e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home Top Slides ఈ-సిటీలో స్కిల్‌ సెంటర్‌

ఈ-సిటీలో స్కిల్‌ సెంటర్‌

  • భారీ పెట్టుబడుల సాధనతో రాష్ట్రంలో పుష్కలంగా ఉపాధి
  • ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు లక్షల ఉద్యోగాలు
  • సంప్రదాయేతర ఇంధనంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ 2
  • 2023 కల్లా సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ ఉత్పత్తిలో టాప్‌
  • ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ప్లాంటు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
  • రూ.483 కోట్లతో 750 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటు

హైదరాబాద్‌, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మొక్కవోని దీక్షతో కృషిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఉపాధి కల్పన పెద్ద సవాల్‌గా మారిందని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చేందుకు ప్రైవేటురంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వరంగంలోని ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఎలక్ట్రానిక్‌ సిటీ (ఈ-సిటీ)లో ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సంస్థ రూ.483 కోట్లతో ఏర్పాటుచేసిన సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీ ప్లాంటును గురువారం కేటీఆర్‌ ప్రారంభించారు. ప్లాంటులో అరగంటపాటు కలియదిరిగి, అక్కడి ఉద్యోగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రైవేటు పరిశ్రమల్లో 90% ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ-సిటీలో 2023 నాటికి 4 గిగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీ ప్లాంటు ఏర్పాటవుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సంస్థ ఏర్పాటుచేసిన 750 మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంటును త్వరలో మరో రూ.1,200 కోట్లతో విస్తరించనున్నట్టు వివరించారు. ఈ విస్తరణతో మరో 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను యువత అందిపుచ్చుకొనేలా ఆగస్టు 5న ఈ-సిటీలో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. మంత్రి కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

- Advertisement -

సంక్షోభాలకు ఎదురు నిలిచి..
ఇక్కడ 18 నెలల క్రితం ఏ పరిశ్రమా లేదు. కరోనా సమయంలో ప్రీమియం ఎనర్జీస్‌ నిర్వాహకులు ప్లాంటు స్థాపనకు భూమి కావాలని కోరిన వెంటనే 25 ఎకరాలు కేటాయించాం. ఒకవైపు కరోనా, మరోవైపు భారత్‌-చైనా మధ్య ఘర్షణ వాతావరణం. అయినా మొక్కవోని దీక్షతో రూ.483 కోట్ల పెట్టుబడితో 18 నెలల్లో 750 మెగావాట్ల సామర్థ్యంతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సోలార్‌ సెల్‌, మాడ్యూల్‌ తయారీ ప్లాంటును సిద్ధంచేశారు. ఇది అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్నది. దేశంలోనే రెండో అతిపెద్ద ప్లాంటు. దక్షిణ భారతదేశంలో అతి పెద్దది. కొన్ని మిషన్లను చైనా ఇంజినీర్లు అమర్చాల్సి ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం కారణంగా మన ఇంజినీర్లే సొంతంగా నేర్చుకొని అమర్చి రికార్డు సమయంలో అందుబాటులోకి తేవటం గర్వకారణం. ప్రభుత్వం నుంచి ప్రీమియం ఎనర్జీకి సంపూర్ణ సహకారం అందిస్తాం. అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కూడా సిద్ధం. ఉద్యోగాల కల్పనలో మాత్రం మన రాష్ట్రంలోని నిరుద్యోగ ఇంజినీర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నా. రాష్ర్టానికి చెందినవారు దేశానికే ఆదర్శంగా ఎదగుతున్నారంటే అంతకన్నా కావాల్సిందేముంది! స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే అంతకన్నా సంతోషం ఏమీ ఉండదు. నైపుణ్య శిక్షణా కేంద్రంలో స్థానిక తుక్కుగూడ, రావిర్యాల ప్రాంతాల్లో ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌ చదివినవారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం.

90 శాతం మన రాష్ట్రంవారే..
ఈ ప్లాంటులో 700 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగా, అందులో 90 శాతం మంది తెలంగాణకు చెందినవారే ఉండటం ఆనందించదగ్గ విషయం. 20 మంది ఉద్యోగులతో నేను మాట్లాడినప్పుడు చాలామంది వారి ఇండ్లల్లో మొదటిసారి ఉద్యోగం సంపాదించినవారని తెలిసింది. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని వ్యవసాయ కుటుంబాలకు చెందిన ఐటీఐ, పదో తరగతి, బీటెక్‌ చదివిన పిల్లలకు ఉద్యోగాలు లభించడం ఎంతో ఆనందంగా ఉన్నది. తమ చదువుకు సార్థకత లభించిందని, ఎవరి పైరవీ లేకుండా ఉద్యోగాలు లభించాయని వారు చెప్పారు.

ఉపాధికల్పనే సవాల్‌..
అమెరికాలో జోబైడెన్‌ ప్రభుత్వమైనా, మనదేశంలో నరేంద్రమోదీ అయినా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం అయినా.. ఉపాధి కల్పన పెద్ద సవాల్‌గా మారింది. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు భారీగా పెట్టుబడులను రాబట్టి ప్రైవేటురంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడం తప్ప మరో మార్గంలేదు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను రాబట్టేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా టీఎస్‌ ఐపాస్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వంటి పాలసీలతో సబ్సిడీలు కల్పిస్తూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నది. ఫలితంగా గడచిన ఏడేండ్లలో రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించాం. రాష్ట్రంలో కొత్తగా 15 వేల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. చాలాచోట్ల పరిశ్రమల ఏర్పాటు అంటే కాగితాలపైనే ఉంటుంది. అవి కార్యరూపం దాల్చటం అరుదు. మనరాష్ట్రంలో మాత్రం 80% పరిశ్రమలు ఉత్పత్తులు కొనసాగిస్తున్నాయి. ఇది చిన్న సంఖ్య కాదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులను రాబట్టం కూడా ఎంతో కష్టం. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, సబ్సిడీలతో పెట్టుబడిదారులు తెలంగాణవైపు దృష్టి సారిస్తున్నారు.

సంప్రదాయేతర ఇంధనాలతోనే భవిష్యత్తు..
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల దృష్ట్యా సోలార్‌, విండ్‌, హైడల్‌ విద్యుత్తు ప్రాజక్టులవైపు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆరు నెలల్లో తెలంగాణలో కరెంటు సమస్య మాయమైంది. సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది. కర్ణాటక మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అది మనకంటే భౌగోళికంగా పెద్ద రాష్ట్రం. భౌగోళిక పరిమాణం ప్రకారం చూస్తే ఇందులో మన రాష్ట్రమే ప్రథమ స్థానం లో ఉంటుంది అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ఫౌండర్‌, చైర్మన్‌ సురేందర్‌పాల్‌ సింగ్‌, ఎమ్మెల్సీ ఎస్‌ వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితా హరినాథ్‌రెడ్డి, ఇరిడా చైర్మన్‌ దాస్‌, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగులతో మాటామంతీ…
ప్లాంటు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ దాదాపు అర్ధగంటపాటు అన్ని సెక్షన్లలో కలియదిరిగారు. ప్లాంటు పనితీరు, ఉత్పత్తి విధానాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకొన్నారు. ఉద్యోగులను ఆప్యాయంగా పలకరించి వారు ఏం చదివారు? ఏ జిల్లాకు చెందినవారు? తదితర విషయాలను అడిగి తెలుసుకొన్నారు.

భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మంత్రి కేటీఆర్‌
మంత్రి సబితాఇంద్రారెడ్డి
చాలామంది నాయకులు ప్రారంభోత్సవాల్లో ఉపన్యాసాలకే పరిమితం అవుతారు. కానీ మంత్రి కేటీఆర్‌ మాత్రం మొత్తం ప్లాంటును కలియదిరుగుతూ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయడం గొప్ప విషయం. ఆయన రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో మొదటిస్థానంలో నిలపాలన్న సీఎం కేసీఆర్‌ కృషికి మంత్రి కేటీఆర్‌ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషిచేస్తున్నారు. ఫార్మా, ఐటీలో మనకు తిరుగులేదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana