e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home Top Slides సింధు సులువుగా

సింధు సులువుగా

  • తొలి పోరులో సెనియాపై అలవోక గెలుపు
  • ప్రిక్వార్టర్స్‌లో బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌
  • షూటింగ్‌లో మళ్లీ నిరాశే

యావత్‌ భారతావని ఆశలు మోస్తూ టోక్యోలో అడుగుపెట్టిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సునాయాస విజయంతో బోణీ కొడితే.. దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ తన పంచ్‌ పవర్‌ తగ్గలేదని నిరూపించింది. సింధు అరగంటలోనే ప్రత్యర్థి పనిపడితే.. మేరీ పంచ్‌ల వర్షం కురిపించింది. రోయింగ్‌లో భారత ద్వయం అర్జున్‌ లాల్‌-అర్వింద్‌ సెమీస్‌ చేరి చరిత్ర సృష్టిస్తే.. పురుషుల హాకీ జట్టు ఆసీస్‌ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. టేబుల్‌ టెన్నిస్‌లో మనికా బాత్రా అద్భుత విజయం సాధిస్తే.. టెన్నిస్‌లో సానియాకు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. షూటర్ల పేలవ ప్రదర్శన కొనసాగగా.. మనూబాకర్‌ పిస్టల్‌లో సమస్య వల్ల విషాదకర రీతిలో ఓడింది.

టోక్యో: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. తొలిపోరులో సత్తాచాటిన తెలుగమ్మాయి వరుస గేమ్‌లలో సునాయాస విజయాన్ని అందుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-జే మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్‌ సింధు 21-7, 21-10 తో సెనియా పొలికర్పోవా (ఇజ్రాయెల్‌)ను 29 నిమిషాల్లోనే చిత్తుచేసింది. ప్రారంభంలో కాసేపు వెనుకబడిన సింధు.. తొలి గేమ్‌లో ఓ దశలో వరుసగా 13 పాయింట్లు గెలిచి సత్తాచాటింది. దీంతో ఒక్కసారిగా 19-5 ఆధిక్యానికి చేరిన తెలుగమ్మాయి అలవోకగా తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాతి గేమ్‌లో పూర్తి పైచేయి సాధించిన సింధు బ్రేక్‌ సమయానికి 11-4తో దూసుకెళ్లింది. ఆ తర్వాత ప్రత్యర్థి కాస్త ప్రతిఘటించేందుకు ప్రయత్నించినా.. దూకుడు కనబరిచిన సింధు అలవోకగా గెలిచింది. తదుపరి గ్రూప్‌ మ్యాచ్‌లో ఆరో సీడ్‌ సింధు.. చెంగ్‌ గన్‌యీ (హాంకాంగ్‌)తో బుధవారం తలపడనుంది.

- Advertisement -

మనికా.. తడబడి నిలబడి

భారత స్టార్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ప్లేయర్‌ మనికా బాత్రా మహిళల సింగిల్స్‌లో అద్భుత విజయం సాధించింది. ప్రపంచ 32వ ర్యాంకర్‌ మార్గరిటా పెసోట్‌స్కాతో జరిగిన రెండో రౌండ్‌లో తొలి రెండు గేమ్‌లు కోల్పోయాక మనికా విజృంభించింది. మొత్తంగా బాత్రా 4-3 (4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7)తో మార్గరిటాను చిత్తుచేసి మూడో రౌండ్‌లో అడుగుపెట్టింది. తదుపరి పోరులో సోఫియా పల్కంచోవా (ఆస్ట్రియా)తో ప్రపంచ 62వ ర్యాంకర్‌ మనికా తలపడనుంది. పురుషుల విభాగంలో భారత అగ్రశ్రేణి ఆటగాడు జ్ఞానశేఖరన్‌ సాతియాన్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ 98వ ర్యాంకర్‌ లామ్‌ సూహంగ్‌ (హాంకాంగ్‌)తో జరిగిన రెండో రౌండ్‌ పోరులో ఓ దశలో 3-1 ఆధిక్యంలో ఉన్న సాతియాన్‌ చివరికి 4-3 తేడాతో ఓడాడు.

మేరీ పంచ్‌ అదుర్స్‌

ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌, భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ టోక్యోలో బరిలోకి దిగిన తొలి బౌట్‌లోనే అదరగొట్టింది. పంచ్‌ పవర్‌ చూపిస్తూ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో బై దక్కించుకున్న మేరీ రెండో రౌండ్‌లో 4-1 తో మిగోలినా హర్నాజెడ్‌ (డొమెనికా రిపబ్లిక్‌)ను చిత్తుచేసింది. తన కంటే 15 ఏండ్లు చిన్నదైన అమ్మాయిని అలవోకగా ఓడించింది. తదుపరి ప్రిక్వార్టర్స్‌లో గురువారం మూడో సీడ్‌ ఇంగ్రిట్‌ వెలెన్సియా (కొలంబియా)ను మేరీకోమ్‌ ఢీకొట్టనుంది. పురుషుల విభాగంలో కామన్వెల్త్‌ రజత పతక విజేత మనీశ్‌ కౌశిక్‌(63 కేజీలు)కు తొలి బౌట్‌లోనే నిరాశ ఎదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో బ్రిటన్‌ బాక్సర్‌ లూక్‌ మెక్‌కోర్మాక్‌ చేతిలో మనీశ్‌ 1-4 తేడాతో ఓడి విశ్వక్రీడల నుంచి నిష్క్రమించాడు.

మీరాకు జీవితకాలం ఫ్రీ పిజ్జా

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం అందించిన మణిపూర్‌ మణిపూస మీరాబాయి చానుకు ప్రముఖ పిజ్జా సంస్థ డొమినోస్‌ స్వీట్‌ ఆఫర్‌ ఇచ్చింది. చానుకు జీవితకాలం ఉచితంగా పిజ్జాను అందజేస్తామని ప్రకటించింది. ఒలింపిక్స్‌ విజయం తర్వాత చాను మాట్లాడుతూ.. ‘ఈ విజయానికి గుర్తుగా ముందు నేను పిజ్జా తింటా’ అని పేర్కొంది.. దీంతో డొమినోస్‌ ఉచిత పిజ్జా ప్రకటన చేసింది. ‘భారతీయుల కలలను మీరు నిజం చేశారు. మీకు జీవితకాలం ఉచితంగా పిజ్జాలు అందిస్తాం’ అని డొమినోస్‌ ఇండియా ట్వీట్‌ చేసింది.

30 సెకన్ల బ్రేక్‌

ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన విజేతలు.. వాటిని స్వీకరి స్తుండగా ఫొటోలు తీసే సమయంలో 30 సెకన్ల పాటు మాస్కులు తీయవచ్చునని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐవోసీ) తెలిపింది. ఆదివారం నుంచే ఈ సవరణలు అమల్లోకి వచ్చాయి.

అర్జున్‌, అర్వింద్‌ సంచలనం

అంచనాల్లేకుండా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన భారత రోయర్లు అర్జున్‌ లాల్‌ జాట్‌-అర్వింద్‌ సింగ్‌ ద్వయం సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల రోయింగ్‌ లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ రెపిచేజ్‌ రెండో రౌండ్‌లో సత్తాచాటిన అర్జున్‌-అర్వింద్‌ జోడీ (6:51.36) మూడో స్థానంలో నిలిచి ముందడుగేసింది. దీంతో ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరిన తొలి భారత రోయింగ్‌ ద్వయంగా రికార్డులకెక్కింది. తదుపరి రెండు పోటీల్లో సత్తాచాటితే అర్జున్‌-అర్వింద్‌ జంట విశ్వక్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

షూటర్లు మళ్లీ..

భారత షూటర్లు వరుసగా రెండో రోజూ నిరాశపరిచారు. పత కం పక్కా అనుకున్న 19 ఏండ్ల మ నూ బాకర్‌కు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫయర్స్‌లో దురదృష్టం ఎదురవగా.. యశస్విని నిరాశపరిచింది. తన పిస్టల్‌లోని కాకింగ్‌ లివర్‌ విరిగిపోవడంతో దాదాపు 20 నిమిషాల సమయం కోల్పోయిన బాకర్‌.. 575 పాయింట్లు సాధించగలిగింది. ఫైనల్‌ చేరాలంటే 577 పాయింట్లు అవసరం కాగా.. చివరికి 12వ స్థానంలో నిలిచిన బాకర్‌ బాధాకరమైన రీతిలో పోటీ నుంచి నిష్క్రమించింది. యశస్వి (574) 13వ స్థానానికే పరిమితమైంది. పురుషుల 10 మీటర్ల రైఫిల్‌ విభాగంలో భారత షూటర్లు దీపక్‌, దివ్యాంశ్‌ విఫలమయ్యారు.

హాకీలో ఘోర పరాభవం

న్యూజిలాండ్‌పై గెలుపుతో ఒలింపిక్స్‌ పోరును ఘనంగా ఆరంభించిన భారత పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పూల్‌-ఏలో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 1-7తో ఆసీస్‌ చేతిలో ఓడింది. భారత డిఫెన్స్‌ను అలవోకగా ఛేదించిన కంగారూ ప్లేయర్లు గోల్స్‌ వర్షం కురిపించారు. మరోవైపు టోక్యోలో భారత స్విమ్మర్లు శ్రీహరి నటరాజన్‌, మానా పటేల్‌ పోరు ముగిసింది.

సానియా జోడీకి షాక్‌

భారత స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా-అంకిత రైనాకు ఆదిలోనే ఓటమి ఎదురైంది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా జోడీ 6-0, 7-6 (0/7), 8-10 తేడాతో ఉక్రెయిన్‌ కవల ప్లేయర్లు నాడియా-లుద్మిలా ద్వయం చేతిలో పరాజయం పాలైంది. తొలి సెట్‌ను ఎంతో సునాయాసంగా గెలుచుకున్న సానియా జంట.. తర్వాతి సెట్‌లలో సత్తా చాటలేకపోయింది.

బార్టీకి చుక్కెదురు

ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆష్లే బార్టీకి టోక్యో ఒలింపిక్స్‌ తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. విశ్వక్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన బార్టీ.. 48వ ర్యాంకర్‌ సోరిబ్స్‌ టొర్మో (స్పెయిన్‌) చేతిలో ఓడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో బార్టీ 4-6, 3-6తో పరాజయం పాలైంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana