e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home Top Slides రేవంత్‌పై కేటీఆర్‌ పరువునష్టం దావా

రేవంత్‌పై కేటీఆర్‌ పరువునష్టం దావా

  • అడ్డగోలు ఆరోపణలను అడ్డుకోండి
  • డ్రగ్స్‌ కేసులోకి లాగేందుకు కుటిలయత్నం
  • న్యాయ ప్రక్రియను సందేహించేలా వ్యాఖ్యలు
  • నా పరువు ప్రతిష్ఠలను దిగజారుస్తున్నారు
  • దుష్ప్రచారంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన
  • సిటీ సివిల్‌ కోర్టులో కేటీఆర్‌ పరువునష్టం కేసు
  • రేవంత్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (నమస్తే తెలంగాణ): తనకు వ్యతిరేకంగా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ.. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రేలాపనలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఇజ్జత్‌ దావా వేశారు. తన పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసే విధంగా రేవంత్‌ ఉద్దేశపూర్వకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని సోమవారం సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న నిరాధార ఆరోపణలను తన పరువుకు నష్టం కలిగించే చర్యలుగా పరిగణించాలని మంత్రి కేటీఆర్‌ కోర్టును కోరారు. లాయర్‌ ఎన్‌ నవీన్‌కుమార్‌ ద్వారా దాఖలుచేసిన పిటిషన్‌ను కోర్టు పరిశీలనలోకి తీసుకున్నది. తనకు వ్యతిరేకంగా వెబ్‌సైట్లు, యూట్యూబ్‌లో వచ్చిన కథనాలను ప్రస్తావించి, వాటికి రూ.1.20 కోట్లను విలువగట్టిన కేటీఆర్‌ ఆ మేరకు కోర్టు ఫీజుగా రూ.1,29,704ను చెల్లించారు.

తన పరువు ప్రతిష్ఠలకు జరిగిన నష్టంపై రేవంత్‌రెడ్డి నుంచి నష్టపరిహారం ఏ మేరకు కోరేదీ తర్వాత నివేదిస్తామని తెలిపారు. మాదకద్రవ్యాలు, నార్కొటిక్స్‌, సైకోట్రోపిక్‌ పదార్థాల చట్టం ఉల్లంఘనకు సంబంధించిన ఒక కేసు విచారణలో ఉండగా, ఆ వివాదంలోకి తనను లాగేందకు రేవంత్‌ ప్రయత్నించారని, ఆ దిశగా ఆయన చేసిన ఆరోపణలను తన పరువుకు నష్టం చేకూర్చేవిగా ప్రకటించాలని కేటీఆర్‌ కోరారు. విచారణలో ఉన్న డ్రగ్స్‌ కేసుకు సంబంధించి తనను రెచ్చగొట్టే విధంగా అసత్యాలతో కూడిన దుష్ప్రచారం చేస్తున్న రేవంత్‌తోపాటు, అతని అనుచరులు, ఏజెంట్లు, ఇతర మద్దతుదారులను అదుపుచేసి తన పరువును కాపాడాలని కోర్టును అభ్యర్థించారు. డ్రగ్స్‌ కేసులో తాను కనీసం సాక్షిని కూడా కాదని తెలిపారు.

- Advertisement -

విచారణలో ఉన్న కేసులతో ముడిపెట్టి ఆధారాలులేని ఆరోపణలుచేయడం ద్వారా రేవంత్‌.. న్యాయప్రక్రియపై సందే హం కలిగేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తన ప్రతిష్ఠకు హాని కలిగించే ఉద్దేశంతోనే బురదజల్లుతున్నారని, ఇటువంటి ప్రకటనలు.. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాలలో చేయకుండా నియంత్రించాలని, ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే యూట్యూబ్‌, ట్విట్టర్‌ వంటి మాధ్యమాలలో చలామణిలో ఉన్న వాటిని తొలిగించేలా రేవంత్‌ను ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తనకు వ్యతిరేకంగా కుట్రపూరితమైన ఆరోపణలు చేయకుండా కట్టడిచేయాలని కోరారు.

డ్రగ్స్‌ కేసులో ఎవరూ నోటీసు ఇవ్వలేదు
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యా ప్తు జరుపుతున్న మాదకద్రవ్యాల కేసుతో తనను ముడిపెట్టి అసత్య ఆరోపణలు చేయ డం ద్వారా రేవంత్‌రెడ్డి తన ప్రతిష్ఠను దిగజార్చారని కేటీఆర్‌ తెలిపారు. ఆ కేసుకు సంబంధించి తాను ఎటువంటి నోటీసులు అందుకోలేదని తేల్చిచెప్పారు. దర్యాప్తు/ విచారణ జరుపడం ద్వారానే క్రిమినల్‌ కేసుల్లో నిజాలు నిగ్గు తేలుతాయని, కానీ రాజకీయంగా ప్రయోజనం పొందాలనే తపనతో ఆరోపణలు చేయడం చట్టవ్యతిరేకమని కోర్టు దృష్టికి తెచ్చారు. తన పరువు ప్రతిష్ఠలను పణంగా పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ఇటువంటి తప్పుడు ఆరోపణలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని, అందుకే చట్ట ప్రకారం పరువు నష్టం దావా వేస్తున్నట్టు కేటీఆర్‌ వివరించారు.

పత్రికలు, మీడియాల్లో ప్రచురణ
కేవలం సంచలనాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం పాకులాడుతూ రేవంత్‌ తనపై ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. గత నెల (ఆగస్టు) 13న రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను సైకోట్రోపిక్‌ డ్రగ్స్‌ వాడుతున్నట్టు చేసిన ఆరోపణలు పత్రికలు, టీవీలో వచ్చాయని అందుకే పరువునష్టం దావా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ క్లిప్పింగ్స్‌ను, లింకులను పిటిషన్‌కు జతచేసినట్టు పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో తన కుటుంబసభ్యులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని కేటీఆర్‌ కోర్టుకు తెలిపారు. బాధ్యతారహితంగా చేస్తున్న విమర్శలు, ఆరోపణలను అడ్డుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇటీవల ట్విట్టర్‌ వేదికగా తనను దోపిడీదారుడు, అబద్ధాలకోరు అంటూ రేవంత్‌ వ్యాఖ్యలు చేశాడని, వాటివల్ల తన ప్రతిష్ఠ దెబ్బతిన్నదని, అందువల్లనే దావా వేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ నెల 16న జరిగిన ఒక బహిరంగసభలో కూడా రేవంత్‌ నోటికొచ్చినట్టు ఆరోపణలు చేశాడని తెలిపారు.

కుటుంబసభ్యులు సైతం ఆవేదన
ఈ ఏడాది ఆగస్టు నుంచి రేవంత్‌రెడ్డి తనపై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారని, దీంతో స్నేహితులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు, రాజకీయ సహచరులు, ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పార్లమెంట్‌ సభ్యుడైన రేవంత్‌రెడ్డి నైతిక నియమాలకు తిలోదకాలిచ్చి చేస్తున్న ఆరోపణలకు మీడియా, సామాజిక మాధ్యమాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్న అసత్యాలను విశ్వవ్యాప్తంగా ఎందరో చదవడంతో తన పరువుకు భంగం వాటిల్లుతున్నదని కేటీఆర్‌ తెలిపారు.

రాజ్యాంగ హకులు దుర్వినియోగం
వాక్సాతంత్య్రం పేరిట ఇష్టానుసారంగా మాట్లాడరాదని, ఎదుటివారి హక్కులకు భంగం కలిగించరాదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నదని కేటీఆర్‌ తెలిపారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కూడా అందులో ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. ఆ మేరకు రాజ్యాంగంలోని 19(1)(ఎ), 19(2) అధికరణాల కింద తనకు రక్షణ కల్పించాలని కోరారు. వాక్‌ స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలు కూడా సూచిస్తున్నాయని తెలిపారు.

బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి
రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా మేల్కొని తన తప్పును అంగీకరించి, మీడియా ఎదుట బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఇకపై తప్పుడు, అసత్య ఆరోపణల ద్వారా తనకు అపకీర్తి కలిగించకుండా చేయాలని, ఆ వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్‌ చేయకుండా నియంత్రించాలని కోర్టును కోరారు. సోషల్‌ మీడియా వెబ్‌సైట్స్‌, పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా వేదికగా బహిరంగంగా బేషరతుగా క్షమాణలు చెప్పేలా రేవంత్‌రెడ్డికి ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కేటీఆర్‌ కోరారు.

మచ్చలేని జీవితం నాది
‘తొలిసారి 2009లో ఆ తర్వాత మళ్లీ 2010, 2014, 2018 సంవత్సరాల్లో వరుసగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. తెలంగాణ ప్రజల చిరకాల కోరికైన ప్రత్యేక రాష్ట్ర స్థాపన కోసం శాంతియుతంగా ఉద్యమం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ నేతగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నాను.. పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా దేశవిదేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాను. ఐటీ మంత్రిగా 2020లో దేశంలోనే ఉత్తమ అవార్డు అందుకున్నాను. 2015 16లో ‘ది స్కోచ్‌ చాలెంజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు లభించింది. ఆడి రిడ్జ్‌ ఐకాన్‌ అవార్డు కూడా వచ్చింది. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను. ఆన్‌లైన్‌ ద్వారా కూడా అన్ని వయసుల వారికీ అందుబాటులో ఉన్నాను. యువత నాకు అండగా నిలుస్తున్నది. వారికి మద్దతుగా ఉన్నాను. నిరంతరం ప్రజాజీవితంలో ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నాను.

ప్రజలందరి కండ్లు నా వైపు చూసే స్థితిలో నేనున్నప్పుడు నా ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేందుకు రేవంత్‌రెడ్డి పత్రికలు, టీవీల ద్వారానే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా తప్పుడు ఆరోపణలు చేయడాన్ని కోర్టు కట్టడి చేయాలి. ప్రజాజీవితంలో ప్రజల కోసం నిరంతరం పనిచేసే తనలాంటి వాళ్లను రాజకీయంగా ఎదురొనలేక రేవంత్‌రెడ్డి తప్పుడు మార్గంలో చేస్తున్న అసత్య ఆరోపణలకు అడ్డుకట్టవేయాలి’ అని కేటీఆర్‌ తన పిటిషన్‌లో కోర్టును కోరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement