జీవ పరిణామక్రమంలో మనుషులకు, సూక్ష్మజీవులకు మధ్య అవినాభావ సంబంధమున్నది. భూమిపైనున్న అన్ని సూక్ష్మజీవులు మనుషులకు హాని కలిగిస్తాయనుకుంటే పొరపాటే. అయితే, భూమిపై హానితలపెట్టని సూక్ష్మజీవులు అంతరిక్షంలోకి వెళ్లాక, భూమ్యాకర్షణ శక్తి లేని పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తాయి? వాటి మనుగడకు ఆ వాతావరణం సరిపోతుందా? తదితర అంశాలను పరిశోధించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా సిద్ధమైంది.
-న్యూయార్క్
ఏమిటీ ప్రయోగం?
రోదసిలో సూక్ష్మజీవులపై అధ్యయనం చేయడానికి ‘సెల్ సైన్స్-04’ పేరిట ఓ బృహత్తర ప్రయోగానికి నాసా అంకురార్పణ చేసింది. ఇందుకోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) 5 వేల టార్డిగ్రేడ్లు, 128 డార్క్ బేబీ స్కిడ్లు వంటి సూక్ష్మజీవులను పంపించనున్నది. ఇందుకోసం ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ సంస్థ ‘స్పేస్ఎక్స్’ పంపిస్తున్న 22వ కార్గో మిషన్ ‘ఫాల్కన్ 9’ రాకెట్‌ను వినియోగించనున్నది. ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు.
ఈ జీవులే ఎందుకు?
టార్డిగ్రేడ్లు ఒకరకమైన సూక్ష్మజీవులు. వీటి ఆకారాన్ని బట్టి వాటర్ బేర్స్ (నీటి ఎలుగుబంట్లు) అని కూడా పిలుస్తారు. ఇవి మనుషులకు హానికరమైనవి కాదు. ఒక్క మిల్లీమీటర్ కంటే తక్కువ సైజ్‌లో ఉండే వీటిని మైక్రోస్కోప్ సాయంతో స్పష్టంగా చూడగలం. సముద్రాలు, నీటి మడుగులు, నేలపై నివసించే ఈ జీవులు ఎంతో సంక్లిష్టమైనవి. సముద్రం అడుగు భాగంలో ఉండే పీడనానికి ఆరు రెట్లు ఎక్కువ గల పీడనం పరిస్థితుల్లో కూడా ఇవి జీవించగలవు. తీవ్రమైన రేడియేషన్‌ను కూడా తట్టుకోగలవు. ఇక, డార్క్ బేబీ స్కిడ్లకు కూడా దాదాపుగా ఇవే లక్షణాలు ఉన్నాయి. ఇవి చీకట్లో మెరువగలవు. ఈ లక్షణాల కారణంగానే అత్యంత సంక్లిష్టమైన వాతావరణం కలిగిన ఐఎస్ఎస్కు వీటిని పంపిస్తున్నారు.
ఏమి పరిశోధిస్తారు?
‘సెల్ సైన్స్-04’లో ప్రయోగంలో భాగంగా అండర్స్టాండింగ్ ఆఫ్ మైక్రో గ్రావిటీ ఆన్ ఎనిమల్-మైక్రోబ్ ఇంటరాక్షన్ (యుమామీ)పై ప్రత్యేక పరిశోధనలు చేయనున్నారు. అంటే రోదసిలో ఉన్నప్పుడు సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఆ వాతావరణాన్ని అవి తట్టుకోగలవా? పునరుత్పత్తి సాధ్యమా? ఆ జీవుల్లో ఏమైనా జన్యు మార్పులు కలుగుతున్నాయా? వాటి సహజ లక్షణాలకు విరుద్ధంగా ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? ఈ మార్పులు మనుషులపై చూపే ప్రభావం ఏమిటి? తదితర అంశాలపై ఈ ప్రయోగంలో పరిశోధించనున్నారు. భవిష్యత్‌లో చేపట్టే మానవసహిత అంతరిక్ష యాత్రలకు ఈ ప్రయోగం ఫలితాలు ఎంతో సాయపడుతాయని.. రోదసిలో వ్యోమగాముల ఆరోగ్యానికి సంబంధించి అంచనాకు రావడానికి ఇవి ఉపయోగపడొచ్చని నాసా శాస్త్రవేత్త ఈడీ కెల్లీ పేర్కొన్నారు.