e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home Top Slides కొంచెం ఆశ.. కొంచెం ధైర్యం

కొంచెం ఆశ.. కొంచెం ధైర్యం

  • కాగ్నిటివ్‌ వ్యాక్సిన్‌ వేసుకొందాం
  • ఇవీ.. సమాజానికి నేటి అవసరాలు
  • ప్రతికూల కథనాలతో జనం బెంబేలు
  • భయంగొల్పుతున్న ప్రసార సాధనాలు
  • కరోనా కన్నా డేంజర్‌.. నెగెటివ్‌ వార్తలు
  • ఆరోగ్యంగా ఉన్నవారి గుండెల్లోనూ దడ
  • నైతిక ైస్థెర్యం, భరోసా ఇచ్చే వార్తలే లేవు
  • ఈ తీరు మారాలంటున్న సైకాలజిస్టులు
కొంచెం ఆశ.. కొంచెం ధైర్యం

ఫలానా దవాఖానలో ఇవాళ ఒక్కరోజే అంతమంది చనిపోయారు. అమ్ముకోవడం కోసం 250 పాయింటులో పతాక శీర్షిక పెడుతుందొక పత్రిక. ప్రాణాలు కాపాడే ఆ మందులు మార్కెట్లో దొరకటమే లేదు. పేజ్‌ వ్యూస్‌ కోసం గ్రాఫిక్‌ ప్రజెంటేషన్‌తో బెంబేలెత్తిస్తుంది ఒక వెబ్‌సైట్‌. అదిగదిగో వచ్చేస్తున్నది థర్డ్‌వేవ్‌.ఈ దెబ్బతో మీ ప్రాణాలు మఠాష్‌.టీఆర్‌పీ రేటింగ్‌ కోసం గొంతు పగిలిపోయేలా అరుస్తుంది ఒక యాంకరమ్మ. ఆ దవాఖానలో అసలేం జరుగుతున్నది.. శవాలను కూడా మంచాలపై వదిలేస్తున్నారు. రాజకీయ సంచలనం కోసం బతికున్న వారినీ చంపేసి చూపిస్తుంది మరో పత్రిక.

కరోనా ఇంతమందికి వచ్చిందంటుంది ఒక సర్వే. అందరికీ టీకా అసాధ్యమనే విశ్లేషణ వినిపిస్తుంది ఒక బ్లాగ్‌. ఇక వాట్సాప్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. అది పనికిరాని మెసేజ్‌ల చెత్తకుప్ప. ఎటు పోతున్నం మనం? ఏం చేస్తున్నం మనం? యుద్ధాలు, విపత్తులు, మహమ్మారులు వచ్చినప్పుడు మనుషులుగా మనం పాటించాల్సిన ధర్మాలు కొన్ని ఉంటాయి. బతికున్నవారిని కాపాడుకోవటమే అప్పుడు అందరి ప్రథమ కర్తవ్యం. ప్రతి ఇల్లూ రోగుల బందిఖాన అయినప్పుడు, ప్రపంచమే ఒక దవాఖాన అయినప్పుడు ఎన్ని హాస్పిటళ్లని సరిపోతాయి!

ఎందరు డాక్టర్లు, ఎంతమంది నర్సులు సరిపోతారు! అన్ని సందర్భాల్లో డబ్బులు, వనరులే కాపాడలేవు. కరోనాతో మరణించిన వారిలో బీహార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. యూపీ మంత్రి ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నారు. ప్రఖ్యాత జర్నలిస్టులూ ఉన్నారు. కో అంటే కోటి గుమ్మరించగల, కొండ మీది కోతిని కూడా తన పలుకుబడితో దించగల ఎందరో కరోనా దెబ్బకు చనిపోయారు. ఎందుకు? ఇది ప్రపంచమే కనీవినీ ఎరుగని విపత్కర సమయం.

ఇప్పుడు మందుల కొరత వేధిస్తుండవచ్చు. కానీ మున్ముందు ఎదురయ్యేది మానవ వనరుల (వైద్య సిబ్బంది) కొరత అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కరోనా వచ్చిన వారిలో, ముఖ్యంగా సెకండ్‌వేవ్‌లో, పానిక్‌ అటాక్‌ (భయం వల్ల వచ్చే గుండెపోటు)తో చనిపోయే వారు ఎక్కువగా ఉన్నారని విశ్లేషణలు చెప్తున్నాయి. గతంలో గత్తర్లు వచ్చినపుడు ఒక ఊరి సమాచారం మరొక ఊరికి తెలిసేదే కాదు. దానివల్ల ముందు జాగ్రత్తలు తీసుకోలేక అనేకమంది చనిపోయేవారు. అందువల్ల నేటి కమ్యూనికేషన్‌ యుగంలోనైనా మంచి సమాచారాన్ని పంచుకునే ప్రయత్నం చేయకుండా.. భయపెట్టడం, బెంబేలెత్తించడం, రాళ్లేయడం, బురదజల్లడం వల్ల జరిగేదేమీ లేదు.. మరింత అనర్థం తప్ప! ఒరిగేదేమీ లేదు.. మరింత నష్టం తప్ప!

ఉన్న వనరులను కాపాడుకొంటూ, ఒకరికొకరం ధైర్యం చెప్పుకొంటూ, చేయిచేయి కలిపి కష్టాల్లో ఉన్నవారికి సాయంగా నిలిచినప్పుడే.. మనిషి మనుగడ సాగించేది.. మానవాళి నిలిచి గెలిచేది. పాఠకులకు మార్గదర్శనం చేయాల్సిన మీడియా.. ప్రజల చేత పాఠాలు చెప్పించుకొనే దుస్థితికి దిగజారడం ఆందోళనకరం. పాజిటివ్‌ స్టోరీలు ప్రచురించండి అంటూ వస్తున్న విజ్ఞప్తులే ఇందుకు నిదర్శనం. మనం ఇకనైనా మారుతామా? మారుదామా?

కొంచెం ఆశ.. కొంచెం ధైర్యం

హైదరాబాద్‌, మే 23 (నమస్తే తెలంగాణ): ‘కరోనాకు ధైర్యమే మందు’.. ఇది అందరూ ఒప్పుకొంటున్నదే. వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు.. ఎవరిని అడిగినా ధైర్యంగా ఉండండి.. అది మీకు కావాల్సినంత భరోసా కల్పిస్తుంది.. ఇమ్యూనిటీని పెంచుతుంది.. దానితో కరోనాపై విజయం సాధించవచ్చని చెప్తున్నారు. కానీ పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయేదాకా పత్రికల్లో, టీవీ చానళ్లలో మారుమోగిపోతున్న నెగెటివ్‌ వార్తలు, కథనాలను చూసి, చదివి ప్రజల్లో ఒకరకమైన భయం తలెత్తుతున్నది. ఇక జీవితం చరమాంకానికి వచ్చేసింది, మనల్ని ఎవరూ కాపాడలేరు, కరోనా నుంచి రక్షించుకోవడం మనవల్ల కాదనే స్థాయికి ప్రజలు చేరుకుంటున్నారు. మానసిక ఆందోళనతో శారీరకంగా బలహీనమైపోతున్నారు. ఇక్కడే మనిషి కరోనాకు దొరుకుతున్నాడు. అప్పటివరకు పోరాడినవారు కాస్తా స్వల్పకాలంలోనే చతికిలపడిపోయి చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో భయపెట్టడం కన్నా.. భయాన్ని పారదోలేలా మనిషిని సిద్ధంచేసే కాగ్నిటివ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వటం అవసరమని సైకాలజిస్టులు చెప్తున్నారు.

రోజూ అదే తీరు..
‘వైద్యం అందక చావాల్సిందేనా?’.. దాదాపు పది రోజుల క్రితం ఒక ప్రధాన దినపత్రిక మొదటి పేజీలో వచ్చిన వార్త ఇది. ఇలాంటి వార్తలతో బెంబేలెత్తిపోయిన ప్రజల్లో.. ఖర్మకాలి కరోనా సోకితే ఇక వైద్యం అందదని, తాము చావాల్సిందే అనే ఆలోచన మెదడులో పాతుకొని పోతున్నది. ప్రజల్లో ఆత్మైస్థెర్యం, ధైర్యం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధమే చేస్తున్నది. కానీ.. ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అర్థం వచ్చేలా ఆ వార్తను ప్రచురించారు. మరో రెండు రోజుల తర్వాత ‘కుటుంబాల్లో కల్లోలం’ అంటూ కుటుంబాలకు కుటుంబాలు చనిపోతున్నాయనే భావం వచ్చేలా కథనాన్ని అల్లారు. కనీసం పల్లెల్లోనైనా ప్రజలు నిశ్చింతగా ఉన్నారనుకుంటున్న పరిస్థితి లేదని.. అక్కడకూడా మహమ్మారి విజృంభించి ఊళ్లకు ఊళ్లను కబళిస్తున్నదంటూ మరో కథనం. ఆపై ‘ఇలాగైతే కష్టమే’ అంటూ ఒక నిపుణుడి ఇంటర్వ్యూ. ఆ తర్వాత రెండు రోజులు అయ్యిందో లేదో.. ‘ప్రాణాల కోసం పోరాటం’ అంటూ మరో ప్రధాన కథనంతో ప్రజలను భయపెట్టారు. ఇక బతికి ఉన్న వ్యక్తి చనిపోయాడంటూ వార్తను అల్లేసిందొక పత్రిక. ఇలాంటి కథనాలతో సామాన్యులు చిగురుటాకులా వణిపోతున్నారు. నెగిటివ్‌ వార్తలు, కథనాలు చూడవద్దని, చూపించవద్దని వైద్యులు, మానసిక నిపుణులు, శాస్త్రవేత్తలు నెత్తినోరు బాదుకుని చెప్తున్నా సోకాల్డ్‌ ప్రసారమాధ్యమాలకు నైతికత గుర్తుకు రాకపోవడం విషాదం. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో మీడియా ప్రజల్లోకి నెగెటివ్‌ ఆలోచనలు చొప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మనమే నయం
మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 34.38 లక్షల మంది మరణించారు. మన దేశంలో 3 లక్షల మంది ప్రాణాలు వదిలారు. తెలంగాణలోనూ కొందరు చనిపోయారు. మిగతా రాష్ర్టాలతో పోల్చితే మన దగ్గర మరణాల శాతం చాలా అత్యంత స్వల్పంగా ఉన్నదని అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒక మంత్రి కరోనాతో చనిపోయారు. బీహార్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కొవిడ్‌ కబళించింది. సుప్రీంకోర్టు జడ్జిని కూడా బలితీసుకుంది. వీళ్ళందరికీ చికిత్స అందకనా? వైద్యం చేయించుకొనే స్థోమత లేకనా? అన్నీ ఉన్నా కరోనా తీవ్రత కారణంగా వారు మరణించారు. అలాగే సామాన్యులు కూడా కొందరు చనిపోయారు. కానీ వైద్యం అందించకపోవడం వల్లనే చనిపోయారనే అర్థం వచ్చేలా కొన్ని మీడియా సంస్థలు వార్తా కథనాలను వండి వార్చుతున్నాయి. ఇలాంటి కథనాలు వద్దంటూ వాట్సప్‌లో ఒక మెసేజ్‌ చక్కర్లు కొడుతున్నది. నిత్యం హాస్పిటళ్లు, బాధిత కుటుంబాలు, రగులుతున్న చితిమంటలు చూపించడం ద్వారా భయాందోళనలు రేకెత్తిస్తున్నారనేది ఆ మెసేజ్‌ సారాంశం. ఆరోగ్యవంతులు సైతం అనారోగ్యానికి గురయ్యేలా ఉన్న ఇటువంటి వార్తలకు బదులు.. ఆక్సిజన్‌ ఎక్కడ దొరుకుతుంది? అంబులెన్స్‌ సర్వీసులు వంటి విషయాలు ఇవ్వాలని అందులో కోరారు.

కరోనా కంటే ప్రమాదకరం..
నెగెటివిటీ కరోనాకన్నా ప్రమాదకరమని మానసిక వైద్య నిపుణులు మొదటి నుంచీ చెప్తూనే ఉన్నారు. ధైర్యమే కరోనాకు మందు అని వైద్యులు అంటూనే ఉన్నారు. దీన్నే కాగ్నిటివ్‌ వ్యాక్సిన్‌గా పిలుస్తున్నారు. ప్రజలు భయాన్ని వీడటమే కాగ్నిటివ్‌ వ్యాక్సిన్‌. ఇప్పుడు కావాల్సింది ఇదే. మీడియా మాత్రం నెగెటివిటీ వైపే ప్రజలను తరుముతున్నది. తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా కనపడుతున్నది. ఇతర రాష్ర్టాల్లో కంటే మనరాష్ట్రంలో పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. ప్రభుత్వం ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నది. కరోనా నియంత్రణకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నది. అయినా చిన్న సంఘటనను భూతద్దంలో పెట్టి చూపించి ప్రజల మనసుల్లో కల్లోలం సృష్టించేలా కొన్ని పత్రికలు, చానళ్లు కథనాలు వండివార్చుతున్నాయి. చాలామంది ఈ తరహా వార్తలు చూడలేక, యాంకరమ్మలు, యాంకరయ్యలు గొంతు చించుకుని చెప్పే ‘బాధలు’ వినలేక టీవీలు కట్టేస్తున్నారు. ప్రభుత్వం మీద, వైద్య వ్యవస్థ మీద దుష్ప్రచారం చేసి.. వాటిని నిర్వీర్యం చేసేలా ప్రయత్నిస్తే దాని దుష్ఫలితాలు ఎదుర్కొనేది, అంతిమంగా నష్టపోయేది ప్రజలే. ప్రస్తుతం కొవిడ్‌పై యుద్ధంలో ముందు శ్రేణిలో నిలబడి పోరాడుతున్నవారిలో కీలకమైనది వైద్యులు, వైద్య సిబ్బందే. ప్రభుత్వ దవాఖానలు కావచ్చు, ప్రైవేటు వైద్యశాలలు కావచ్చు.. 24గంటలూ అక్కడి వైద్యులు, సిబ్బంది కొవిడ్‌ బాధితుల సేవలో నిమగ్నమై ఉన్నారు. కరోనా మహమ్మారి దొంగదెబ్బ తీస్తున్నది. ఒక రోజు బాగున్న వ్యక్తి.. తెల్లారేసరికి చనిపోతున్నారు. దీనికి వైద్యులను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసం? వైద్య వ్యవస్థ ఈ ఒత్తిడిని భరించలేని పరిస్థితి తలెత్తితే.. రోగులకు చికిత్స అందించేది ఎవరు? మునుపెన్నడూ ఎరుగని పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమాజానికి కావాల్సింది కాస్తంత ఆశ.. మరికొంత ధైర్యం. ఇవే కరోనాపై పోరాటంలో కొత్త శక్తిని ప్రసాదిస్తాయి. రక్కసి వైరస్‌ను ఓడిస్తాయి.

పాజిటివ్‌గా ఉండాలి..
గతేడాది థాయిలాండ్‌లో గుహలో చిక్కుకున్న ఫుట్‌బాల్‌ విద్యార్థులు చాలా రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. చిమ్మ చీకట్లో దాదాపు నెలరోజులు అన్నపానీయాలు లేకుండా బతికి, బయటపడ్డారు. ఈ అద్భుతం వెనుక.. ఆ జట్టు కోచ్‌ అందించిన స్ఫూర్తి, ఆయన పాజిటివ్‌ థింకింగ్‌ ఉన్నది. ప్రపంచం కలవరపడుతున్న వేళ.. మీడియాలో రావాల్సింది ఇలాంటి పాజిటివ్‌ స్టోరీలేననేది నిపుణుల మాట. కరోనా బారినపడి కోలుకున్న వందేండ్ల బామ్మ గురించి, ఆమె కోలుకున్న విధానాన్ని గురించి రాసే, చేప్పే కథనం రోగులకు వెయ్యి రెట్ల బలాన్నిస్తుందని సైకాలజిస్టులు అంటున్నారు. ఇదేకాదు.. ఎక్కడెక్కడ ఆక్సిజన్‌ దొరుకుతుంది? ప్లాస్మా దాతలు ఎవరున్నారు? ఏయే దవాఖానల్లో ఎన్నెన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి? అంబులెన్సు సేవలు, కరోనా పేషెంట్లకు, బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం ఎక్కడెక్కడ అందుతుందో తెలియజేయవచ్చు. ఇలాంటివాటిని కొన్ని మీడియా సంస్థలు అసలు పట్టించుకోవటమే లేదు.

చింత వీడితేనే బతుకు

కొంచెం ఆశ.. కొంచెం ధైర్యం

కొన్నిసార్లు అంగాంగాలూ అచేతనమవుతాయి. చేతుల్లో, కాళ్లల్లో చేవ చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. విశ్వాసం విరిగిపోయి, దేహం దేహమే దేహీ అంటూ దైన్యంలోకి, అధైర్యంలోకి జారిపోతుంది. ఎవరో వచ్చి జీవితంలోని సంతోషాన్నంతా అమాంతం మాయం చేసినట్టు, భవిష్యత్తుపై ఆశలను ఆవిరి చేసినట్టు, మన కలలన్నీ విరిగి, కరిగిపోయినట్టు అనిపిస్తుంది. పచ్చటి జీవితాన్ని కష్టాల సుడిగుండంలోకి విసిరేసినట్టుగా మారుతుంది.

కానీ అనిపించినవన్నీ అట్లాగే ఉండిపోవు. కనిపించినవన్నీ కలకాలం నిలిచిపోవు. అందుకు ఈ చెట్లే నిదర్శనం. వందేండ్ల వయసున్న చింతచెట్లివి. ఒకరు వద్దనుకున్నారు. కొట్టి పారేయబోయారు. కానీ మరొకరు కావాలనుకున్నారు. మళ్లీ నాటుకున్నారు.

పచ్చగా కనిపించకపోవచ్చు. కానీ లోపల బతుకు పచ్చిదనం ఉండే ఉన్నది. ఇప్పుడు ఆకులు లేకపోవచ్చు. కానీ చివుర్లు తప్పక వేస్తాయి. కొమ్మలు విరిగి ఉండవచ్చు. కానీ కొత్త రెమ్మలు తప్పక వస్తాయి. శిశిరం వెనుక వసంతం వస్తూనే ఉంటుంది. చింత చెట్టుకైనా, చింతల జీవితానికైనా! ఆశే అసలు ఊపిరి! పోరాటమే ప్రాణం! ధైర్యమే జీవితం!

ఇవి వందేండ్ల క్రితం నాటి చింత చెట్లు. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అడ్డంకిగా మారాయి. ఆయన గ్రామ సర్పంచ్‌ను సంప్రదించాడు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం శ్రీరాంనగర్‌కు చెందిన సునీల్‌చౌదరి అనే మరో వ్యక్తి ముందుకొచ్చి,ఆ చెట్ల కొమ్మలను నరికి, వేర్లతో సహా షాబాద్‌ మండలం సోలిపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో రీ ప్లాంటేషన్‌ చేశారు.

కాగ్నిటివ్‌ వ్యాక్సిన్‌ కావాలి
మీడియాలో నెగిటివ్‌ వార్తలను చదివి, చూసి మన మెదడు మొత్తం వాటితోనే నిండిపోతున్నది. దాంతో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. శారీరకంగా బలహీనులవుతారు. మీడియా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. వార్తలపరంగా 10-20% సంఘటనలను చెప్పవచ్చు. మిగతా 80% తప్పకుండా పాజిటివ్‌ వార్తలే ఉండాలి. కరోనా రోగులకు ఎవరు ఎన్ని విధాలుగా సహాయం చేస్తున్నారనేది రోజూ ఇవ్వాలి. వారిలో భరోసా పెరుగుతుంది. సానుకూల ఆలోచనలు పెరిగి ఇమ్యూనిటీ కూడా వృద్ధిచెందుతుంది. దాంతో ఎలాంటి వైరస్‌ అయినా, సమస్యలనైనా మనిషి ఎదుర్కోగలడు. దీనినే కాగ్నిటివ్‌ వ్యాక్సిన్‌ అంటారు. అశాస్త్రీయ, అజ్ఞాన, అనారోగ్యకరమైన వాటిని పట్టించుకోకుండా ఉండటం చాలా ముఖ్యం. అంతరిక్షంలో పరిశోధకులు అంతకాలం ఎలా ఉంటారు? ఈ కాగ్నిటివ్‌ వ్యాక్సిన్‌ వల్లనే. మోటబావిలోకి దిగే వ్యక్తి తనకేం కాదని, ఇలాంటివి ఎన్నో చూశానని పాజిటివ్‌గా ఆలోచిస్తాడు. అందుకే అతడికి ఏమీకాదు. నెగిటివ్‌ ఆలోచనలు వస్తే అక్కడే గుండె ఆగిపోతుంది. మనిషి ఆలోచనలతోనే చనిపోతాడు.. రోగాలతో కాదు. అందుకే పాజిటివ్‌ ఆలోచనలు ముఖ్యం.

  • డాక్టర్‌ సీ వీరేందర్‌, సైకాలజిస్ట్‌

నెగిటివిటీ ప్రాణాలు తీస్తుంది
ధైర్యం ప్రాణాలు పోస్తుంది. నెగిటివిటీ ప్రాణాలు తీస్తుంది. మన చుట్టుపక్కల జరిగిన సంఘటనలను నిరంతరం చూసినా.. చదివినా.. మనకేదో అయిపోతుంది.. మనంకూడా చనిపోతామనే నెగిటివ్‌ ఆలోచనలు పెరుగుతాయి. దీనితో మనిషి బలహీనం అవుతాడు. నెగిటివ్‌ వార్తలు చదివి, చానళ్లు చూసి మన పరిస్థితి కూడా ఇంతే అనుకుంటారు. దీనితో వందల మంది వైద్యులు, సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు చేసిన శ్రమంతా వృథా అవుతుంది. ప్రభుత్వం ఏమీ చేయట్లేదనే నెగిటివ్‌ ఫీలింగుతో సర్కారు తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న వసతులన్నీ నిర్వీర్యం అవుతాయి. వ్యతిరేక ఆలోచనలతో ఉన్న వ్యక్తిని ఏ రోగం అక్కరలేదు.. ఆయన భయమే ఆయన్ని చంపుతుంది. అసలే లాక్‌డౌన్‌ కారణంగా.. చాలాకాలంగా ఇంట్లోనే ఉంటున్నాం. బయటకు పోలేక, ఇంట్లో ఈ వార్తల ప్రభావంతో ప్రజల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పాజిటివ్‌ వార్తలు చూపించినా.. చదివినా ఒక ధైర్యం కలుగుతుంది. నెగిటివ్‌ వార్తలను చూపకపోవడమే మంచిది.

  • శోభన్‌కుమార్‌ పాకలపాటి, చీఫ్‌ సైకాలజిస్ట్‌, పినాకిల్‌ బ్లూమ్స్‌ నెట్‌వర్క్‌
కొంచెం ఆశ.. కొంచెం ధైర్యం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొంచెం ఆశ.. కొంచెం ధైర్యం

ట్రెండింగ్‌

Advertisement