e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home Top Slides నడివేసవిలోనూ నల్లా నీళ్లు

నడివేసవిలోనూ నల్లా నీళ్లు

  • నిత్యం పర్యవేక్షిస్తున్న మిషన్‌భగీరథ అధికారులు
  • పైపులైన్‌ లీకేజీ అయితే 24 గంటల్లో పునరుద్ధరణ
  • రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి ట్యాంకర్లకు తాళాలు
నడివేసవిలోనూ నల్లా నీళ్లు

హైదరాబాద్‌, మే 16 (నమస్తే తెలంగాణ): మిషన్‌ భగీరథతో ఎండాకాలం తాగునీటి కష్టాలకు చెక్‌ పడింది. నడి వేసవిలోనూ ఇంటింటికీ నల్లా నీళ్లు నిరాటంకంగా సరఫరా అవుతున్నాయి. గతంలో ఎండాకాలం ప్రారంభంలోనే నీటికోసం హాహాకారాలు, ట్యాంకర్ల పరుగులు, కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకునే మహిళల కష్టాలే చిత్రాలు కన్పించేవి. ఫిబ్రవరి నుంచే గ్రామీణ నీటి సరఫరా అధికారులు సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించే పనిలో నిమగ్నమయ్యేవారు. ట్యాంకర్లతో నీటి సరఫరా, బావులను అద్దెకు తీసుకోవడం, కొత్తగా బోర్లు వేయించడం, ఉన్నవాటిని కడిగించడం వంటివి చేపట్టేవారు. ఇందుకోసం ప్రతి వేసవిలో కనీసం రూ.200 నుంచి రూ.300కోట్ల వరకు ఖర్చుచేసేవారు. అయినప్పటికీ ప్రజలు తాగునీటి అవసరాలు తీరేవికావు. వీటన్నంటికీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మిషన్‌ భగీరథ ద్వారా పరిష్కారం చూపారు. ఏటా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాల్సిన అవసరం లేకుండా.. నీటి నిర్వహణను పర్యవేక్షిస్తే సరిపోయేలా వినూత్న పథకాన్ని రూపొందించారు. మిషన్‌ భగీరథ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక రాష్ట్రంలో ఎక్కడా నీటి ట్యాంకర్లు కన్పించడం లేదు. బోర్లు వేసిన దాఖలాలు లేవు. నెత్తిన బిందెలు పెట్టుకొని మహిళలు నడిచివెళుతున్న చిత్రాలూ లేవు.

నిత్యం పర్యవేక్షణ
గ్రామానికి సరఫరా అయ్యే తాగునీటిపై లాగ్‌షీట్‌ మెయింటెన్‌ చేస్తున్నారు. దీనిపై ప్రతిరోజూ సర్పంచ్‌, గ్రామ కార్యదర్శి, మిషన్‌ భగీరథ ఏఈ సంతకాలు చేస్తారు. వీటిని డీఈ, ఈఈలు పరిశీలిస్తారు. కౌంటర్‌ సంతకంచేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేస్తారు. తగినంత పరిమాణంలో నీటి సరఫరా జరుగకుంటే సిబ్బందిని అలర్ట్‌ చేస్తారు. ఒకవేళ నీటిని సరఫరాచేయలేకపోతే కారణాలను కూడా లాగ్‌షీట్‌లో పొందుపరుస్తారు. ఇతర ప్రజాప్రతినిధుల నుంచీ సమాచారం తీసుకుని ఫిర్యాదులనూ స్వీకరిస్తున్నారు. ఈ వేసవిలో విజయవంతంగా నీటిని సరఫరా చేయగలిగితే భవిష్యత్‌లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవచ్చనే ఉద్దేశంతో పనిచేస్తున్నామని పేర్కొంటున్నారు. అధికారులు వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటుచేసి నిత్యం నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఫిర్యాదులను సంబంధిత క్షేత్ర స్థాయి అధికారులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం లీకేజీల సమస్య తప్ప ఇతర సమస్యలు రావడంలేదని, ప్రతి గ్రామానికి తాగునీటి సరఫరా అవుతుందని మిషన్‌ భగీరథ అధికారులు స్పష్టంచేస్తున్నారు. గ్రామానికి ఇంటింటికీ నీటిని సరఫరాచేయడంతోపాటు రిజర్వాయర్లలో మట్టాల స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తాగునీటి అవసరాలకు తగ్గుట్టుగా నీటిస్థాయిలను మెయింటెన్‌ చేసేలా పరిశీలిస్తున్నారు.

గ్రామీణప్రాంతాల్లో ప్రతివ్యక్తికి వంద లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు. ప్రతిఇంటికి సమానస్థాయిలో, అవసరమైన ప్రెషర్‌తో నీటిని సరఫరా చేసేందుకు ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌ను ఏర్పాటుచేశారు. మిషన్‌ భగీరథ కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే స్పందించేలా జవాబుదారీగా ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం 54 లక్షల ఆవాసాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వగా.. రాష్ట్రవ్యాప్తంగా 18వేల సిబ్బంది బల్క్‌ నీటి సరఫరా కోసం పనిచేస్తున్నారు.
ఎక్కడైనా పైపులైన్‌ లీకయితే 24 గంటల్లో పునరుద్ధరించాలని నిబంధన విధించారు. లేకుంటే ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కింద కాంట్రాక్టర్‌కు ఫైన్‌ వేస్తారు. ఆ కాంట్రాక్టు ఏజెన్సీ ఖర్చులతో ఆ గ్రామాల ప్రజలకు ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నడివేసవిలోనూ నల్లా నీళ్లు

ట్రెండింగ్‌

Advertisement