e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home Top Slides వాటాలు తేల్చాల్సిందే

వాటాలు తేల్చాల్సిందే

  • 20 తర్వాతే కేఆర్‌ఎంబీ మీటింగ్‌ పెట్టండి
  • పూర్తిస్థాయి బోర్డును సమావేశపర్చాలి
  • మా అభ్యంతరాలనూ ఎజెండాలో చేర్చాలి
  • కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కృష్ణా జలాల దోపిడీని నిలువరించడానికి తెలంగాణ ప్రభుత్వం సమరానికి సిద్ధమైంది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపడానికి యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టింది. కృష్ణా జలాల వాటాలను పునః సమీక్షించాలని ఓ వైపు కేఆర్‌ఎంబీని డిమాండ్‌ చేస్తూనే.. ఏపీ అక్రమాలపై ఎన్జీటీలో సవాలుచేసింది. సీమ లిఫ్టును చూసేందుకు అవసరమైన హెలికాప్టర్‌ సౌకర్యాన్ని కల్పిస్తామని ఎన్జీటీ సభ్యులను ఆహ్వానించింది. మరోపక్క సీమ లిఫ్ట్‌కు పర్యావరణ అనుమతులివ్వాలంటూ.. ఏపీ సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాయడం ద్వారా ఆ ప్రాజెక్టు అక్రమమని తానే ఒప్పుకొన్నారు.

హైదరాబాద్‌, జూలై 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నీటి వాటాలను పునః సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు లేఖరాసింది. కృష్ణా నీటి వినియోగంపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకంటూ ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదావేయాలని కోరింది. ఈ నెల 20 తర్వాత బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటుచేయాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ సోమవారం కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు. ఏపీ లేవనెత్తిన అంశాలను మాత్రమే సమావేశాల ఎజెండాలో చేర్చారని, తెలంగాణ అభ్యంతరాలను విస్మరించారని ఆక్షేపించారు. 2019 ఫిబ్రవరి 14న, ఈ నెల 2న తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి రాసిన లేఖల్లోని అంశాలను సమావేశాల ఎజెండాలో చేర్చలేదని పేర్కొన్నారు. వానకాలం వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కావటంతో తమ సాగునీటిశాఖ అధికారులు, సాంకేతిక బృందం ఆ పనుల్లో తీరికలేకుండా ఉన్నారని, అందువల్ల పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని 20వ తేదీ తర్వాత రెండు రాష్ర్టాలకు అనుకూలమైన తేదీన నిర్వహించాలని లేఖలో విజ్ఞప్తిచేశారు.

- Advertisement -

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రంలో చేపట్టిన కరెంటు ఉత్పత్తిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆక్షేపించింది. ఏపీ వాదనలన్నీ అర్థరహితమని కొట్టిపారేసింది. శ్రీశైలంను జలవిద్యుత్‌ ఉత్పత్తి కోసమే నిర్మించేందుకు 1963లో ప్లానింగ్‌ కమిషన్‌ అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఆవిరి నష్టాల కింద కేటాయించిన 33 టీఎంసీల జలాలను మినహాయించి ప్రాజెక్టులోని నీటిని విద్యుదుత్పత్తి కోసం మాత్రమే వినియోగించాలని, ఇతర అవసరాలకు మళ్లించవద్దని బచావత్‌ ట్రిబ్యునల్‌ స్పష్టంగా పేర్కొన్నదని గుర్తుచేసింది. నాగార్జున్‌సాగర్‌ ప్రాజెక్టు కింద ఆయకట్టు, తాగునీటి అవసరాలను శ్రీశైలం నీటిని విడుదల చేయడం ద్వారా తీర్చవచ్చని తెలిపింది. తెలంగాణలో వ్యవసాయం ఎత్తిపోతల పథకాల మీద ఆధారపడి ఉన్నందున వానకాలం సీజన్‌లో విపరీతమైన విద్యుత్తు డిమాండ్‌ ఉంటుందని, శ్రీశైలంలో విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల ఆ డిమాండ్‌ ఎంతోకొంత తీర్చుకొనే అవకాశమున్నదని పేర్కొంది. అందువల్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయడం కుదరదని తేల్చిచెప్పింది.

లేఖలోని కీలకాంశాలు

  • కృష్ణా జలాల వాటాల నిష్పత్తిపై ప్రస్తుత నీటి సంవత్సరానికి సంబంధించి పునః సమీక్షించాలి.
  • ఏపీ అక్రమంగా చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌, రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ కుడి కాలువ పనులను వెంటనే నిలిపేయాలి.
  • పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను ఏపీ.. అక్రమంగా బేసిన్‌ అవతలి ప్రాంతాలకు మళ్లిస్తున్నది. ఆ మళ్లింపును అడ్డుకోవాలి.
  • పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం తెలిపినందున బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డును అనుసరించి తెలంగాణకు అదనంగా 45 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలి.
  • తాగునీటి కోసం కేటాయించిన మొత్తం జలాల్లో 80 శాతం తిరిగి నదిలోకే వస్తాయని, అందువల్ల తాగునీటి కేటాయింపులను కేవలం 20 శాతంగానే పరిగణనలోకి తీసుకోవాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ తేల్చిచెప్పింది. దాని ప్రకారం కృష్ణా జలాల్లో హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు కేటాయించిన 16 టీఎంసీల్లో కేవలం 20 శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
  • ఏటా తెలంగాణ వాడుకోకుండా మిగిల్చిన కృష్ణా జలాలను క్యారీ ఓవర్‌గా పరిగణించి మరుసటి ఏడాది ఆ నీటిని వాడుకొనే వెసులుబాటు కల్పించాలి.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana