న్యూఢిల్లీ, జూన్ 5: చీకట్లో ఆరుబయట కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఒక్కో చుక్కను లెక్కగట్టడం అందమైన అనుభవం. కొన్ని చుక్కలు లెక్క పెట్టగానే, లెక్కపెట్టిన చుక్కల్లోనే కొత్త చుక్క వచ్చినట్టు అనిపిస్తుంది. లెక్క మొదటికొస్తుంది. మళ్లీ మొదటి నుంచి లెక్కపెట్టుకుంటూ పోతే మళ్లీ ఎక్కడో లెక్క తప్పుతుంది. ఆకాశంలో ఎన్ని చుక్కలుంటాయి.. వాటిని లెక్కగట్టడం సాధ్యమేనా.. అసలు శాస్త్రవేత్తలు నక్షత్రాలను ఎలా లెక్కగడతారు.. ఇలాంటి సందేహాలు ఏదో ఒక సందర్భంలో ప్రతీ ఒక్కరి మనసులోకి వచ్చే ఉంటాయి. ఈ మొత్తం విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయన్నది లెక్కగట్టేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో సైబర్-2 అని టెలిస్కోప్ లాంటి పరికరాన్ని వినియోగించనున్నది. ఆదివారం అమెరికాలో న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ మిసైల్ రేంజ్ నుంచి రాకెట్ ద్వారా దీనిని అంతరిక్షంలోకి పంపనున్నారు.
సైబర్ 2 ఎలా లెక్కిస్తుంది?
సైబర్ 2 ఒక్కో నక్షత్రాన్ని లెక్కించదు. గెలాక్సీలోని నక్షత్రాల కాంతి ఆధారంగా లెక్కిస్తుంది. సైబర్-2 భూవాతావారణం దాటి కక్ష్యలో ప్రవేశించాక విశ్వంలో గెలాక్సీ క్లస్టర్లను(సమూహాలు) పరిశీలిస్తుంది. ఒక్కో క్లస్టర్లో 100-1000 వరకు గెలాక్సీలు ఉంటాయి. గెలాక్సీ నుంచి వచ్చే కాంతిని ఎక్స్‌స్ట్రా గ్యాలాటిక్ బ్యాక్‌గ్రౌండ్ లైట్ అని పిలుస్తారు. ఈ మొత్తం కాంతిలో సైబర్-2 కాస్మిక్ ఇన్ఫ్రారెడ్ బ్యాక్‌గ్రౌండ్ మీద సైబర్ 2 ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇది నక్షత్రాల సంఖ్యను అంచనావేయడానికి ఉపకరిస్తుంది.
శాస్త్రవేత్తలు.. మారుతున్న అంచనాలు
నక్షత్రాల లెక్కింపు కొత్త ప్రయోగమేమీ కాదు. గతంలోనూ చేశారు. విశ్వంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కో గెలాక్సీలో 10 కోట్ల నక్షత్రాలు ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు తొలుత తమ పరిశోధనలను బట్టి అంచనా వేశారు. మారుతున్న సాంకేతికతతో పరిశోధనలు నిర్వహించిన కొద్దీ నక్షత్రాల సంఖ్య ముందుగా ఊహించినట్టు కాకుండా అంతకు పదుల రెట్లు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఒక్కో గెలాక్సీలో లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయని, విశ్వంలో 2లక్షల కోట్లకు పైగా గెలాక్సీలు ఉన్నాయని నాసా వెల్లడించింది. అంటే ఈ గెలాక్సీల్లో ఉన్న నక్షత్రాలను అన్నింటిని లెక్కేస్తే 100 క్విన్ట్రిలియన్ల (1 పక్కన 21 సున్నాలు) నక్షత్రాలు లెక్కకు వస్తాయని పేర్కొన్నది. దీనిని భూమి మీద ఉన్న ఇసుకతో సరిపోల్చి చూస్తే ఒక్కో ఇసుక రేణువుకు 10 కంటే ఎక్కువ నక్షత్రాలు లెక్కకు వస్తాయి అని చెప్పింది. ‘అది కూడా నక్షత్రాలన్నీ గెలాక్సీలో ఉన్నాయని భావిస్తే ఈ లెక్క వస్తుంది. గెలాక్సీ బయట కూడా నక్షత్రాలు ఉంటాయి. వాటిని కలుపుకొంటే ఇది ఇంకా పెరగొచ్చు’ అని తెలిపింది.