e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home Top Slides నీట మునిగిన పంటలు

నీట మునిగిన పంటలు

  • గులాబ్‌ తుఫానుతో తీరని నష్టం
  • జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు
  • వాగుల్లో గల్లంతై నలుగురు మృతి
  • ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌, సెప్టెంబర్‌ 28: గులాబ్‌ తుఫాను కారణంగా రెండు రోజులుగా కురిసిన వర్షానికి తెలంగాణ అతలాకుతలమైంది. ఆదివారం అర్ధరాత్రి మొదలై సోమవారం రాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వానలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు దూకాయి. వర్షం ధాటికి రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో పంటలకు తీరని నష్టంవాటిల్లింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వందల సంఖ్యలో ఇండ్లు నేలమటమయ్యాయి. కుండపోత వానలకుతోడు మహారాష్ట్రలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం తో మంజీర, గోదావరి ఉగ్రరూపం దాల్చాయి.

అన్నదాతకు అపార నష్టం
కుండపోత వానలు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. సంగారెడ్డి జిల్లాలో 99,865 ఎకరాలు, మెదక్‌ జిల్లాలో 1,430 ఎకరాల్లో వరి నీట మునిగింది. వికారాబాద్‌ జిల్లాలో మూడు వేల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 955 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 30 వేల ఎకరాలు, నిజామాబాద్‌ జిల్లాలో 10 వేలు, కామారెడ్డి జిల్లాలో 3,400 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా యి. కరీంనగర్‌ జిల్లాలో 900 ఎకరాల్లో వరి నీట మునిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 197 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 600 ఎకరాల్లో మిర్చి దెబ్బతిన్నది.

- Advertisement -

నిండిన చెరువులు.. పొంగిన వాగులు
వర్షాలతో రాష్ట్రంలోని మొత్తం 43,870 చెరువుల్లో 21,552 మత్తళ్లు దుంకుతున్నాయి. 13,450 చెరువు లు 100 శాతం నిండాయి. మెదక్‌ జిల్లాలోని ఘనపూర్‌ ప్రాజెక్టు పరవళ్లు తొక్కడంతో ఏడుపాయల ఆలయం వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. సిద్దిపేట జిల్లా లో హల్దీ, కూడవెల్లి వాగులు పారుతున్నాయి. వికారాబాద్‌ పరిధిలోని మూసీ నది, ఈసీ వాగు, పాలమూరు జిల్లాలోని దుందుభీ వాగు ఉప్పొంగి పారుతున్నాయి.

జక్రాన్‌పల్లిలో 23 సెంటీమీటర్ల వర్షపాతం
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో 23 సెంటీమీటర్ల వర్షపా తం నమోదైందని హైదరాబాద్‌ వాతావారణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌, ధర్‌పల్లెల్లో 21 సెంటీమీటర్లు, రంజల్‌, డిచ్‌పల్లె, ఆర్మూర్‌ల్లో 18, నందిపేటలో 17, నిర్మల్‌లో 14, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లెలో 13, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వేర్వేరు జిల్లాల్లో నలుగురు మృతి
వర్షాల కారణంగా వేర్వేరు జిల్లాల్లో నలుగురు మృతిచెందారు. పలువురు గల్లంతయ్యారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి తండాకు చెందిన అజ్మీరాబాబు (30), యానంపల్లితండాకు చెందిన బూక్యా మోతీలాల్‌ (52), కామారెడ్డి మండలం లింగాపూర్‌కు చెందిన భగవాన్‌రెడ్డి(55) వాగుల్లో గల్లంతై మృతి చెందారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం గట్టుభూత్కూర్‌కు చెందిన శంకరయ్య (45) గోడ కూలి మరణించారు. హనుమకొండ జిల్లా నడికూడ మండ లం నార్లాపూర్‌ వాగులో పడి ఏర్ల అభినవ్‌ (22), ఏర్ల కౌశిక్‌ (22) కొట్టుకుపోయారు. సంగారెడ్డి జిల్లాలో 200కుపైగా ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. నిజామాబాద్‌ జిల్లాలో 45 ఇండ్లు నేలమట్టం అయ్యాయి.

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు
భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలను మంత్రులు మంగళవారం పరిశీలించారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజాంసాగర్‌ ప్రాజెక్టును సందర్శించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్‌ జిల్లా లోని ఎస్సారెస్పీని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సందర్శించారు. కలెక్టర్లతో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో సిరిసిల్లలో కలెక్టర్‌, అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. జీహెచ్‌ఎంసీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత సహాయక చర్యలను పర్యవేక్షించారు.

జిల్లాల్లో వైద్య శిబిరాలు
భారీ వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ కట్టడి చర్యలు మొదలుపెట్టింది. జిల్లా వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్‌ ఆఫీసర్లు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జ్వర సర్వేలు చేపట్టాలని, జిల్లాల్లో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాల ని సూచించింది. వరద ప్రాంతాల్లో సంక్రమిక వ్యాధుల వ్యాప్తి నివారణకు డీఎంహెచ్‌వోలు చర్యలు చేపట్టాలని ప్రజారోగ్యశాఖ సంచాలకులు జీ శ్రీనివాస్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

మరో రెండ్రోజులు తేలికపాటి వానలు
వాయుగుండం పశ్చిమ-వాయువ్యదిశగా కదిలి మంగళవారం ఉదయం 8:30 గంటలకు విదర్భ పరిసర ప్రాంతాల్లో నాగ్‌పూర్‌కి నైరుతి దిశగా 250 కిలోమీటర్ల దూరానికి చేరిందని, ఇది సాయంత్రానికి మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాగల 24 గంటల్లో భారీ వర్ష సూచనలు ఏమీ లేవని, చాలా ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న తెలిపారు. బుధ, గురువారాల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటుందని, ఈ రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల చొప్పున నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.

జలసౌధలో కంట్రోల్‌ రూమ్‌
అతిభారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ అప్రమత్తమైంది. ఇరిగేషన్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ చీఫ్‌ ఇంజినీర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చెరువులకు, కుంటలకు గండ్లు పడితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కుంటలు, చెరువులు దెబ్బతింటే వెంటనే 040 – 23390794 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని 185 చెరువులు, కుంటలు ఇతర జల వనరుల రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 15 మంది ఎస్‌ఈలతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీ అన్ని చెరువులను పరిశీలించి వాటి నాణ్యతను, జరిగిన నష్టాన్ని పరిశీలించనుంది. అదే విధంగా వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల్ని కూడా ఈ కమిటీ సూచించనుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement