టింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి దాకా ఏకధాటి వానతో సిరిసిల్లలో జనజీవనం స్తంభించిపోయింది. వేములవాడ మూలవాగు, సిరిసిల్ల మానేరు వాగులోకి వరదనీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాతబస్టాండ్‌, కరీంనగర్‌ రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. కొత్త చెరువు మత్తడి దూకుతుండటంతో లోతట్టు ప్రాంతమైన శాంతినగర్‌లో కొన్ని రోడ్లు మునిగిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. శాంతినగర్‌ డేంజర్‌జోన్‌ కింద చేర్చి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిరిసిల్ల కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటుచేశారు. అత్యవసర సమయాల్లో మొబైల్‌నంబర్‌ 9398684240కి ఫోన్‌చేయాలని సూచించారు.

- Advertisement -

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ముందస్తు చర్యలు
ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీవర్షం కురిసింది. ఇచ్చోడ మండలం ముక్రా(కే) రోడ్డుపై నుంచి భారీగా వరద ప్రవహించింది. బోథ్‌లోని పొచ్చెర, నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలంలోని ఖర్జి-రాంపూర్‌ మధ్య విద్యుత్తు స్తంభాలపై చెట్లు విరిగిపడ్డాయి. ఆయా జిల్లాల్లో కంట్రోల్‌రూంలను ఏర్పాటుచేశారు. ఆదిలాబాద్‌లో కంట్రోల్‌రూం నంబర్‌-18004251939, నిర్మల్‌- 18004255566, మంచిర్యాల- 08736-250501, ఆసిఫాబాద్‌- 08733-27933, 18005991200 అందుబాటులోకి తీసుకొచ్చారు.

25 ఏండ్లు తర్వాత నిండిన బీబీపేట చెరువు
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వాన దంచికొట్టింది. 30పైగా ఇండ్లు కూలిపోయాయి. కల్వర్టులపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బీదర్‌, నారాయణఖేడ్‌, హుస్సేన్‌నగర్‌ ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిలిచాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని మాందాపూర్‌ శివారులోని ఎడ్లకట్ట వాగు పొంగుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 25 ఏండ్లుగా నిండని బీబీపేట చెరువు నిండిపోయింది. మాచారెడ్డిలోని పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.

ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. డోర్నకల్‌లో భారీ వృక్షం విరిగి పడటంతో ఖమ్మం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కాళేశ్వరం పుష్కరఘాట్‌ వద్ద 9.10 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. సింగరేణి ఓసీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పెద్ద చెరువుకు భారీగా వరద నీరు వస్తున్నది. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటుచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా రోజంతా వర్షం కురిసింది. మాడ్గులపల్లి మండలం దాచారం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఓ వ్యక్తి బైక్‌తో సహా కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. యాదగిరిగుట్ట మండలం చొల్లేరులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామ సరిహద్దు వద్ద కంచె వేసి రాకపోకలను నిలిపివేశారు.

వేల ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో 3,172 ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. వ్యవసాయశాఖ అధికారులు స్థానికంగా పర్యటించి ప్రాథమికంగా నిర్ధారించారు. వరి 2,720 ఎకరాల్లో, పత్తి 452 ఎకరాల్లో నష్టపోయినట్టు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో పత్తి, కంది, సోయా పంటలు నీట మునిగాయి. నారింజ వాగు ఇరువైపులా ఉన్న పత్తి, సోయాబీన్‌ తదితర పంట పొలాల్లోకి నీరు చేరింది. కంగ్టి మండలంలో 3,700 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయాధికారులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండంలోని భిక్నెల్లి, హంగర్గా తదితర గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి.

14 జిల్లాల్లో రెడ్‌ అలర్డ్‌


భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, జనగామ, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌అలర్ట్‌ హెచ్చరిక జారీచేసింది. ఈ 14 జిల్లాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని పోలీస్‌శాఖ సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement