e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home Top Slides వీహబ్‌ నుంచే స్టార్టప్‌ బిలియనీర్‌

వీహబ్‌ నుంచే స్టార్టప్‌ బిలియనీర్‌

  • ఈ రికార్డు సాధించే మహిళ హైదరాబాదీ కావాలి
  • స్టార్టప్‌లకు అత్యంత అనుకూల రాష్ట్రం తెలంగాణ
  • ఇతర రాష్ర్టాల స్టార్టప్‌లు కూడా ఇక్కడికొస్తున్నాయి
  • ఔత్సాహిక మహిళా పారిశ్రామికులకు అండగా ఉంటాం
  • శిక్షణ పూర్తిచేసుకున్న 47 స్టార్టప్‌లు ఆశ్చర్యపరిచాయి
  • ‘వీహబ్‌ గ్రాడ్యుయేషన్‌’లో పరిశ్రమల మంత్రి కేటీఆర్‌
  • మహిళల కోసం వీహబ్‌ మూడు కొత్త కార్యక్రమాలు

హైదరాబాద్‌, జూలై 28 (నమస్తే తెలంగాణ): మన దేశంలో ఒక మహిళ నేతృత్వంలో బిలియన్‌ డాలర్ల (రూ.7,500 కోట్లు) కంపెనీగా ఎదిగిన మొదటి స్టార్టప్‌ (యూనికార్న్‌) హైదరాబాద్‌ నుంచే రావాలని, ప్రత్యేకించి అది వీహబ్‌ నుంచే ఉండాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని వీహబ్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న 47 స్టార్టప్‌లకు బుధవారం ప్రత్యేకంగా ‘గ్రాడ్యుయేషన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘టెక్‌ షోకేజ్‌’ నిర్వహించి 22 స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఇందులో విద్య, వైద్యం, ఇన్‌ఫ్రాటెక్‌, ఓషన్‌టెక్‌ తదితర సంస్థలున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ టెక్‌ షోకేజ్‌ను పరిశీలించారు. మహిళా పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఆయా స్టార్టప్‌ల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన స్టార్టప్‌లే కాకుండా ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల స్టార్టప్‌లు హైదరాబాద్‌కు వచ్చి వీహబ్‌తో కలువడం గొప్ప విషయమన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడానికి వీహబ్‌ చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని అభినందించారు.

ముఖ్యంగా సముద్రాలకు సంబంధించిన ఓషనోగ్రఫీ స్టార్టప్‌ను హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభించడం, ఇక్కడి వనరులు, ప్రోత్సాహానికి అద్దం పడుతున్నదని తెలిపారు. వీహబ్‌ శిక్షణ పూర్తిచేసుకున్న 47 స్టార్టప్‌ల ఆలోచనలన్నీ అద్భుతంగా ఉన్నాయని, కొన్నింటిని చూసి తాను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని కొనియాడారు. మన దేశంలో మహిళ నేతృత్వంలో ఒక బిలియన్‌ డాలర్ల (రూ.7,500 కోట్లు) కంపెనీగా ఎదిగిన మొదటి స్టార్టప్‌ (యూనికార్న్‌) హైదరాబాద్‌ నుంచే రావాలని, ముఖ్యంగా అది వీహబ్‌కు చెందినదై ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేవారిని ప్రోత్సహిస్తుందని చెప్పారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు వీహబ్‌ మూడు నూతన కార్యక్రమాలను ప్రారంభించడం గొప్ప విషయమన్నారు.

- Advertisement -

మన ముందు తరాలకు లేని గొప్ప అవకాశం ఇప్పుడు ఉన్నదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కొత్త ఆలోచనతో ముందుకొచ్చి, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునేవారికి అనుకూలమైన వాతావరణం ఉన్నదని అన్నారు. ఎవరైనా స్టార్టప్‌ ప్రారంభించి కొత్త ఆలోచనతో ముందుకొస్తే తెలంగాణ ప్రభుత్వం శిక్షణ ఇవ్వడమే కాకుండా.. దానిని కొనుగోలు చేసే మొదటి వినియోగదారునిగా మారుతుందని చెప్పారు. ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. ‘టెక్‌షోలో ప్రదర్శించిన స్టార్టప్‌ల ఆలోచనా స్థాయి, వాటిలోని భిన్నత్వం, లక్ష్యాలు నన్ను మంత్రముగ్ధున్ని చేశాయి. ముఖ్యంగా 22 మంది మహిళలు తమ ఆలోచనలను, ఉత్పత్తులను సమగ్రంగా వివరించారు. గత కొన్నేండ్లలో నేను చూసిన గొప్ప ఆవిష్కరణల్లో వీటికి చోటు దక్కుతుంది’ అని ప్రశంసించారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్నవారందరికీ ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని చెప్పారు.

కొత్తగా మూడు కార్యక్రమాలు
వీహబ్‌ సీఈవో దీప్తి రావుల మాట్లాడుతూ.. విద్యార్థినులు, యువతులు, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించేందుకు వీహబ్‌ ద్వారా మరో మూడు కొత్త కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. అవి..
1) ఉమెన్‌ ఇన్‌ డాటాసైన్స్‌: 100 మంది పాఠశాల విద్యార్థినులను ఎంపిక చేసి, వారికి డాటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తోపాటు అనుబంధ టెక్నాలజీలు నేర్చుకునేలా సహకారం అందించనున్నారు. దీనికి విడ్స్‌ (ఉమెన్‌ ఇన్‌ డాటా సైన్స్‌) అని పేరుపెట్టారు. ఇందుకోసం త్వరలో హైదరాబాద్‌లో ‘గర్ల్స్‌ కాన్ఫరెన్స్‌’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం వివిధ రాష్ర్టాలకు చెందిన ఐదు పాఠశాలలతో ఒప్పందం చేసుకోగా.. ఇందులో తెలంగాణ స్కూళ్లు రెండు ఉన్నాయి. ఎంపిక చేసిన విద్యార్థినులకు ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శిక్షణ ఇవ్వనున్నది.
2) గ్రేటర్‌ 50%: కాలేజీ యువతులు స్టార్టప్‌ల దిశగా అడుగులు వేసేందుకు ఫిక్కీ సహకారంతో ‘గ్రేటర్‌ 50%’ పేరుతో మరో కార్యక్రమం చేపట్టనున్నారు. స్టార్టప్‌ పెట్టాలనే ఆలోచన ఉన్నవారికి వీహబ్‌, ఫిక్కి కలిసి మార్గనిర్దేశనం చేస్తాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రీ ఇంక్యుబేషన్‌ దశలో ఉన్న 100 మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 స్టార్టప్‌లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
3) వీ ఆల్ఫా: వీహబ్‌, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదు టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ కలిసి 50 మంది విద్యార్థినులకు స్టార్టప్‌లపై శిక్షణ ఇవ్వనున్నాయి. ఇందులో భాగంగా ముందుగా ఎంపికచేసిన స్కూల్‌, కాలేజీ అధ్యాపకులకు స్టార్టప్‌ల గురించి శిక్షణ ఇస్తారు. వారు తమ విద్యాసంస్థలోని ఆసక్తికలిగిన విద్యార్థులను గుర్తించి, వారి ఆలోచనను మరింత మెరుగుపరిచేందుకు సహాయం చేయనున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana