e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home Top Slides ఫలప్రద విప్లవం

ఫలప్రద విప్లవం

ఫలప్రద విప్లవం
  • ఏడాదంతా ఉగాది ఉషస్సు.. సమృద్ధిగా పంటలు
  • ఆర్థికరంగం పరుగులు.. పరిశ్రమల పురోగతి
  • ప్లవ నామ సంవత్సరం అందరికీ శుభప్రదం
  • ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు

కాళేశ్వరంతో పసిడి పంటలు

ఉమ్మడి పాలనలో చేదు అనుభవాలను చవిచూసిన తెలంగాణ రైతు, స్వయం పాలనలో తియ్యటి ఫలాలను అనుభవిస్తున్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మండే వేసవిలోనూ చెరువులను నిండుకుండలుగా మార్చి, రైతులకు పసిడి పంటలను అందిస్తున్నది.
-ముఖ్యమంత్రి కేసీఆర్‌

వికారి నామ సంవత్సరం ఆఖరిలో మొదలైన కొవిడ్‌ వికారం సోకి శార్వరి నామ సంవత్సరం వర్రీగానే కొనసాగింది. శార్వరి అంటే చీకటని అర్థం. అందుకు తగ్గట్టే గతేడాదిలో చాలా భాగం సందేహాల మధ్య బతుకులు వెళ్లదీశాం. కరోనా తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునేంతలోనే మళ్లీ కొవిడ్‌ విలయం మొదలైంది. ఆ చీకటి తెరలను చీల్చుకుంటూ శ్రీ ప్లవ నామ సంవత్సరం ప్రవేశించింది. ప్లవ అంటే దాటడం అనే అర్థం ఉంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి లోకాన్ని క్షేమంగా దాటవేస్తానని అభయ నామంతో అడుగిడింది నూతన తెలుగు సంవత్సరాది. అందుకు తగ్గట్టే ఈ ఏడాది అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి ఉంటాయని పంచాంగ కర్తలు, పండితులు చెప్తున్నారు.

గిర్రున తిరిగే కాలచక్రానికి ఉగాది కొలమానం. నేటి గ్రహగతులు ఈ యేటి ఫలితాలను నిర్దేశిస్తాయని సిద్ధాంతులు చెప్తుంటారు. మంగళవారం ఉగాది రావడంతో ఆ వారానికి అధిపతి అయిన కుజుడు ఈ సంవత్సరానికి రాజు. నవగ్రహాలకు సేనాధిపతి అయిన అంగారకుడు ప్లవ నామ సంవత్సరానికి ఏలికయ్యాడు. కుజుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. ఊహించని యోగాలనూ కలిగిస్తాడు. పాలకుల ప్రాపకం పెరుగుతుంది. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం అధికమవుతుంది. విద్య, వైద్య, ఉపాధి తదితర రంగాల్లో అభివృద్ధి కొనసాగుతుందని ప్రముఖ పంచాగకర్త యాయవరం చంద్రశేఖర శర్మ పేర్కొన్నారు.

గ్రహగతులు అనుకూలం

గ్రహ సంచారం అనుసరించి ఫలితాలను విశ్లేషిస్తుంటారు సిద్ధాంతులు. నవనాయకులు, ఉపనాయకుల ప్రభావం, సంక్రాంతి పురుషుడి లక్షణాలు, కార్తెలు ప్రవేశించే సమయం ఆధారంగా సంవత్సర ఫలితాలను విశ్లేషిస్తారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ప్లవ నామ సంవత్సరం ఉన్నతంగా ఉంటుందని చెప్తున్నారు. సిద్ధాంతులు. ముఖ్యంగా గత రెండేండ్లలో ఏర్పడిన షష్ఠ గ్రహ కూటమి ఈ ఏడాది ఉండకపోవడం మంచిదని వారంటున్నారు. ఈ ఏడాది విపత్తులు తలెత్తే అవకాశం లేదని పేర్కొంటున్నారు. పైగా ప్లవ నామ సంవత్సరంలో భారతదేశంలో కనిపించే గ్రహణాలు లేకపోవడం కూడా మంచిదంటున్నారు. మే 26న ఏర్పడే చంద్ర గ్రహణం ప్రభావం ఈశాన్య రాష్ర్టాల్లో పాక్షికంగా ఉంటుందని తెలిపారు. పాపగ్రహాల ప్రభావం అధికంగా లేకపోవడంతో ఈ ఏడాదంతా సజావుగా సాగిపోతుందని పంచాంగకర్త గుడి ఉమామహేశ్వర సిద్ధాంతి పేర్కొన్నారు.

రాష్ర్టానికి మేలు

తెలంగాణ ఆవిర్భావ సమయానుసారం ప్లవ మన రాష్ర్టానికి మేలు చేస్తుందని పంచాంగ కర్తలు అంటున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా సాగుతాయని, రాష్ర్టాభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతుందని పేర్కొంటున్నారు. వర్షపాతం అనుకూలంగా ఉండటం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్లేషిస్తున్నారు. కొంత ఆలస్యమైనా సరిపడా వర్షపాతం నమోదవుతుందని, ప్రాజెక్టులు జలకళ సంతరించుకొని కర్షకులకు మేలు జరుగుతుందని అంటున్నారు. ఫలితంగా రాష్ట్రం పురోగతి సాధిస్తుందని సిద్ధాంతులు పేర్కొన్నారు.

ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం

వికారినామ సంవత్సరం (2019).. పేరుకు తగ్గట్టు వికృతంగా నాట్యం చేసింది. శార్వరి ( చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టింది. ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం. మొదలైంది. ఇది శుభప్రదమైన సంవత్సరం. కారణం.. ప్లవ అంటే, దాటించునది అని అర్థం. ‘దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం’దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుందని అర్థం. వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి. మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన ఆలోచనే. ప్లవ నామ సంవత్సరం ముగియగానే ‘శుభకత్‌’, ఆ తర్వాత ‘శోభకత్‌’ సంవత్సరాలు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడా మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. అభయాన్ని ప్రసాదిస్తాయి. అందుకే, ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం.
– గోపీ కృష్ణ శర్మ

శుభాలకు వారధి

కాలక్రమంలో ఫలితాలను విశ్లేషించి మన పూర్వీకులు సంవత్సరాలకు పేర్లు పెట్టారు. ఆయా సంవత్సరాల్లో కలిగే పరిణామాలకు ఈ పేర్లను సూచికలుగా భావిస్తారు. వికారి, శార్వరి సంవత్సరాలు వాటి పేర్లకు తగ్గట్టుగానే ప్రతికూల ఫలితాలిచ్చాయి. ప్లవ నామ సంవత్సరం పేరుకు తగ్గట్టుగా సత్ఫలితాలనిస్తూ ఇప్పుడున్న గడ్డుకాలం నుంచి గట్టెక్కిస్తుంది. రాబోయే శుభకృత్‌ (మేలు చేయునది), ఆ తర్వాత వచ్చే శోభకృత్‌ (వెలుగులు పంచునది) సంవత్సరాల్లో కలిగే శుభఫలితాలకు ప్లవ వారధిగానిలుస్తాయి.
– యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి

అత్యుత్తమ కాలం

ప్లవ అంటే అత్యుత్తమ ఉపాయమనే అర్థం కూడా ఉన్నది. ప్రస్తుత విపత్తు నుంచి బయటపడే సమయం మొదలైంది. అనూహ్యమైన మార్పుల వల్ల ప్రజల జీవితాల్లో ఉన్నతి నెలకొంటుంది. ఆర్థికరంగం పుంజుకుంటుంది. గ్రహస్థితులు అనుకూలంగా ఉండటంతో వ్యవసాయం, పరిశ్రమల్లో విశేషమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రంగాల్లో వినూత్న విధానాలు మొదలవుతాయి. ప్రజల్లో భక్తి విశ్వాసాలు పెరుగుతాయి. దైవానుగ్రహంతో విపత్కర పరిస్థితులు త్వరగా తొలగిపోతాయి.
– దివ్యజ్ఞాన సిద్ధాంతి

సింహభాగం సంతోషాలు

శ్రీ ప్లవ ప్రారంభం ఘనంగా ఉన్నా చివరిలో కొన్ని చికాకులు తలెత్తవచ్చు. 2021 డిసెంబర్‌ 31 నుంచి 2022 ఏప్రిల్‌ 2వ తేదీ వరకు కాలసర్పదోషాలు ఉన్నాయి. గ్రహాలన్నీ రాహు-కేతువుల మధ్య ఉండటాన్ని కాలసర్పదోషం అంటారు. శాస్ర్తానుసారం కాలసర్ప దోషం ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఆకస్మిక యోగాలూ ఉంటాయి. ఈ మూడు నెలలు మినహాయిస్తే మిగతా ఏడాదంతా ఉన్నతమైన సమయం ఉంది. శని స్వక్షేత్ర సంచారం, గురువు సమక్షేత్ర స్థితి, రాహు, కేతు సంచారం అనుకూల ఫలితాలిస్తాయి.
– గుడి ఉమామహేశ్వర శర్మ సిద్ధాంతి

Advertisement
ఫలప్రద విప్లవం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement