e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home Top Slides కనిపించే దేవుళ్లు

కనిపించే దేవుళ్లు

 • మన వైద్యులు .. ప్రత్యక్ష
 • ఏడాదికిపైగా వైద్యసిబ్బంది అలుపెరుగని సేవలు
 • పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్‌లతో నిత్యం నరకం
 • శారీరక, మానసిక ఒత్తిడి తట్టుకొంటూ రోగులకు చికిత్స
 • పనిభారం తగ్గించకపోతే మున్ముందు దారుణ పరిస్థితి
 • కరోనావేళ వైద్యులకు అండగా నిలవటం అందరి బాధ్యత
కనిపించే దేవుళ్లు

అడుగు దూరంలో మృత్యువు కాచుక్కూచొని ఉన్నది. కంటికి కనిపించని చిన్న పురుగు.. చాన్స్‌ ఇస్తే చాలు.. క్షణమాత్రంలో శరీరంలోకి చొచ్చుకుపోయి.. ప్రతి అంగాన్ని ఉక్కిరిబిక్కిరిచేసి ఉసురు తీయడానికి సిద్ధంగా ఉన్నది. ఎదురుగా రోగి ఊపిరాడక అల్లాడిపోతున్నాడు. దగ్గరకు వెళ్తే పురుగు కాటేస్తుంది. వెళ్లకుంటే.. రోగిని అంతంచేస్తుంది. కష్టమైన పరిస్థితి. ఎలాగైనా రోగిని కాపాడాలి. అందుకు మహమ్మారిని ఎదుర్కోవాలి.
మన వైద్యుల ముందున్న లక్ష్యం ఒక్కటే. ప్రాణాలను కాపాడటం. ఇందుకోసం ఎంతటి హాలాహలాన్నైనా గొంతులో బిగించిపట్టుకొని.. మాయాయుద్ధం చేస్తున్న కొవిడ్‌ను అంతంచేయడమే పరమ విధి. ప్రాణం పోయినా సరే.. మరో ప్రాణం నిలబెట్టాల్సిందే.
వారు.. మన వైద్యులు.. కనిపించే దేవుళ్లు.
నిత్యం కరోనా రోగులతోనే ఉంటున్న డాక్టర్ల మనోధైర్యం ఏపాటిది? ఒక ప్రాణాన్ని నిలిపేందుకు ఎంత తపించినా అది ఫలించకపోతే వాళ్ల హృదయాలు ఎంతలా తల్లడిల్లుతాయో అంచనా వేయగలమా?

వాళ్ల మనసు ఎంత కకావికలమవుతుందో చెప్పగలమా? ఎంతో ఒత్తిడి.. మరెంతో సంఘర్షణ.. అయినా రాత్రి, పగలు తేడా లేకుండా రోగుల సేవలో నిమగ్నమవుతున్నారు. తోటి సహచరులే వైరస్‌కు బలవుతుంటే గుండెను బండరాయి చేసుకొని ఆత్మైస్థెర్యం కోల్పోకుండా కరోనా మహమ్మారిపై పోరాడుతున్నారు.
కుటుంబాలను వీడి, పిల్లలకు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ లోలోపల నరకం అనుభవిస్తున్నా, పైకి మాత్రం చిరునవ్వుతో వైద్యసేవలు అందిస్తున్నారు. మనల్ని కాపాడుతున్న వైద్యులను ఇప్పుడు మనం కాపాడుకోవాలి. వాళ్లు నిరాశ, నిస్పృహల్లోకి జారిపోకుండా దన్నుగా నిలవాలి.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ఒకటి కాదు, రెండు కాదు.. ఏడాదిగా అలుపనేదే లేకుండా వైద్యులు కరోనా సేవలు అందిస్తున్నారు. వైరస్‌ సోకిన రోగుల మధ్యే ఉంటూ, వాళ్లను కాపాడుతూ, తమను తాము కాపాడుకుంటున్నారు. వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, దాని ప్రభావం దారుణంగా ఉంటుందని తెలిసినా నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్లకు వైరస్‌ అంటించినవాళ్లమవుతామని కుటుంబానికి, వాళ్ల ఆత్మీయస్పర్శకు దూరంగా ఉంటున్నారు. విపరీతమైన పనిభారంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరు డిప్రెషన్‌లోకి జారుకొంటున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే, విధినిర్వహణలో పీపీఈ కిట్‌ కచ్చితంగా ధరించాల్సిందే. మాస్కులు పెట్టుకోవాల్సిందే, గ్లౌజ్‌లు తొడుక్కోవాల్సిందే. ఉక్కపోతకు అల్లాడిపోతున్నా గంటల పాటు వాటిని ధరించి డ్యూటీ చేస్తున్నారు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు, ఫంగస్‌ వస్తున్నా, మాస్కు వల్ల తగినంత ఆక్సిజన్‌ అందకున్నా అంకితభావంతో విధులు కొనసాగిస్తున్నారు.

నిబంధనలు పాటించరా?
కరోనాను తరిమికొట్టే బాధ్యత డాక్టర్లదే కాదు.. మనందరిది. కానీ కొందరు కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. వ్యాక్సిన్‌ కేంద్రాలలో గందరగోళం సృష్టిస్తున్నారు. ముందు టీకా వేయాలని గొడవచేస్తున్నారు. ఏ మాత్రం సంయమనం పాటించకుండా డాక్టర్లను, వైద్య సిబ్బందిని దూషిస్తున్నారు. ఇలాంటి చర్యలు డాక్టర్లను మరింత ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. ఒకవైపు పనిభారం, మరోవైపు ఛీత్కారాలు, బెదిరింపులు ఎదురవుతున్నా వాటన్నింటినీ తట్టుకొని పోరాట పటిమతో ముందుకుసాగుతున్నారు. ఇలాంటి చర్యలకు మనవంతుగా అడ్డుకట్ట వేయాల్సిందే. డాక్టర్లకు తోడుగా ఉండటం అంటే.. మన ఆరోగ్యానికి మనం భరోసా ఇచ్చుకొన్నట్టే.

వైద్య సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • గంటల తరబడి ఒక్కరే విధులు నిర్వహించకుండా, విరామం తీసుకుంటూ ఫిఫ్ట్‌లవారీగా పనిచేయాలి.
 • పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి, ఉదయం పూట శ్వాసక్రియ మెరుగుపర్చే వ్యాయామాలు చేయాలి.
 • ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ధ్యానం ప్రాక్టీసు చేయాలి.
 • విరామ సమయాల్లో కుటుంబ సభ్యులతో, స్నేహి తులతో కరోనాకు సంబంధం లేని అంశాలు మాట్లాడాలి.
 • సంగీతం వినడం, పుస్తకాలను చదవటం అలవర్చుకోవాలి.

ప్రజలారా బాధ్యత మనదే..

 • అత్యవసరమైతేనే దవాఖానలకు వెళ్లాలి. పరీక్షలు చేయించుకోవాలి.
 • కరోనా టెస్టింగ్‌, వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద సంయమనం పాటించాలి.
 • అనవసరంగా వైద్యసిబ్బందికి ఫోన్లు చేయవద్దు. వారిని చికాకు పెట్టవద్దు.
 • వీలైతే కొవిడ్‌ రోగులకు సేవలు చేసేందుకు స్థానికులు సహకరించాలి.

ఒత్తిడిని దూరం చేసుకోవాలి

 • ఏడాదికిపైగా వైద్యసిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల కొంత ఆందోళనకు గురయ్యే అవకాశముంది. సెకండ్‌ వేవ్‌ ఉధృతితో ప్రస్తుతం మరింత భయం ఆవహించింది. అయినా వైద్యసిబ్బంది ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. గతం కంటే మెరుగైన పరికరాలు, చికిత్స అందుతున్నది. ధైర్యంగా ఉండండి. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా విధులు నిర్వర్తించండి.
 • డాక్టర్‌ ఉమాశంకర్‌, సూపరింటెండెంట్‌, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం

ధ్యానం చేయండి.. పాటలు వినండి
వైద్యసిబ్బంది ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన పనిలేదు. యోగా, ధ్యానం చేయండి. ఇష్టమైన వ్యక్తులతో, సన్నిహితులతో తరచూ సంభాషించండి. అయినా మనసులో ఆందోళన ఉంటే కౌన్సెలింగ్‌ తీసుకోండి.

 • డాక్టర్‌ ఎంఎస్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌, హైదరాబాద్‌

ప్రశాంతతతో విధులు నిర్వర్తించండి
వైద్యసిబ్బందికి క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనిభారం పెరిగింది. అయినా ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకువెళ్తున్నాం. కిందిస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. ఉద్రేకాలకు లోనుకాకుండా, ప్రశాంతంగా విధులు నిర్వర్తించేలా వారిని మోటివేట్‌ చేస్తున్నాం.

 • డాక్టర్‌ ధర్మానాయక్‌, ఎల్లారెడ్డిపేట పీహెచ్‌సీ, రాజన్న సిరిసిల్ల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కనిపించే దేవుళ్లు

ట్రెండింగ్‌

Advertisement