e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home Top Slides సమృద్ధిగా సాగునీరు

సమృద్ధిగా సాగునీరు

సమృద్ధిగా సాగునీరు
  • ఈ ఏడాది సేద్యానికి నీరు పుష్కలం
  • ప్రభుత్వ లక్ష్యానికి తోడైన ప్రకృతి
  • రైతులను సాగుకు సిద్ధం చేసే ఉగాది
  • సాగు, దిగుబడిలో మనదే అగ్రస్థానం
  • రైతు కుటుంబాల్లో వసంతం తేవడమే లక్ష్యంగా రాష్ట్రంలో అనేక పథకాలు
  • ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
  • ప్రజలకు సీఎం ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (నమస్తే తెలంగాణ): తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ‘ప్లవ నామ సంవత్సరం’ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యంగా పంచాంగాలు చెప్తున్న నేపథ్యంలో.. తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు సమృద్ధిగా లభించనుందని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి తోడు కావడం శుభసూచకమన్నారు. వ్యవసాయ ప్రా రంభ సంవత్సరంగా.. రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధి గాంచిందని కేసీఆర్‌ అభివర్ణించారు. శిశిరంలో ఆకులు రాల్చిన ప్రకృతి.. కొత్త చిగురులతో వసంతాన్ని మోసుకొస్తూ, నూతనోత్తేజాన్ని సంతరించుకుంటూ పక్షుల కిలకిలారావాలతో ఆహ్లాదకరమైన కొత్త జీవితానికి ఉగాది ఆహ్వానం పలుకుతుందని తెలిపారు. వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లను ఉగాది నుంచే రైతు ప్రారంభిస్తారని, రైతును వ్యవసాయానికి సంసిద్ధంచేసే ఉగాది రైతు జీవితంలో భాగమై పోయిందని పేర్కొన్నారు.

స్వయం పాలనలో రైతుకు తియ్యటి ఫలాలు

ఉమ్మడి పాలనలోని చేదు అనుభవాలను చవిచూసిన తెలంగాణ రైతు, స్వయంపాలనలో తియ్యటి ఫలాలను అనుభవిస్తున్నారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బరాజ్‌లు కట్టి, సొరంగాలు తవ్వి, లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి, నదీ జలాలను సాగరమట్టానికి ఎంతో ఎత్తుమీదున్న సాగుబీళ్లకు మళ్లించామన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇంటాబయటా అనేక ప్రశంసలను అందుకుంటున్నదని వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతలు, ఆన్‌ గోయింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను మరికొద్ది నెలల్లో పూర్తి చేసుకోబోతున్నామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా నిలిచిందని, విమర్శకుల అంచనాలను తారుమారుచేసి పం టల సాగు, ధాన్యం దిగుబడిలో దేశంలోనే మొ దటి స్థానానికి చేరుకున్నదని సీఎం చెప్పారు.

రైతు జీవితాల్లో కొత్త ఆశలు

రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అందిస్తున్న భరోసాతో తెలంగాణ రైతు కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. విత్తనం నాటినప్పటి నుంచి.. పంటఫలం చేతికొచ్చేదాకా రైతులకు అన్నిరకాల సాయమందిస్తున్న తెలంగాణ ప్రభు త్వం వారి కష్టాలను తన భుజాలమీదికి ఎత్తుకున్నదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో దండుగన్న వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభు త్వం పండుగగా మార్చిందని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దఎత్తున ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు తదితర రైతు సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి పథకాల అమలుకోసం ఏటా రూ.50 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని తెలిపారు. రైతు కుటుంబాల్లో వసంతాలను తెచ్చి, పున్నమి వెన్నెళ్లను నింపడమే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

తీపి, వగరు, చేదు రుచుల పచ్చడి

చైత్రమాసంలో ఉగాదితో ప్రారంభమయ్యే నూతన సంవత్సరాదినాడు పచ్చడిని సేవించడం గొప్ప ఆచారమని సీఎం కేసీఆర్‌ అన్నారు. అప్పుడప్పుడే చిగురించే వేపపూతను, మామిడి కాతను, చేతికందే చింతపండులాంటి ప్రకృతి ఫలాలతో కలగలిసిన తీపి, వగరు, చేదు రుచుల పచ్చడిని సేవించి పండుగను జరుపుకోవడం గొప్ప సందేశాన్నిస్తున్నదని చెప్పారు. మనిషి జీవితంలోని కష్ట సుఖాలు, మంచి చెడుల జీవితసారాన్ని తాత్వికంగా గుర్తుచేసుకునే గొప్ప సజీవ సంప్రదాయానికి చిహ్నంగా ఉగాది పచ్చడిని సేవిస్తారని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Advertisement
సమృద్ధిగా సాగునీరు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement