e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 16, 2021
Home Top Slides మనమే ఆవిష్కర్తలం.. దేశానికి ఆదర్శం

మనమే ఆవిష్కర్తలం.. దేశానికి ఆదర్శం

  • ఢిల్లీలో జాతీయ నాయకుల అభినందన..
  • దళితబంధు సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకానికి మనమే ఆవిష్కర్తలం.. దేశానికి మనమే ఆదర్శమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో దళితబంధు అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని వర్గాలను ఆదుకుంటూ వస్తున్నం. ఉన్నతవర్గాల్లోని పేదలకు కూడా ఆర్థికంగా అండగా ఉంటున్నం. ప్రతి వర్గానికీ మా ప్రభుత్వం ఉన్నదనే భరోసాను కల్పిస్తున్నం. అందులో భాగంగానే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టాం. కరోనా వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. లేదంటే గతేడాదే పథకాన్ని అమలు చేసేవాళ్లం. ఇప్పటికీ కరోనా పరిస్థితులు సద్దుమణగకపోయినా, అంత గొప్ప కార్యక్రమం ఆగిపోవద్దనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. దళితుల అభ్యున్నతికి ఇంతటి చిత్తశుద్ధితో ఒక పథకాన్ని తీసుకువచ్చి, పకడ్బందీగా ప్రణాళికలతో అమలు చేసిన, అన్ని కోణాల్లో పర్యవేక్షించిన దాఖలాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ లేదు. గత అనుభవాలను అధ్యయనంచేసే అవకాశాలు కూడా లేవు. అటువంటిది ఏమైనా ఉన్నదంటే అది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధే. కాబట్టి మనమే ఆవిష్కర్తలం. మనమే ఆదర్శంగా నిలవాలి. ప్రతి నియోజకవర్గంలో పరిమిత సంఖ్యలో ఇవ్వాలని యోచిస్తున్నాం. కల్యాణలక్ష్మిని తొలుత దళిత, గిరిజనులకే పరిమితమైన ఈ రోజు అన్ని వర్గాలకు అమలుచేస్తున్నాం. అదే తరహాలో దళితబంధు కూడా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాం.

ఢిల్లీ నేతలు అభినందించారు
ఢిల్లీలో 80 లక్షల దళిత జనాభా ఉన్నది. 13 రిజర్వ్‌డ్‌ సీట్లు ఉన్నాయి. నేను మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు చాలామంది దళిత నాయకులు కలిశారు. ‘మీరు చాలా మంచి ప్రోగ్రాం తీసుకున్నరు. మేం ఫాలో అవుతున్నం. హైదరాబాద్‌లో ఉన్న మా మిత్రులను అడిగి కొంత సమాచారం తీసుకున్నం’ అని అన్నారు. అంటే దళితబంధు ప్రభావం అంత ఉంటుంది. ‘కేంద్రాన్ని ఏమైనా సహాయం అడిగారా?’ అని అంటే ‘ప్రతిపాదన పెట్టాం. వారు సాయంచేస్తే చేస్త్తరు. లేకపోతే లేదు’ అని చెప్పిన. మనం ప్రాసెస్‌లో ముందుకు పోతా ఉంటే.. రాబోయే రోజుల్లో మనకు పూర్తి సహకారం ఇచ్చే, పూర్తి సానుకూలంగా ఉండే ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి రావొచ్చు. అప్పుడు మనం కొంచెం గట్టిగ ప్రయత్నం చేస్తే ఏడాదికి రూ.40 వేల కోట్లు, రూ.50 వేల కోట్లు రావొచ్చు. అట్లా వస్తే అతి తక్కువ సమయంలోనే మనం మొత్తం ప్రోగ్రాం పూర్తిచేసుకోవచ్చు. రాష్ట్రంలో ఇంకో రెండు ఆర్థిక సంవత్సరాలు మన చేతుల్లో ఉన్నయి. బడ్జెట్‌ మన చేతుల్లో ఉన్నది. కాబట్టి కొన్ని లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తింపచేయవచ్చు. అదృష్టవశాత్తు నీతి ఆయోగ్‌వాళ్లు ఇటీవల చెప్పిన దాని ప్రకారం మన రాష్ట్రంలో ఆర్థికంగా మంచి ట్రెండ్స్‌ ఉన్నాయి. కాబట్టి నిధుల గురించి మనం పెద్దగా కంగారుపడాల్సింది ఏమీలేదు.

- Advertisement -

అవకాశాలు అనేకం
ఆయా ప్రాంతాల పరిధిలో ఇలాంటి అనేక అవకాశాలుంటయి. జిల్లా మంత్రులు, కలెక్టర్లు స్థానికంగా ఉంటరు. అలాంటివి గుర్తించి వారికి మద్దతు అందించాలి. మన అందరి చివరి లక్ష్యం దళిత కుటుంబాలు బాగుపడటం. దాని కోసం ప్రయత్నం చేయాలి. 26 ఏండ్ల్ల కింద నా నియోజకవర్గంలో దళిత చైతన్య జ్యోతి అని నాలుగు గ్రామాలను కలుపుకొని ప్రయత్నం మొదలు పెట్టాం. వాళ్లకు ఇండ్లు కట్టియ్యాలి. ట్రాక్టర్లు ఇవ్వాలి అని. ఆ సయమంలో మొత్తం నియోజకవర్గంలో ఒక్క దళిత బిడ్డకూ ట్రాక్టర్‌ లేదు. ఎంతో బాధపడ్డం. ఆరు ట్రాక్టర్లు ఇప్పించినం. దళితుల చేతుల్లో ప్రపంచం తీసుకొచ్చి పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. వెనుకకు మర్రి చూస్తే ఏం లేదు. చిన్నతనంలో మనం చూసిన దళిత కుటుంబాలు ఎలా ఉండెనో.. ఇప్పుడూ అలాగే ఉన్నాయి. గుణాత్మకమైన మార్పు రావాలి.

కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఇది గొప్ప సంతృప్తినిస్తుంది. పర్యవేక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. కలెక్టర్‌ ఆఫీస్‌ నిరంతరం మానిటరింగ్‌ చేయాలి. రికార్డులు పకడ్బందీగా నిర్వహించాలి. కేంద్రం పలు ఆంక్షలు పెడుతుంది కాబట్టి.. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక దళిత బంధు అకౌంట్‌ ఏర్పాటు చేయాలి. బ్యాంకర్లతో సమావేశమై చర్యలు తీసుకోవాలి. ప్రతి కుటుంబం ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలి. అప్పుడు డబ్బులు అందులో జమ చేయాలి. చెడగొట్టుడు కరెక్ట్‌ కాదు. అందుకే వేరే వారి చేతిలో కాకుండా దళిత బిడ్డల చేతిలో ఇది ఉండాలి. కలెక్టర్లతోపాటు వారి పర్యవేక్షణ ఉంటుంది. వందల వేల కోట్లు ప్రభుత్వం జమ చేస్తుంది. ఒక్క రూపాయి దుర్వినియోగం కాకూడదు. రైతు బీమా కూడా రూ.500 కోట్లతో మొదలు పెట్టాం. ఇప్పుడు రూ.1450 కోట్ల ప్రీమియం చెల్లిస్తున్నం.

ఉచితంగా భూమి ఇస్తాం
దళితబంధులో ఇచ్చే డబ్బుతో వారి ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావచ్చు. మందులు, ఎరువులు, విత్తన దుకాణాలు, బార్‌ అండ్‌ వైన్స్‌, మీ సేవ, గ్యాస్‌ డీలర్‌షిప్స్‌, మినీ బస్సులు, మైనింగ్‌ లీజులు, సివిల్‌ కాంట్రాక్టులు, ఔట్‌సోర్సింగ్‌ సర్వీస్‌.. ఇలా సాధ్యమైన వాటిలో కొంత రిజ్వరేషన్లు పెడతం. అలా కాకుండా ‘మాకు అనుభవం ఉంది. ఇది చేసుకుంటం’ అంటే సంతోషంగా మద్దతు అందిస్తం. దళితబంధు కింద ఎవరైనా డెయిరీ లేదా మరేదైనా పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తే వారికి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నచోట ఉచితంగానే కేటాయిస్తాం. కలెక్టర్లకు ఈమేరకు ఆదేశాలు ఇస్తున్నం. డెయిరీ రంగానికి మంచి భవిష్యత్తు ఉన్నది. దళితబంధులో డైయిరీ యూనిట్స్‌కు స్పందన ఎకువగా వస్తున్నందున ఎస్సీ సంక్షేమశాఖ, పశుసంవర్ధక శాఖ, ప్రభుత్వ సహకార డైయిరీలతో ఒక జాయింట్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేయాలి. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం ప్రజలు సగటున ఎన్ని పాలను వినియోగించాలి? ప్రస్తుతం ఎంత వినియోగిస్తున్నారు? రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎంత జరుగుతుంది? బయటి రాష్ట్రాల నుంచి ఎంత దిగుమతి చేసుకుంటున్నారనే అంశాలపై సమీక్ష జరిపి దళితబంధులో డైయిరీ యూనిట్లను ప్రోత్సహించాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana