e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home Top Slides గొర్రెల పంపిణీపైనా అక్కసు

గొర్రెల పంపిణీపైనా అక్కసు

  • చచ్చిపోతాయంటూ ఈటల శాపనార్థాలు
  • పథకాన్ని జీర్ణించుకోలేని వైనం
  • డబ్బులు కట్టకున్నా హుజూరాబాద్‌లో ఇస్తున్నరని దుష్ప్రచారం

కరీంనగర్‌, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జమ్మికుంట: ‘ఎన్నికలు అనంగానే గొర్రెలు పంచుతున్రు. ఇతర ప్రాంతాల్లో డబ్బులు కడితేనే గొర్రెలు ఇస్తున్రు. హుజూరాబాద్‌లో మాత్రం ఏ డబ్బుల కట్టకుండానే ఇస్తున్రు. మంచివి ఇస్తలేరు. పుర్రు గొట్టినవి.. చిన్నచిన్నవి, బక్క చిక్కినయి ఇస్తున్రు. ఇంటికి రాంగానే సచ్చిపోయే గొర్రెలు ఇస్తున్రు. గొప్పలు చెప్పుకునేందుకు తప్ప అవి ఎందుకు పనికిరావు. మనం కొనుక్కుంటే సగం పైసలకే అంతకన్నా గొప్పగా కొనుక్కోవచ్చు. ఇంకో ముచ్చట తెలుసా.. రెండిళ్లకో గొర్రెను ఇస్తరట. కోసుకొని తినున్రి’ ఇవి జమ్మికుంట మండలం శంభునిపల్లిలో రాజేందర్‌ మాట్లాడిన మాటలు.

ప్రభుత్వ పథకాలు ఎందుకూ పనికిరావంటూ ఇప్పటికే పలుమార్లు అక్కసు వెళ్లగక్కిన ఈటల రాజేందర్‌.. దళితబంధు పథకాన్ని అడ్డుకోవడానికి కుతంత్రాలు పన్నుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గొర్రెల పంపిణీ పథకంపై తీవ్ర అసహనాన్ని బయట పెట్టుకొన్నారు. యావత్తు గొల్ల కురుమలను అవహేళన చేసేవిధంగా మాట్లాడుతున్నారు. పథకంపై తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ రెండోవిడత కార్యక్రమం బుధవారం జమ్మికుంట నుంచి ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో 500 యూనిట్లను పంపిణీచేశారు. వీరందరూ కూడా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం లబ్ధిదారు వాటా చెల్లించినవారే.

- Advertisement -

చెల్లించినవారికి మాత్రమే గొర్రెల యూనిట్లను అందజేస్తున్నారు. కానీ ఇతర ప్రాంతాల్లో డబ్బులు కడితేనే ఇస్తున్నారని, హుజూరాబాద్‌లో ఫ్రీగా ఇస్తున్నారంటూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. శంభునిపల్లెలో జరిగిన సమావేశంలో ఈటల అసహనం స్పష్టంగా బయటపడింది. గొర్రెలను తీసుకురాంగనె సచ్చిపోతున్నయట. గొర్రెల కొంటానికి వెళ్తే గొల్ల, కురుమలకు ఇబ్బందులు అవుతున్నయంట. రెండిండ్లకు ఒక గొర్రెను ఇస్తారట. కోసుకొని తినండంటూ హేళనచేశారు. గొర్రెల పంపిణీపై ఈటలకు ఎంత అక్కసున్నదో అతని మాటలే వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం మంచి గొర్రెలను ఇవ్వడమేకాదు.. తమకు ఇబ్బందులు లేకుండా చూడటం రాజేందర్‌కు జీర్ణంకావడం లేదని గొల్ల, కురుమ వర్గాలు మండిపడుతున్నాయి.

గొర్లచ్చినయి అనా మీ బాధ!
సీఎం సారు గొర్లిత్తమన్నరు. గొర్లు తెచ్చుకొన్నం. మంచిగనే ఉన్నయి కదా. మా ఒక్క కోరపల్లి సొసైటీల్నే నిన్న (బుధవారం) 21మందికి వచ్చినయ్‌. అన్ని గొర్లు మంచిగున్నయ్‌. మేత్తానయ్‌. తిరుగుతన్నయ్‌. ఏమో సచ్చే గొర్లిత్తన్రు. రెండు రోజులకే సత్తయ్‌. పుర్రుకొడ్తున్నయ్‌ అని అంటున్నరట కొందరు. ఏం తెల్తది రాజేందర్‌కు. ఏది పడితే అది అనుకోండ్రి. కోరపల్లికి రాన్రి. గొర్లను సూడున్రి. మాకు లేని బాధ మీకెందుకు? గొల్లోల్లకు గొర్లెందుకనా? మేం జేసుక బతకద్దా ఏంది?

  • గిరివేన శ్రీనివాస్‌ యాదవ్‌, లబ్ధిదారుడు (కోరపల్లి)

ఇబ్బందెక్కడిది ?
ఇబ్బంది పడ్తున్నమని చెప్తున్నమా ఏంది? ఇబ్బందెక్కడిదో చెప్పాలె. నాకైతే గొర్లచ్చినయ్‌. ఆంధ్రకు పోయిన. గొర్లను జూసుకున్న. తెచ్చుకున్న. నిన్న సార్లిచ్చిన్రు. ఒక్క గొర్రెక్కూడ ఏంగాలే. సంబ్ర పడ్తన్నం. రోగాల్లేవ్‌.. నొప్పుల్లేవ్‌. ఇప్పటిదాకా డాక్టర్‌ అవసరం పడలే. అయినా సూడున్రి. గొర్లెట్టున్నయో. సావాల్నని మొక్కుతాన్ర ఏంది? మా గొల్లోల్లు శాపాలు పెడితే బాగుండది. నాశనమైతరు. ఇచ్చిన గొర్లను మంచిగ సాదుకుంట. పొదుపు జేసుకుంట. కాసుకొని బతుకుత.

  • గెల్లు సంపత్‌, లబ్ధిదారుడు (పాపయ్యపల్లి)

మంచిగ జూసుకున్నరు
మొదటి సారొచ్చినప్పుడు తీసుకోలే. ఇప్పుడు అచ్చినయ్‌ అన్నరు. సొసైటోళ్లు డీడీలు తియ్యమన్నరు. తీసిన. సార్లకప్పజెప్పిన. బుధవారం నాడు ఇత్తమన్నరు. ఆరుగురం ఒక్కో బ్యాచీ కలిసి ఆంధ్రకు పోయినం. మంచి గొర్లు దొరికినయ్‌. అక్కడోళ్లు మంచిగనే జూసుకున్నరు. ఇబ్బందేమిలేదు. మంచిగ తిన్నం. ఉన్నం. మంచి గొర్లకైతే తిరిగినం. తిరక్కుంటే మంచివెట్ట దొరుకుతయ్‌. సాన మందిమి పోతిమి. అట్ల పోంగనే, ఇట్ల దొరుకుతయా. ఏంది? గొర్లు గట్టిగున్నయి.

  • నల్లగాశె అశోక్‌, లబ్ధిదారుడు (కోరపల్లి)
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana