e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home Top Slides తెలంగాణలో దళిత క్రాంతి

తెలంగాణలో దళిత క్రాంతి

  • 1200 కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం
  • అవసరమైతే మరో 500 కోట్లు ఖర్చు
  • తొలుత నియోజకవర్గానికి వంద కుటుంబాలు
  • ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం
  • రైతుబంధు, ఆసరా పెన్షన్ల మాదిరిగా ఖాతాల్లోకి
  • దళితోద్ధరణకు మిషన్‌మోడ్‌లో కార్యాచరణ
  • అట్టడుగుస్థాయి నుంచి అభివృద్ధి జరుగాలి
  • పారదర్శకంగా అమలుకు సలహాలు ఇవ్వండి
  • అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 27 (నమస్తే తెలంగాణ): శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆశాదీపం వెలిగించారు. రాష్ట్రంలోని దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి వారి స్వావలంబన కోసం ‘సీఎం దళిత సాధికారత పథకాన్ని’ ప్రకటించారు. దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పునకు ఈ పథకం దోహదం చేయనున్నదని తెలిపారు. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఈ పథకం అమలుకు అవసరమైన సూచనలుచేయాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. సమావేశంలో వచ్చిన సూచనలు, సలహాల మేరకు సీఎం దళిత సాధికారత పథకం అమలుకు కార్యాచరణ ప్రకటించారు. దళితులకు ఆర్థిక సాధికారత, స్వావలంబన కోసం సీఎం కేసీఆర్‌ రూ.1200 కోట్లతో ‘సీఎం దళిత సాధికారత పథకం’ ప్రకటించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేసీఆర్‌ ఈ నిర్ణయం వెల్లడించారు. తమ అభివృద్ధిని తామే నిర్వచించుకొనే విధంగా, దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవించాలని దళిత సాధికారత పథకంపై ఆదివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేశ్‌ నేతకాని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, విప్‌లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఈ సమావేశం భావించింది.

ఈ పథకం కింద ఒక్కో యూనిట్‌ (కడు పేద దళిత కుటుంబం)కు రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని అఖిలపక్షం నిర్ణయం తీసుకొన్నది. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంద కుటుంబాల చొప్పున 119 నియోజకవర్గాలలో 11,900 కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురవడం భారత సమాజానికే కళంకం. ఇది మనసున్న ప్రతి ఒకరినీ కలచివేసే విషయం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధికోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నది. విద్య, వ్యవసాయం సహా పలురంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తున్నది. అయినప్పటికీ ఇంకా దారిద్య్రరేఖకు దిగువన, బాటమ్‌లైన్‌లో విస్మరించబడిన దళిత కుటుంబాలను గుర్తించి వారిని అభివృద్ధి పథాన నడిపించడమే ప్రధాన ధ్యేయంగా 1200 కోట్ల రూపాయలతో ‘సీఎం దళిత సాధికారత పథకం’ ప్రవేశపెడుతున్నాం’ అని స్పష్టంచేశారు.

- Advertisement -

ఇక మిషన్‌మోడ్‌లో దళితోద్ధరణ
దళితులను సాధికారులను చేయడానికి ప్రభుత్వం మిషన్‌మోడ్‌లో పనిచేయాలని నిర్ణయించుకొన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ మేరకు రాబోయే మూడు నాలుగేండ్లలోనే రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు ఖర్చుచేయాలని భావిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీమ్‌’ కింద రూ.1200 కోట్లు కేటాయించాలనుకొన్నామని చెప్పారు.. అవసరమైతే అదనంగా మరో రూ.500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఈ బడ్జెట్‌ ఎస్సీ సబ్‌ప్లాన్‌కు అదనం అని స్పష్టంచేశారు. ఈ పథకాన్ని అత్యంత పకడ్బందీగా అమలుచేయాలని, దళారుల ప్రమేయం లేకుండా రైతుబంధు, ఆసరా పెన్షన్ల మాదిరిగా నేరుగా లబ్ధిదారులకు అందేవిధంగా కార్యాచరణ ఉండాలని పేర్కొన్నారు. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలుచేయడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అఖిలపక్ష నేతలను కోరారు.

దళితుల ఉన్నతికి దశలవారీ కార్యాచరణ
సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటిపిల్లను పెంచి పోషించడం వంటి పాత్ర అని సీఎం కేసీఆర్‌ వివరించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా రేపటి తరాలు తీవ్రంగా నష్టపోతాయని, అందుకు పాలకులే బాధ్యులవుతారని అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఏ ఊరుకు వెళ్లినా సామాజికంగా, ఆర్థికంగా పీడితవర్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులేనని అన్నారు. ఇక నుంచి ఇలాంటి బాధ పూర్తిగా పోవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలగించేందుకు దశలవారీగా కార్యాచరణ అమలుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘మేము కూడా పురోగమించగలం’ అనే ఆత్మసె్థైర్యంతో దళిత సమాజం ముందుకుపోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలో సూచనలు ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను సీఎం కేసీఆర్‌ కోరారు.

పైరవీలకు తావుండొద్దు
దళిత సాధికారత సాధించడం కోసం, పైరవీలకు ఆసారంలేని పారదర్శక విధానాన్ని అమలుచేద్దామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘నిధుల బాధ్యత నాది.. రాజకీయాలకు అతీతంగా సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత మనందరం తీసుకుందాం’ అని సీఎం పిలుపునిచ్చారు. ‘భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగింది. మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలి. గోరేటి వెంకన్న పాడిన ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది’ పాటను మనసు పెట్టి వింటే దళితుల సమస్యకు పరిషారాలు దొరుకుతాయి. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడివిడిగా గుర్తించి పరిషారాలు వెతకాలి. దళితుల సామాజిక ఆర్థిక సమస్యలను గుర్తించి సమిష్టి కృషితో సమాధానాలు సాధించాలి’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

పటిష్టంగా పథకం
‘తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి సీఎం ‘దళిత్‌ ఎంపవర్‌మెంట్‌’ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలనుకుంటున్నది. ఇందుకు దళితుల్లో అర్హులైన వారి ఎంపిక కోసం గణన జరపాలి. అట్టడుగున ఉన్న వారినుంచి సహాయం ప్రారంభించి, వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలి. అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దళిత సాధికారత సాధించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మీరందరూ కలిసిరావాలి. నాకు భగవంతుడిచ్చిన సర్వశక్తులన్నీ ఉపయోగించి, సీఎం దళిత సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలన్నదే నా దృఢసంకల్పం’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ప్రైవేటులో రిజర్వేషన్లు పరిశీలిస్తాం
ప్రైవేట్‌ రంగంలో దళితులకు రిజర్వేషన్ల అమలు అంశం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని కూడా ఇదే సందర్భంలో సీఎం అన్నారు. అద్దాల అంగడి మాయా లోకం మోపైంది. ఈ పోటీ ప్రపంచం, కరోనా నేపథ్యంలో దళిత బిడ్డలు నైపుణ్యాలను పెంచుకోవాలి. ఎటువంటి బ్యాంకు గ్యారంటీల జంజాటం లేకుండానే సీఎం దళిత సాధికారత పథకం ద్వారా కడునిరుపేద దళిత కుటుంబాలకు సహకారం అందిస్తాం’ అని సీఎం హామీ ఇచ్చారు. పట్టణాల్లో మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి కోసం అన్వేషించాలని సూచించారు.

లైసెన్స్‌ల మంజూరులో రిజర్వేషన్లపై పరిశీలన
‘వ్యవసాయం సాగునీటి రంగాలను చకదిద్దినట్లు, ఇరిగేషన్‌ రంగాన్ని పట్టుబట్టి గాడిలో పెట్టినట్టు, దళితుల సాధికారత కోసం ప్రభుత్వం అంతే పట్టుదలతో పనిచేయాలని నిర్ణయించింది. వ్యాపార నిర్వహణ కోసం, ఇతర స్వయం ఉపాధి రంగాల ఏర్పాటుకోసం ప్రభుత్వం మంజూరు చేసే లైసెన్స్‌లు, అందించే పెట్టుబడుల అంశాల్లో అర్హులైన దళిత యువతకు రిజర్వేషన్స్‌ అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తాం’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సీఎం కేసీఆర్‌ పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సామాజిక రాజకీయ ఆర్దిక సాంస్కృతిక రంగాల్లో దళితుల అభివృద్ధి కోసం వారు విలువైన సూచనలు చేశారు. వాటిని అధికారులు సీఎం ఆదేశాల మేరకు నోట్‌ చేసుకున్నారు. దళితుల సాధికారత కోసం సీఎం తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని వారు ముక్త కంఠంతో అభినందించారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో షెడ్యూల్‌ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రైతుబంధు సమితి చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు వెంకటేశ్‌నేత, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్‌, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్యే సయ్యద్‌ అహ్మద్‌పాషా ఖాద్రి, ఎమ్మెల్సీలు ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు, డీ రాజేశ్వర్‌రావు, గోరేటి వెంకన్న, ఎమ్మెల్యేలు బాల సుమన్‌, దుర్గం చిన్నయ్య, హన్మంత్‌ షిండే, సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, క్రాంతికిరణ్‌ చంటి, కే మాణిక్‌రావు, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్‌, జీ సాయన్న,

గువ్వల బాలరాజు, వీఎం అబ్రహాం, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్‌ కుమార్‌, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్‌, సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, మోతుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి, టీఆర్‌ఎస్‌ ప్రధానకార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కృషాంక్‌, శ్రీధర్‌ రెడ్డి, సీపీఎం నేతలు బీ వెంకట్‌, జాన్‌వెస్లీ, సీపీఐ నేత బాలనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎంఓ అధికారులు నర్సింగ్‌రావు, భూపాల్‌రెడ్డి, స్మితా సబర్వాల్‌, శేషాద్రి, శ్రీధర్‌ దేశ్‌పాండే, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, బుద్దవనం ప్రాజెక్ట్‌ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ వైస్‌చైర్మన్‌, ఎండీ కరుణాకర్‌, ఎస్సీ అభివృద్ధిశాఖ అడిషనల్‌ డైరక్టర్‌ ఉమాదేవి, జీటీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

దళిత సాగుభూమి ఎంతో తేల్చాలి
‘రాష్ట్రంలో 7,79,902 మంది ఎస్సీ రైతుల వద్ద 13,58,000 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. స్థిరత్వం సాధించిన ఎస్సీ కుటుంబాలకు ఇతరత్రా చేయూతనిస్తూనే, రెకాడితే గానీ డొకాడని కుటుంబాలను మొట్టమొదటగా ఆదుకునే కార్యాచరణ చేపట్టాలి. ఎస్సీ రైతుల వద్ద ఉన్న 13,58,000 ఎకరాల్లో అసైన్డ్‌ భూముల్లో ఎన్ని ఎకరాలున్నాయి? ఇందులో ఉన్నదెంత? పోయిందెంత? లెకలు తీయాలి. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎస్సీ భూముల్లో నీళ్లు లేని, నీళ్లు ఉండి ఇతర వసతులు లేని భూములు కలిగి ఉన్న కుటుంబాలను గుర్తించాలి. అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికదే సిద్ధం చేసుకోవాలి. 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చి, దళిత సాధికారత కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధం. సమిష్ట కార్యాచరణతో అందరం కలిసి పనులు చేపట్టాలి. ప్రాజెక్టులు తదితర ప్రజావసరాల కోసం జరిపే భూసేకరణలో పట్టా భూములతోపాటు అసైన్డ్‌ భూములు కూడా సేకరించాల్సి వస్తున్నది. ఆ సమయంలో పట్టా భూములకు చెల్లించిన ఖరీదునే అసైన్డ్‌ భూములకు ప్రభుత్వం చెల్లిస్తున్నది’ అని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

సఫాయి కార్మికుల ఉద్యోగ భద్రత
‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదం నాది. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎకువ. ఎవరూ డిమాండ్‌ చేయకున్నా ప్రతిసారీ సఫాయి కార్మికుల జీతాలు పెంచుకుంటూ వస్తు న్నాం. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాం’ అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

విస్తృత చైతన్యం కల్పించాలి
‘సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ అనుసరించిన విధానాన్ని బట్టి ఎస్సీ సంక్షేమ శాఖ.. దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. కమిట్‌మెంట్‌ ఉన్న అధికారులను నియమించుకోవాలి. దళిత సాధికారత కోసం, దళిత సమాజాన్ని ఆ దిశగా అవకాశాలను అందుకునే పద్ధతిలో చైతన్యం చేయాలి. ఇందుకు సాంసృతిక కార్యక్రమాలు చేపట్టాలి. పాటలు, కళారూపాల ప్రదర్శన, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య కార్యక్రమాలను రూపొందించాలి. దళితుల చైతన్యం కోసం.. గోరేటి వెంకన్న వంటి కవులను, సాంసృతిక సారథి తదితర కళాకారుల సేవలను వినియోగించుకోవాలి. దళిత యువత ఆలోచనా దృక్పథంలో గుణాత్మక మార్పుకు, ఆత్మన్యూనత నుంచి ఆత్మ సె్థైర్యం పెరిగి, ఉన్నత స్థాయి ఓరియంటేషన్‌ అలవర్చుకునే దిశగా చర్యలు చేపట్టాలి’ అని సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వివిధ కారణాలతో ఆగిపోయిన దళిత ఉద్యోగుల పదోన్నతులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటుచేయాలని చెప్పారు. ప్రతి ఏటా పోటీ పరీక్షలకు హాజరయ్యే దళిత విద్యార్థిని, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా లబ్ధిదారులకు చేరాలి.. అట్టడుగున ఉన్న వర్గాలకు అందాలి, అంతా పారదర్శకంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దళిత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ సాలర్‌షిప్‌ పొందేందుకు ప్రస్తుతమున్న ఆదాయ సీలింగ్‌లో సడలింపులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

సీఎం చొరవ సంతోషాన్ని కలిగించింది
సీపీఐ, సీపీఎం కార్యదర్శులు చాడ, తమ్మినేని
కులాంతర వివాహాలను ప్రోత్సహించడంతోపాటు, దళితుల మీద దాడులు జరిగితే ఊరుకోబోమనే రీతిలో కార్యాచరణ చేపట్టి, ప్రభుత్వం దళితులకు మరింతగా ధైర్యాన్ని కల్పించాలని అఖిలపక్షంలో పాల్గొన్న కమ్యూనిస్ట్‌ పార్టీల నేతలు సూచించారు.

ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం: తమ్మినేని
దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్‌ తీసుకున్న చొరవ, దృఢ నిశ్చయం సంతోషాన్ని కలిగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మరియమ్మ లాకప్‌డెత్‌ కేసులో సీఎం తక్షణం ఆమె కుటుంబానికి సహాయం చేస్తూ తీసుకున్న నిర్ణయాలు దళిత సమాజంలో ఆత్మస్థయిర్యాన్ని పెంచిందన్నారు. దళిత సాధికారత కోసం, ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు చిత్తశుద్ధితో అమలుపరచాలని కోరారు. ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు.

దళితులకు భరోసా : చాడ వెంకటరెడ్డి
దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్‌ స్వయంగా ముందుకు రావడం, దళిత ఎంపవర్‌మెంట్‌ వంటి ఆలోచన చేయడం సంతోషంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ 2003లోనే దళిత సాధికారత కోసం సమావేశం ఏర్పాటుచేసి, అనేక అంశాలను చర్చించడం తనకు గుర్తున్నదన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న కళ్యాణలక్ష్మి వంటి పలు అభివృధ్ధి సంక్షేమ పథకాలు దళితులకు భరోసానిస్తున్నాయని తెలిపారు.

ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటారు : మోత్కుపల్లి
సీఎం కేసీఆర్‌ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని ఈ సమావేశం నిర్వహించడం ద్వారా సద్వినియోగం చేసుకున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈ సమావేశం దళిత సమాజంలో ఒక మానసిక ఉత్తేజం కలిగించిందని చెప్పారు. దళారులు లేకుండా నేరుగా దళితులకు ఆర్థికసాయం అందిస్తెనే మేలు జరుగుతుందని తెలిపారు. గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత దళిత విద్యార్థులు, కలెక్టరు వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయాలనే ఆకాంక్షలు నెరవేరుతుండటం ఆనందదాయకమన్నారు. ఎస్సీల అభివృద్ధి గురించి ఇంతగా తపించే మీకు భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మోతుపల్లి అన్నారు.

దళిత సమాజానికి ధైర్యాన్నిచ్చారు: సీఎల్పీనేత భట్టి
మరియమ్మ విషయంలో దళిత సమాజానికి సీఎం కేసీఆర్‌ ఒక భరోసాను, ధైర్యాన్ని అందించారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార అన్నారు. దళితుల కోసం తెచ్చిన సీమ్‌లను అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా వుండడం అవసరమన్నారు. ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీచేయాలని కోరారు. దళితులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తే తమ అభివృద్ధిని వారే నిర్ణయించుకోగలుగుతారని చెప్పారు. అసైన్డ్‌ భూములను వెనకు తీసుకోవడంకంటే, భూమి విలువను నిర్ధారించి, కంపెనీల్లో రైతులకు షేర్ల ద్వారా వాటా ఇవ్వాలని సూచించారు.

దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురవడం భారత సమాజానికే కళంకం. ఇది మనసున్న ప్రతి ఒకరినీ కలచివేసే విషయం. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఏ ఊరుకు వెళ్లినా సామాజికంగా, ఆర్థికంగా పీడితవర్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులే. ఇక నుంచి దళితుల బాధలు పోవాలె. ‘మేము కూడా పురోగమించగలం’ అనే ఆత్మసె్థైర్యంతో దళిత సమాజం ముందుకుపోవాలె. దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలగించేందుకు దశలవారీగా కార్యాచరణ అమలుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.
-ముఖ్యమంత్రి కేసీఆర్‌

మరియమ్మ విషయంలో దళిత సమాజానికి సీఎం కేసీఆర్‌ ఒక భరోసాను, ధైర్యాన్ని అందించారు. దళితుల కోసం తెచ్చిన సీమ్‌లను అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా ఉండటం అవసరం.

  • మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

దళితుల అభివృద్ధి కోసం
సీఎం కేసీఆర్‌ తీసుకున్న చొరవ, దృఢ నిశ్చయం సంతోషాన్ని కలిగిస్తున్నది. దళిత సాధికారత కోసం, ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు చిత్తశుద్ధితో అమలుపరచాలి.
-తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్‌ స్వయంగా ముందుకు రావడం సంతోషకరం. కల్యాణలక్ష్మి వంటి పలు అభివృధ్ధి సంక్షేమ పథకాలు దళితులకు భరోసానిస్తున్నాయి.
-చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఈ సమావేశం దళిత సమాజంలో మానసిక ఉత్తేజం నింపింది. సీఎం కేసీఆర్‌ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి పోతారు. ఎస్సీల అభివృద్ధికి ఇంతగా తపించే సీఎంకు భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది.
-మోత్కుపల్లి నర్సింహులు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana