e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home Top Slides ఇంటింటి సర్వే సఫలం

ఇంటింటి సర్వే సఫలం

 • తగ్గుముఖం పడుతున్న కేసులు
 • ఇంటింటి ఆరోగ్య సర్వేతో ముందస్తు చికిత్స
 • 16 జిల్లాల్లో పూర్తయిన ఇంటింటి ఆరోగ్య సర్వే
 • నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌తో తగ్గిన వైరస్‌ వ్యాప్తి
 • వ్యాక్సినేషన్‌తో పెరుగుతున్న హెర్డ్‌ ఇమ్యూనిటీ
 • ఇదే జోరు కొనసాగితే గండం గట్టెక్కినట్లే
 • ఇంటింటి సర్వేతో జరిగింది ఇదీ
 • ఎక్కడికక్కడే రోగుల గుర్తింపు.. కరోనా నిర్ధారణ
 • వ్యాధి తక్కువగా ఉన్నవారికి వెంటనే మందులు
 • ఫలితంగా వైరస్‌ తొలిదశలోనే గుర్తించి చికిత్స!
 • దవాఖానలపై తగ్గిన భారం.. రోగుల సంఖ్య క్షీణత
 • రోగుల ప్రయాణాలు తగ్గడంతో వైరస్‌ వ్యాప్తి కట్టడి
 • కుటుంబాలకు డబ్బు ఆదా.. నగరాలపై తగ్గిన ఒత్తిడి
 • కరోనాకాని ఇతర జ్వరాలకూ అందిన మందులు
  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం సర్వే బృందాలు : 27,171
  జ్వర బాధితులకు పంపిణీ చేసిన కిట్లు :1,75,747
  కొవిడ్‌ ఓపీలో స్క్రీనింగ్‌ల సంఖ్య :5,80,000
  పంపిణీ చేసిన హోం మెడిసిన్‌ కిట్లు :74,253
  పది రోజుల్లోనే అందించిన మొత్తం కిట్లు :2,50,000
  కేసులు తగ్గుముఖం
  ఇంటింటి ఆరోగ్య సర్వేతో ముందస్తు చికిత్స
  ఇదే జోరు కొనసాగితే గండం గట్టెక్కినట్టే
ఇంటింటి సర్వే సఫలం

కరోనా విషయంలో ఎప్పటికప్పుడు సమయానుకూల నిర్ణయాలతో వైరస్‌కు కళ్లెం వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా చేపట్టిన ఇంటింటి సర్వే సత్ఫలితాలను ఇస్తున్నది. ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తల సమన్వయంతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరినీ పరీక్షిస్తున్నారు. ఏ లక్షణం కనిపించినా.. మెడికల్‌ కిట్లు అందజేస్తూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. తీవ్ర లక్షణాలున్నవారికి కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్తున్నారు. ఒకపక్క లాక్‌డౌన్‌, మరోపక్క జ్వరసర్వేతో రాష్ట్ర ప్రభుత్వం కరోనాకు ముకుతాడు వేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటి సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రధాని మోదీ శనివారం.. దేశవ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడం విశేషం.

హైదరాబాద్‌, మే 15 (నమస్తే తెలంగాణ): కరోనా బారినుంచి ప్రజలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం సత్ఫలితాలిస్తున్నది. ఒకవైపు ఇంటింటా ఆరోగ్య సర్వేతో వైరస్‌ లక్షణాలున్న వారిని గుర్తించి సత్వర చికిత్స అందిస్తున్నది. మరోవైపు వ్యాక్సినేషన్‌, నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ అమలుచేస్తూ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నది. దీంతో దవాఖానల్లో అడ్మిట్‌ అయ్యే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుండగా, దాదాపు అన్ని జిల్లాల్లో కొత్త కేసుల నమోదు కూడా తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తున్నది.

నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌తో ఫలితాలు
రాష్ట్రంలో రెండు వారాలపాటు విధించిన రాత్రి కర్ఫ్యూ, మూడు రోజుల నుంచి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ వల్ల ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ప్రక్రియను నిలువరించడం వల్ల కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. హైదరాబాద్‌తోపాటు, అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుతున్నట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిరోజు 70 వేలకు పైగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, పాజిటివిటీ రేటు తక్కువగా నమోదవుతున్నది. ఈ చర్యలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కరోనా ప్రభావం మరింతగా తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సకాలంలో వైద్యం అందడంతో మరణాల రేటు తగ్గుతున్నదని, త్వరలో మరింత తగ్గే అవకాశం ఉన్నదని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

ప్రజల్లో పెరిగిన జాగ్రత్తలు
మొదటి వేవ్‌ సమయంలో కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రజలు, ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెండోవేవ్‌ మొదలై విజృంభించే వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే గత రెండు వారాల్లో ప్రజల్లో అప్రమత్తత పెరిగింది. 90శాతం మంది మాస్కులు ధరిస్తున్నారని, కరోనా భయం వారిని వెంటాడుతున్నదని వైద్యాధికారులు చెప్తున్నారు. లక్షణాలు కనిపించగానే పరీక్ష సెంటర్‌కు వెళ్లే వారి సంఖ్య పెరిగిందని, పాజిటివ్‌ రాగానే ఆందోళన చెందకుండా ప్రభుత్వం అందించిన కిట్లలోని మందులు వాడుతూ కోలుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్తున్నారు. కానీ, మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

పెరుగుతున్న హెర్డ్‌ ఇమ్యూనిటీ
ఒకవైపు సహజంగా పెరిగే ఇమ్యూనిటీకి తోడు, వ్యాక్సినేషన్‌ వల్ల ఏర్పడుతున్న హెర్డ్‌ ఇమ్యూనిటీతో సమాజంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వస్తున్నది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగంగా జరిగితే హెర్డ్‌ ఇమ్యూనిటీ పెరిగి వ్యాప్తి క్షీణించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 43 లక్షల మంది మొదటి డోసు తీసుకోగా, 11 లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారు. మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనూ మధ్యస్థంగా వైరస్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ అభివృద్ధి చెందుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా వచ్చిపోయిన వారిలో కల్గిన ఇమ్యూనిటీకి తోడు, వ్యాక్సిన్‌ వల్ల కలిగిన ఇమ్యూనిటీ వల్ల తెలంగాణలో దాదాపు 30% వరకు హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందినట్లు ఓ అంచనా. 18-44 ఏండ్ల మధ్య వయస్కులకు సైతం వ్యాక్సిన్‌ అందిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన 60శాతం హెర్డ్‌ ఇమ్యూనిటీని మార్కును చేరుకోవడం సులువవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కేసులు తగ్గాయి.. పడకలు ఖాళీ
ప్రభుత్వ తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రంలో మొత్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య కంటే డిశ్చార్జీల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. రోగుల రికవరీ రేటు జాతీయ సగటు కంటే తెలంగాణలోఎక్కువగా ఉంది. జాతీయ సగటు 83శాతం కాగా, రాష్ట్ర రికవరీ రేటు దాదాపు 90శాతంగా ఉంది. ఇక గత వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివిటీ రేటు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఆరోగ్య సర్వే కారణంగా ముందస్తు చికిత్స అందుతుండటంతో పడకల అందుబాటు పెరిగింది. సాధారణ, ఆక్సిజన్‌, ఐసీయూ పడకల కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చే వారి సంఖ్య తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు.

నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తి!
రాష్ట్రంలో 33 జిల్లాల్లో అన్ని పట్టణాలు, గ్రామాలు కలిపిమొత్తం 1,02,16,079 ఇండ్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 72,10,088 ఇండ్లలో సర్వే పూర్తయింది. మొత్తంగా 16 జిల్లాల్లో ఈ టీమ్‌లు సర్వే పూర్తి చేశాయి. ఇంకా కేవలం 30,05,991 ఇండ్లలో మాత్రమే సర్వే చేయాల్సి ఉన్నది. రాష్ట్రంలో మొత్తం 27,171 సర్వే బృందాలు పని చేస్తున్నాయి. ఇందులో గ్రామ పంచాయతీలలో22,011, జీహెచ్‌ఎంసీలో1,410, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 3,750 సర్వే చేస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో ఈ సర్వే మొత్తం పూర్తయ్యే అవకాశాలున్నాయి.

27 వేల బృందాలతో సర్వే
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే శరవేగంగా జరుగుతున్నది. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి నియంత్రణలో ఇంటింటి సర్వే సత్ఫలితాలిస్తున్నది. కరోనా వ్యాధిని ప్రాథమిక లక్షణాలున్నప్పుడే గుర్తించి ఇంటి వద్దనే వైద్యం అందించడం ద్వారా కట్టడిచేయాలని భావించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌తో సహా అన్ని గ్రామాలు, పట్టణాలలో ఇంటింటి సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతి వెయ్యిమందికి ఒక బృందం చొప్పున 27,171 బృందాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ బృందాలు పదిరోజులుగా ఇంటింటికి తిరిగి ఆరోగ్య సర్వేచేస్తున్నాయి.

16 జిల్లాల్లో పూర్తి
ఇప్పటివరకు 16 జిల్లాల్లో ఇంటింటి సర్వే పూర్తయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇప్పటివరకు 72,10,088 ఇండ్లలో సర్వేచేశారు. ఎవరికైనా జ్వరం కానీ, ఇతర లక్షణాలు కానీ ఉన్నట్లు కనిపిస్తే అక్కడికక్కడే మెడికల్‌ కిట్లు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 1,75,747 మెడికల్‌ కిట్లు అందించారు. అలాగే వివిధ హెల్త్‌ సెంటర్లలో ఓపీ కోసం వచ్చిన వారికి కలిపి దాదాపు 2.50 లక్షల మెడికల్‌ కిట్లు అందించారు. ఆ మందులను ఎలా వాడాలో వివరిస్తున్నారు. దీని ద్వారా అనేక మందికి ప్రాథమిక స్థాయిలోనే వైద్యం అందుతున్నది. వాస్తవంగా ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం జ్వరం లేదా ఇతర లక్షణాలు కన్పించిన వెంటనే పరీక్షల కోసం ఎదురుచూడకుండా ముందుగా వైద్యం ప్రారంభించాలి. ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ఆధారంగా సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు ఇంటింటి సర్వే చేసి లక్షణాలు కనిపించగానే వైద్యం ప్రారంభిస్తున్నారు. ఈ బృందంలో పట్టణాలలో పురపాలక సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశ, ఆంగన్‌వాడి వర్కర్‌లు ఉండగా, గ్రామాలలో పంచాయతి కార్యదర్శితోపాటు ఏఎన్‌ఎం, ఆశ, ఆంగన్‌వాడి వర్కర్‌లు ఉంటున్నారు. వీరంతా టీమ్‌గా ఏర్పడి ఇంటింటికి తిరిగి వివరాలను సేకరిస్తున్నారు.

ఇంటింటి సర్వే సఫలం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంటింటి సర్వే సఫలం

ట్రెండింగ్‌

Advertisement