e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home Top Slides భారత్‌.. ఓ హెచ్చరిక!

భారత్‌.. ఓ హెచ్చరిక!

 • ముందుంది మహాముప్పు
 • భారత్‌లోని పరిస్థితులే సంకేతం
 • పేద, మధ్య ఆదాయ దేశాలకు ఐఎంఎఫ్‌ హెచ్చరిక
 • వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి
 • టీకా కొనుగోలును కేంద్రమే చేపట్టాలి
 • 60% జనాభాకు టీకా వేయాలంటే తక్షణమే వంద కోట్ల డోసులకు ఆర్డర్‌ ఇవ్వాలి
 • కేంద్ర ప్రభుత్వానికి ఐఎంఎఫ్‌ సూచన
భారత్‌.. ఓ హెచ్చరిక!

వాషింగ్టన్‌, మే 22: భారత్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్‌వేవ్‌ విపత్తు.. భవిష్యత్తులో మరింత దుర్భర పరిస్థితులు ఎదురుకావొచ్చనేందుకు ఒక సంకేతం అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొన్నది. ఇప్పటివరకు మహమ్మారి ప్రభావం అంతగా పడని పేద, మధ్య ఆదాయ దేశాలకు భారత్‌లోని పరిస్థితులు ఒక హెచ్చరిక అని తెలిపింది. ఐఎంఎఫ్‌ ఆర్థిక వేత్త రుచిర్‌ అగర్వాల్‌, ప్రధాన ఆర్థిక వేత్త గీతా గోపీనాథ్‌ ఈ మేరకు ఒక నివేదికలో వెల్లడించారు. మొదటి వేవ్‌లో భారత వైద్యవ్యవస్థ బాగా పనిచేసిందని, అయితే సెకండ్‌వేవ్‌లో కేసులు భారీగా పెరుగడంతో ఒత్తిడి పెరిగిందని తెలిపింది. ఆక్సిజన్‌, బెడ్లు, వైద్య చికిత్స అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నది.

ఏడాది చివరికి 200 కోట్ల డోసులు!
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాక్సిన్‌ కొనుగోళ్లతోపాటు.. అంతర్జాతీయ టీకా సహకార ప్రాజెక్టు అయిన కొవాక్స్‌ కవరేజీని కూడా కలుపుకుంటే వచ్చే ఏడాది తొలి అర్ధభాగానికి 25 శాతానికిపైగా జనాభాకు వ్యాక్సిన్‌ వేయవచ్చని నివేదిక పేర్కొన్నది. 60 శాతం జనాభాను కవర్‌ చేయాలంటే తక్షణమే భారత ప్రభుత్వం 100 కోట్లకుపైగా వ్యాక్సిన్‌లకు ఆర్డర్లు ఇవ్వాల్సి ఉన్నదని తెలిపింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 600 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందించడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నది. ఈ ఏడాది చివరి నాటికి 200 కోట్ల డోసుల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నట్టు తెలిపింది.

టీకాల స్వేచ్ఛాయుత ఎగుమతులు అవసరం
వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడిసరుకులతోపాటు వ్యాక్సిన్ల ఎగుమతులకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నివేదిక సూచించింది. ప్రపంచం వ్యాక్సినేషన్‌ లక్ష్యాలను చేరుకోవాలంటే ముడిసరుకుల, వ్యాక్సిన్ల స్వేచ్ఛాయుత రవాణా అత్యంత కీలకమని స్పష్టంచేసింది. భారత్‌లో టీకా ముడిసరుకులకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో వాటి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించేందుకు అమెరికా అంగీకరించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అయితే ఈ విషయంలో ఇంకా అవరోధాలు ఉన్నాయని, ప్రపంచ దేశాల మధ్య మరింత సమన్వయం అవసరమని సూచించింది. ప్రస్తుతం భారత్‌లో 45 ఏండ్లు పైబడిన వారికి కేంద్రమే వ్యాక్సిన్లను సమకూరుస్తున్నదని, 18-44 ఏండ్లు వయసువారికి మాత్రమే రాష్ర్టాలు కొనుగోలు చేస్తున్నాయని నివేదిక పేర్కొన్నది. కేంద్రమే మొత్తం వ్యాక్సిన్ల కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని సూచించింది. 18-44 ఏండ్ల వారికి వ్యాక్సిన్‌ వేసేందుకు అదనంగా జీడీపీలో 0.25 శాతం నిధులు అవసరమవుతాయని అంచనావేసింది.

5,000 కోట్ల డాలర్లతో గ్లోబల్‌ వ్యాక్సినేషన్‌ ప్లాన్‌
5,000 కోట్ల డాలర్లతో (దాదాపు రూ.37వేల కోట్లు) ఐఎంఎఫ్‌ గ్లోబల్‌ వ్యాక్సినేషన్‌ ప్లాన్‌ను ప్రతిపాదించింది. దీని ద్వారా ఈ ఏడాది చివరి నాటికి 40 శాతం ప్రపంచ జనాభాకు, వచ్చే ఏడాది తొలి అర్ధభాగానికి 60 శాతం జనాభాకు వ్యాక్సిన్‌ వేసేందుకు వీలవుతుందని తెలిపింది. ఇంతకుముందెన్నడూ లేని ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే బలమైన కార్యాచరణ అవసరమని పేర్కొన్నది. ఇందుకు మూడు ప్రతిపాదనలు చేసింది.

 1. 2022 తొలి అర్ధభాగానికి 60 శాతం జనాభాకు వ్యాక్సిన్‌ వేయాలి. అందుకు కొవాక్స్‌కు అదనపు గ్రాంట్లు అవసరం. వివిధ దేశాలు తమ వద్ద ఉన్న మిగులు వ్యాక్సిన్లను ఇతర దేశాలకు విరాళంగా అందించాలి. వ్యాక్సిన్లు, ముడి సరుకుల ఎగుమతికి అవకాశం కల్పించాలి.
 2. వైరస్‌ ఉత్పరివర్తనాలతో బూస్టర్‌ డోసులకు అవసరం ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంపునకు అదనపు పెట్టుబడులు అవసరం. అలాగే వైరస్‌ మ్యుటేషన్లపై పర్యవేక్షణ ఉంచాలి.
 3. వ్యాక్సిన్‌ సరఫరా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో టెస్టింగ్‌, ట్రేసింగ్‌, వైద్యచికిత్స, ఇతర ప్రజారోగ్య చర్యలు విస్తృతం చేయాలి. అదేసమయంలో వ్యాక్సిన్‌ పంపిణీ చర్యలు వేగవంతం చేయాలి.
  ఈ ప్రతిపాదనలకు 5,000 కోట్ల డాలర్లు అవసరమవుతాయని.. గ్రాంట్లు, ప్రభుత్వ వనరులు, ఇతర ఫైనాన్స్‌ మార్గాల ద్వారా వీటిని సమకూర్చుకోవాల్సి ఉన్నదని ఐఎంఎఫ్‌ తెలిపింది.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భారత్‌.. ఓ హెచ్చరిక!

ట్రెండింగ్‌

Advertisement