e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home Top Slides విద్యలో విప్లవం

విద్యలో విప్లవం

  • ఏడేండ్లలో విద్యావ్యవస్థ సమూల ప్రక్షాళన
  • అనతికాలంలోనే లక్షా 32 వేల ఉద్యోగాలిచ్చాం
  • త్వరలోనే 50 వేల ప్రభుత్వ కొలువుల భర్తీ
  • టీఆర్‌ఎస్‌తోనే యువతకు భవిష్యత్తు
  • మంత్రి హరీశ్‌రావు వెల్లడి
  • టీఆర్‌ఎస్‌లోకి హుజూరాబాద్‌ విద్యార్థి నేతలు
  • ఎన్నికల్లో ఈటలకు గుణపాఠం చెప్తామని ప్రతిజ్ఞ
విద్యలో విప్లవం

హైదరాబాద్‌, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు, భరోసా ఇచ్చేది టీఆర్‌ఎస్‌ పార్టీయేనని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌ అయిన నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పనిచేస్తున్నారని తెలిపారు. ఆదివారం హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన విద్యార్థి నాయకులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ గడచిన ఏడేండ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే మార్గదర్శనం చేస్తున్నారని, ఈ విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గ్రహిస్తున్నారని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు చూపిన తెగువను, పోరాటపటిమను, విద్యార్థుల ఆవేదనను అర్థంచేసుకున్న ఉద్యమనాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల విద్యారంగంలో విప్లవాత్మకమార్పులు తీసుకొచ్చారని చెప్పారు.

ఏడేండ్లలో లక్షల ఉద్యోగాలు
రాష్ట్రం సాధించిన స్వల్పకాలంలోనే ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో 1లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీచేయటం అసాధారణ విషయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఎస్‌-ఐపాస్‌ ద్వారా దేశ, విదేశాల నుంచి 1,400 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషిచేసి దాదాపు 14 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాన్ని చూపిన దార్శనికుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. అంతేకాకుండా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాలను తక్షణమే భర్తీచేయాలని అధికారులను ఆదేశించారని వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటమే కాకుండా ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని పేర్కొన్నారు. విద్యార్థి కేంద్రంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు బయటి సమాజంకంటే విద్యార్థి సంఘాల ప్రతినిధులకే ఎక్కువగా తెలుసని, గతంలో మెస్‌చార్జీలు, మెయింటెన్స్‌ ఖర్చులు, కాస్మొటిక్‌ చార్జీల కోసమే కాకుండా రెండు పూటల నాణ్యమైన అన్నం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళన చేసిన సందర్భాలున్నాయని, ఆ పరిస్థితులకు సీఎం కేసీఆర్‌ చరమగీతం పాడారని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యువతకు ఇస్తున్న ప్రాధాన్యం, వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్న విద్యార్థి సంఘాల నాయకులకు ఆయన సాదర స్వాగతం పలికారు.

- Advertisement -

టీఆర్‌ఎస్‌లో చేరిన విద్యార్థి సంఘాల నేతలు వీరే..
తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేర్నాక రమాకాంత్‌, కరీంనగర్‌ జిల్లా పీడీఎస్‌యూ అధ్యక్షుడు అక్కెనపల్లి శ్రీకాంత్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా జాయింట్‌ సెక్రటరీ పోషంపల్లి రాకేశ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల అనిల్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికిగులాబీ కండువాలు కప్పి మంత్రి హరీశ్‌రావు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కే వాసుదేవరెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మొలుగు పూర్ణచందర్‌, టేకుల శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈటలకు గుణపాఠం చెబుతాం: విద్యార్థి సంఘాల నేతలు
ఈటల రాజేందర్‌ మంత్రిగా పనిచేసిన సమయంలో తమను వేధించారని విద్యార్థి సంఘాల నేతలు వాపోయారు. తమపై అకారణంగా కేసులు పెట్టించి జైలు పాలు చేయించారని ఆవేదన వ్యక్తంచేశారు. తమను భయభ్రాంతులకు గురిచేసిన ఈటలను మొదటి నుంచీ వ్యతిరేకించామని పేర్కొన్నారు. ఈటల వ్యవహారశైలి వల్లనే ఇంతకాలం టీఆర్‌ఎస్‌లోకి రాలేకపోయామని తెలిపారు. హుజూరాబాద్‌లో రాబోయే ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు తగిన గుణపాఠం చెప్తామని వారు స్పష్టంచేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విద్యలో విప్లవం
విద్యలో విప్లవం
విద్యలో విప్లవం

ట్రెండింగ్‌

Advertisement