e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home Top Slides నమస్తే తెలంగాణ అక్షయ అక్షర శస్త్రం

నమస్తే తెలంగాణ అక్షయ అక్షర శస్త్రం

నమస్తే తెలంగాణ అక్షయ అక్షర శస్త్రం

‘అవి తెలంగాణమందు దావాగ్ని లేచి చుట్టుముట్టిన’ భీకర దినాలు. అసహాయ శూరుడు, అహింసా మేరువు కేసీఆర్‌ ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ నిరశన దీక్ష చేపట్టి రాష్ట్ర సాధనా లక్ష్యాన్ని సమీపించిన కాలమది. కేసీఆర్‌ పిలుపు మేరకు తెలంగాణ సమాజం చూసిన తెగువకు దేశమమే దిగ్భ్రాంతినొందిన దశ అది. కానీ గోముఖ వ్యాఘ్రాలు పవిత్ర పత్రికా వ్యవస్థను సైతం పతనమొనరించి ప్రజా బాహుళ్యాన్ని పక్కదోవ పట్టించి నైరాశ్యంలోకి నెట్టుతున్న ప్రమాదం తలెత్తింది. ప్రళయ గర్జనలు చేస్తున్న పసి కూనలు సైతం ఆ మాయమాటలకు లోనై ప్రాణాలను బలిపెడుతున్న దుస్థితి ఏర్పడింది. వలసవాదుల కుట్రలను భగ్నం చేయడం కోసం మనకూ ఒక అక్షరాస్త్రం అవసరమని భావించిన ఉద్యమ సారథి కేసీఆర్‌ మానస పుత్రికగా 2011 జూన్‌ ఆరవ తేదీన ‘నమస్తే తెలంగాణ’ పురుడు పోసుకున్నది. నవనవోన్మేషంతో ‘నమస్తే తెలంగాణ’ నడక మొదలై నేటిక పదేళ్ళు పూర్తయింది. తెలంగాణ చరిత్రలోని అపూర్వ ఘట్టంలో జనించిన పత్రిక తన చారిత్రక బాధ్యతను నిర్విఘ్నంగా నెరవేరుస్తూనే ఉన్నది.
‘మనకు మారణాయుధాలు లేవు, వాటి కన్నా శక్తిమంతములైన అక్షర సుమ పరంపరలు’ మాసొంతమంటూ ‘నమస్తే తెలంగాణ’ తన సమరం సాగించింది. దాశరథి ఘోషించినట్టు – ‘శత శతాబ్దాలకు తరగని అక్షయాక్షర శస్ర్తాలు, రుజాగ్రస్త ధన స్వామ్య వ్యవస్థను రూపు మాపగల ప్రజా చైతన్య ప్రళయ ప్రభంజనాలు, మృదుల, మౌన, సాధుజన నయన ధనుష్టంకారాలు, హృదయాలను పులకింప చేసే అదృశ్య పికావళి ఓంకారాలు, సమృద్ధిగా మనకున్నాయని నిరూపింతాం’ అంటూ అక్షర సైనికులు కదం తొక్కారు.

‘నమస్తే తెలంగాణ’ రాకతోనే చాలా నోళ్ళు మూత పడ్డాయి. అయినా పుట్టుకతో వచ్చిన బుద్ధి ఊరకే పోతుందా! అదను దొరికినప్పుడల్లా వలసవాద పెంపుడు చిలుకలు అసత్యాలు, అర్ధసత్యాలతో ప్రజలను అయోమయంలో పడేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆ విష ప్రచారాలను తిప్పికొడుతూ ప్రజలకు పాలు- నీళ్ళు వేరు చేసి చూపించింది. ప్రతి ఉద్యమఘట్టంలో ప్రజల పక్షాన నిలిచింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా సమర్పించిన ‘రహస్య నివేదిక’ను బట్టబయలు చేస్తూ, కుట్రల గుట్టు విప్పింది. తీర్పరి పాత్ర పోషించవలసిన కేంద్రం తన బాధ్యతను విస్మరించి, ఆంధ్రా పాలకవర్గాల అంగీకారం కోరడమేమిటని నిలదీసింది. పరాయి పాలకులకు ఊడిగం చేస్తూ, స్థానిక ప్రతినిధులుగా చలామణి అవుతున్న పరాన్న జీవుల పాత్రను ప్రజల పక్షాన ప్రశ్నించింది. గల్లీలో ఒక మాట, ఢిల్లీలో మరో మాట మాట్లాడే రాజకీయ పక్షాల రెండు కండ్ల సిద్ధాంతాన్ని ఎండగట్టింది. ‘నమస్తే తెలంగాణ’ అక్షర ఘీంకారానికి భయ విహ్వలమైన పరాయి రాజకీయ పక్షాలూ, మాధ్యమాలు చాటుమాటుగా కుట్రలు చేశాయే తప్ప ఎదురు నిలిచి సవాలు విసిరింది ఎన్నడూ లేదు.

తెలంగాణ రాష్ర్టావతరణ అనంతరమూ పరాయి కుట్రలు, కక్షలు నిలిచి పోలేదు. పొలాలు ఎండిపోతూ రైతులు క్షోభిస్తున్నా, చట్ట ప్రకారం సరఫరా చేయవలిసిన విద్యుత్‌ను నిలిపివేశారు. ఓటుకు నోటు బేరాలాడి ప్రభుత్వాన్ని కూలదోయాలని చూశారు. ఈ సవాలక్ష కుట్రలను ఖండించడంలో నమస్తే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. విభజించి పాలించే సిద్ధాంతాన్ని వమ్ము చేసింది. తెలంగాణ ప్రభుత్వం అపూర్వమైన రీతిలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసింది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అక్షర వారధిగా నిలుస్తున్నది. తెలంగాణ సమాజం పట్ల తన బాధ్యతను నమస్తే తెలంగాణ ఎన్నటికీ విస్మరించదు. ‘మృత్యువును నిత్యం, ధరాతలిని ప్రజావళికి పంచే నిత్య మారణ హోమ హోతలను నిర్మూలింతాం, నమ్రంగా, ఆమ్ర వనంగా, ధరణిని మారుస్తాం’ అంటూ ప్రతిన బూనుతున్నాం. నందనారామంలోని మందారాలు, సుందరోద్యానంలోని గులాబీలు, మా అతి నవ్య లేఖినికి సంకేతాలు ’ అంటూ తెలంగాణ జనంతో పదం కలుపుతూ, కదం తొక్కుతూ ముందుకు సాగుతూనే ఉంటాం.

  • సంపాదక బృందం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నమస్తే తెలంగాణ అక్షయ అక్షర శస్త్రం

ట్రెండింగ్‌

Advertisement