హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): దేశంమొత్తం ఓవైపు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతుంటే.. మరోవైపు అదే స్థాయిలో వృథా అవుతున్నది. దవాఖానల్లో లీకేజీలు, అతి భయంతో ఎక్కువసేపు ఆక్సిజన్‌ను పీల్చడం, చాలామంది ఇండ్లల్లో ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ చేసుకోవడం వంటి అనేక కారణాల వల్ల ప్రాణవాయువు వృథా అవుతున్నది. దీనిని అడ్డుకోగలిగితే మరికొంత మందికి ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలుపవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆక్సిజన్ స్థాయి 90 కన్నా దిగువకు పడిపోయినవారికి మాత్రమే కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సి ఉంటుందని వైద్య నిపుణుల అభిప్రాయం. ఇందులోనూ రోగి పరిస్థితిని బట్టి నిమిషానికి ఎన్ని లీటర్ల ఆక్సిజన్ అందించాలో స్పష్టమైన లెక్కలు ఉంటాయి. నిమిషానికి ఒక లీటర్ నుంచి గరిష్ఠంగా 60 లీటర్ల వరకు ఆక్సిజన్‌ను పంపిస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే ‘హై ఫ్లో నాసల్ ఆక్సిజన్’ (హెచ్ఎఫ్ఎన్వో) విధానంలో నిమిషానికి 60 లీటర్ల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటారు. ఇంటివద్ద ఆక్సిజన్ థెరపీ తీసుకునేవారు నిమిషానికి 1-6 లీటర్ల ఆక్సిజన్‌ను తీసుకోవాలి. అదికూడా డాక్టర్లు సూచించిన నిర్ణీత సమయంపాటే పీల్చుకోవాలి.
ఎలా వృథా అవుతున్నది?
పైపుల లీకేజీ వల్ల 25% వరకు ఆక్సిజన్ వృథా అవుతున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. దవాఖానల్లో నర్సింగ్ సిబ్బంది సమయానికి ఆక్సిజన్ వాల్వ్‌ను బంద్ చేయకపోవడం, స్టోరేజీ ట్యాంకుల్లో పీడన స్థాయి పరిశీలించకపోవడంతో అత్యధిక శాతం వృథా అవుతున్నది. ఇక చాలామందికి అవసరం లేకున్నా ‘హై ఫ్లో నాసల్ క్యాన్లా’ వినియోగిస్తున్నారు. చాలామంది భయంతో ఆక్సిజన్ సిలిండర్లను కొని, అవసరానికి మించి వాడుతున్నారు. సగటున ప్రతి రెండు గంటలకు ఒకసారి అరగంట చొప్పున ఆక్సిజన్ పీల్చుతున్నట్టు తేలింది.
ప్రాణవాయువు అమూల్యం
ఒక లీటర్ లిక్విడ్ ఆక్సిజన్.. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 860 లీటర్ల ఆక్సిజన్‌గా మారుతుంది. ఒక కిలోలీటర్ ఆక్సిజన్ 8.6 లక్షల లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక కిలోలీటర్ ఆక్సిజన్‌తో 60 ఇన్వైసివ్ మెకానికల్ వెంటిలేటర్లకు (సాధారణ వెంటిలేటర్) లేదా, దాదాపు 20-30 నాన్వైసివ్ మెకానికల్ వెంటిలేటర్లకు 24 గంటలపాటు సరఫరా చేయవచ్చు. ఒక కిలోలీటర్ ఆక్సిజన్‌తో 8 లీటర్లు ఆక్సిజన్ అవసరం ఉన్న 75 మంది పేషెంట్లను, 4 లీటర్లు ఆక్సిజన్ అవసరం ఉన్న 150 మంది రోగుల ప్రాణాలను కాపాడవచ్చు.
అతిగా వాడితే విషమే
మన ఊపిరితిత్తులు గాలి నుంచి ఆక్సిజన్‌ను వేరుచేసి రక్తంలోకి పంపేలా నిర్మితమై ఉన్నాయి. అలాకాకుండా పూర్తిగా ఆక్సిజన్‌నే పంపడం ద్వారా ఊపిరితిత్తుల కండరాలు దెబ్బతింటాయి. వాయుగదుల్లో (అల్వైలీ) ద్రవపదార్థం నిండిపోతుంది. దీంతో ఊపిరితిత్తులు సాధారణ శ్వాసక్రియను జరుపలేక అంతిమంగా శ్వాసవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి డాక్టర్ల సూచనమేరకే ఆక్సిజన్‌ను వినియోగించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
విలువైన ఆక్సిజన్ వృథా అవుతున్నది
పల్స్ ఆక్సిమీటర్‌లో 92 కంటే తక్కువ ఉంటేనే ఆక్సిజన్ అవసరం పడుతుంది. అవసరం లేకున్నా హై ఫ్లోలో పెట్టి వాడితే కొన్ని ఆక్సిజన్ సంబంధ దుష్ప్రభావాలు వస్తాయి. దీంతోపాటు ఆక్సిజన్ దుర్వినియోగం అవుతున్నది. ఇండ్లలో, పలు చిన్నా, పెద్దా దవాఖానల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ఆక్సిజన్ తగ్గిన వ్యక్తికి తిరిగి 92 వరకు ఆక్సిజన్ లెవల్ పెరిగితే చాలు, 100 వచ్చే వరకు ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిమిషానికి 2 లీటర్లు పెడితే 92 వస్తుందంటే అంతే పెట్టాలి. మానిటర్ చేయకుండా ఎక్కువ ఆక్సిజన్ ఇస్తే ఆక్సిజన్ వృథా అవుతుంది. పేషెంట్లకు కూడా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆక్సిజన్ వాడటం మెడికల్ సూపర్‌విజన్‌తో సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న వారే చేయాలి. ఇంట్లో పేషెంట్లు, ఫ్యామిలీలు సొంతంగా వాడకూడదు. ఒక్క హై ఫ్లో ఆక్సిజన్ డివైజ్‌తో ఆరు నుంచి పది వెంటిలేటర్లు నడపొచ్చు. పేషెంట్లు బాత్రూం వెళ్లినపుడు ఆఫ్ చేయాలి. మాస్కులు సరిగ్గా ఉండేలా చూడాలి. లీకేజ్ లేకుండా చూసుకోవాలి. ఈ నాలెడ్జ్ చాలా మందికి ఉండటం లేదు. ఆక్సిజన్ డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. ఎంతో జాగ్రత్తగా వాడాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
-వెంకట్రామన్ కోల, హెడ్ ఇన్సెంటివ్ కేర్, యశోద దవాఖాన