e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home Top Slides బీజేపీలో విషయం లేదు.. నిలువెల్లా విషమే

బీజేపీలో విషయం లేదు.. నిలువెల్లా విషమే

బీజేపీలో విషయం లేదు.. నిలువెల్లా విషమే
  • టీఆర్‌ఎస్‌ను ఇంటి పార్టీగా పిలుచుకుంటున్నరు
  • స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు బలం
  • ఆరేండ్లలో దేశంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు
  • ఇక్కడ యువతను రెచ్చగొడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు
  • కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోనేది లేదు
  • వందతప్పులు దాటితే శిశుపాలుడికి పట్టిన గతే వారికీ..
  • బీజేపీపై నిప్పులు చెరిగిన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

కేసీఆర్‌ వయస్సును, ప్రజలు ఆయనకు ఇచ్చిన సీఎం హోదాను మరిచి కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరు. మాకూ అలాంటి మాటలు రాకకాదు. మేం పదాలు వాడటం మొదలుపెడితే వారికంటే ఎక్కువగా మాట్లాడగలం. నాలుకను ఇంకా బాగా వాడగలం. వందతప్పులు చేశాక శిశుపాలుడికి ఏ గతి పట్టిందో.. మా కార్యకర్తలు వారికి అదే గతి పట్టిస్తారు. తెలంగాణ కోసం ఏమీచేయని సన్నాసులు ఎగిరెగిరి పడితే ఊరుకునేది లేదు. మోదీని, అమిత్‌షాను తిట్టలేక కాదు. మాకు కేసీఆర్‌ సంస్కారం నేర్పించారు. బట్టెబాజ్‌ మాటలు మాట్లాడేవాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. సోషల్‌ మీడియాలో 13, 14 ఏండ్ల పిల్లలతో కేసీఆర్‌పై అసభ్యపు కూతలు, కామెంట్లు, పోస్టింగ్‌లు పెట్టిస్తున్నరు. మతం పేరుతో పిల్లలను రెచ్చగొడుతున్న అరాచకవాదులు బీజేపీ నేతలు. బూతులు మాట్లాడితే చట్టం ప్రకారం కేసులు పెడతాం. తగిన విధంగా బుద్ధి చెప్తాం.

వరంగల్‌లో మీడియాతో కేటీఆర్‌

వరంగల్‌, ఏప్రిల్‌ 12 (వరంగల్‌ ప్రతినిధి): దేశంలో ఆరేండ్లుగా ఒక్క ఉద్యోగమూ ఇవ్వని బీజేపీ.. రాష్ట్రంలో యువతను రెచ్చగొడుతూ మభ్యపెడుతున్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు విమర్శించారు. మతం పేరిట పసి మనసులలో విషం నింపుతున్నారని, సోషల్‌ మీడియాలో 13, 14 ఏండ్ల పిల్లలతో కేసీఆర్‌పై అసభ్యపు కూతలు, కామెంట్లు, పోస్టింగ్‌లు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు మతం పేరుతో పిల్లలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీలో విషయం లేదని, విషం మాత్రమే ఉన్నదని విమర్శించారు. తెలంగాణకు ఏమీచేయని రాష్ట్ర బీజేపీ నేతలు.. రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఇక ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో దాదాపు 12 గంటలపాటు సాగిన పర్యటనలో రూ.2,400 కోట్లతో చేపట్టిన పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్‌.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. వివరాలు కేటీఆర్‌ మాటల్లోనే..

గెలుపు టీఆర్‌ఎస్‌దే

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పంచాయతీ మొదలుకుని అన్ని ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌నే దీవిస్తూ వస్తున్నారు. ఇటీవలి గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అండగానిలిచారు. ఎట్టిపనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలని జయశంకర్‌సార్‌ చెప్పేవారు. స్వీయరాజకీయ అస్తిత్వమే తెలంగాణకు రక్షణ. టీఆర్‌ఎస్‌ అందుకు ప్రతీక. 20 ఏండ్ల క్రితం ఉద్యమపార్టీగా మొదలైన టీఆర్‌ఎస్‌ లక్ష్యాన్ని సాధించి రాజకీయపార్టీగా రెండు పర్యాయాలు ప్రజల దీవెనలు అందుకున్నది.

అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు

ప్రజలు ఇచ్చిన సీఎం హోదాను కూడా మరిచి, కేసీఆర్‌ వయసులో సగం ఉన్నవారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు. మాకు అలాంటి మాటలు రాక కాదు. మేం పదాలు వాడటం మొదలుపెడితే వారికంటే బాగా మాట్లాడతం. నాలుకను ఇంకా బాగా వాడగలం. కొందరు దౌర్భాగ్యులు ఇష్టంవచ్చిన మాటలంటున్నారు. దమ్ముంటే వాళ్లు, వాళ్ల పార్టీ తెలంగాణ ప్రజలకేం చేసిందో చెప్పాలి. విభజన చట్టంలో పేర్కొన్న కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీపై ఏమీ మాట్లాడని సన్నాసులు వాళ్లు. శిశుపాలుడికి వంద తప్పుల తర్వాత ఏం జరిగిందో.. మా కార్యకర్తలు, ప్రజలు అలాగే శిక్షిస్తారు. మేం కూడా మోదీని, అమిత్‌షాను తిట్టలేక కాదు. మీలాగా దిగజారలేం. కేసీఆర్‌ మాకు సంస్కారం నేర్పించారు. బట్టెబాజ్‌ మాటలు మాట్లాడేవాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. దారుణంఏమిటంటే సోషల్‌ మీడియాలో 13, 14 ఏండ్ల పిల్లలతో కేసీఆర్‌పై అసభ్య కూతలు, కామెంట్లు, పోస్టింగ్‌లు పెట్టిస్తున్నారు. బీజేపీ వాళ్లు అరాచకవాదులు. మతం పేరుతో పిల్లలను రెచ్చగొడుతున్నారు. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమం చేపట్టకపోతే, తెలంగాణ సాధించకపోతే.. టీబీజేపీ, టీ కాంగ్రెస్‌ ఉండేవా? ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగిన మీకు కేసీఆర్‌పై మాట్లాడే నైతికత లేదు. మర్యాద తప్పినా, తూలనాడినా సహించేది లేదు.

మోదీదీ చేతకాని తనమేనా?

మన్మోహన్‌సింగ్‌ చేతగానితనం వల్ల గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని 2013లో మోదీ విమర్శించారు. సిలిండర్‌కు ఇంట్లో దండం పెట్టకుని వెళ్లాలని చెప్పారు. మోదీ ప్రధాని ఆయిన 2014లో 400 ఉన్న సిలిండర్‌ ధర ఇప్పుడు వెయ్యికి చేరింది. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగడంతో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగాయి. తాజాగా ఎరువుల ధరలతో రైతులపై భారం పడింది. వీటన్నింటికీ కారణం ఎవరు? ఏమైనా అంటే దేశంకోసం, ధర్మంకోసం అంటారు! జన్‌ధన్‌ ఖాతాలు తెరవండి ధనాధన్‌గా అందులో డబ్బులు వేస్తామని చెప్పారు. ఎవరి ఖాతాలో అయినా పైసలు పడ్డాయా? వీటన్నింటికీ సమాధానం చెప్పకుండా.. బూతులు మాట్లడతారు. బూతులు మాట్లాడితే చట్టం ప్రకారం కేసులు పెడతాం.

గొప్పగా టీఆర్‌ఎస్‌ ప్రస్థానం

టీఆర్‌ఎస్‌ ఆర్భవించి రెండు దశాబ్దాలు కావస్తున్న నేపథ్యంలో దాని ప్రస్థానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాజ్‌పేయి సారథ్యంతో ఎన్డీయే, వందేండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ కేంద్రంలో.. ఉమ్మడి ఏపీలో బలంగా ఉన్న చంద్రబాబు అనే మూడు దిగ్గజాల నడుమ 2001లో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను పెట్టడం సాహసమే. కేసీఆర్‌ అప్పుడు పాపులర్‌ లీడర్‌ కాదు. ఉమ్మడి మెదక్‌ నాయకుడు మాత్రమే. 1971లో జరిగిన అవమానాలు, ఆటంకాల అనుభవాలతో తెలంగాణ ఉద్యమంపై అవిశ్వాసం.. సొంత ప్రయోజనాల కోసమే తెలంగాణవాదం అనే అభిప్రాయం ఉండేది. అలాంటి అన్ని ఆటంకాలను ఛేదిస్తూ కేసీఆర్‌ ప్రాంతీయపార్టీ పెట్టారు. ఎత్తిన జెండా దించనని, మాట తప్పితే రాళ్లతో కొట్టి చంపండంటూ జలదృశ్యం వేదికగా శపథం చేశారు. 14 ఏండ్లు ఎన్నో ప్రతికూల శక్తులతో పోరాడి తెలంగాణ సాధించారు. ఉద్యమ నాయకత్వమే తెలంగాణను పాలిం చాలని 2014లో ప్రజలు 63 సీట్లు ఇచ్చి ఆదరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 88 సీట్లతో గెలిపించారు. ప్రజల మద్దతుతో కేసీఆర్‌ రెండోసారి సీఎం అయ్యారు.

అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం

రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పరిపాలన సాగిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ఆదర్శం నిలిచింది. పేదలకు ఏం అవసరమో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు తెలుసు. తెలంగాణ ఏర్పాటుకు ముందు.. కేసీఆర్‌ సీఎం అయ్యాక అందరూ తేడా చూడాలి. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.75 పింఛన్‌ వచ్చేది. అదీ ఊర్లో 50 మందికి వస్తే 500 మందికి రాకపోతుండే. 2004లో వైఎస్‌ రూ.75 నుంచి రూ.200లకు పెంచిండు. అవి ముసలోళ్ల గోలిమందులకు కూడా చాలకపోతుండే. తెలంగాణ వచ్చినంక కేసీఆర్‌ అయ్యాక పింఛన్లను వికలాంగులకు రూ.3,016, మిగిలిన వాళ్లకు రూ.2,016 పెంచిండు. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో నాయనమ్మ దగ్గరికి పిల్లలు పోయి చాక్లెట్‌కు పైసలు అడిగితే నా దగ్గర ఎక్కడున్నయి బిడ్డ అనేటోళ్లు. ఇప్పుడు బిస్కోట్‌ పొడకు సరిపోయేన్ని పైసలు ఇస్తున్నరు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్తునిస్తున్నం. ఇండ్లులేని పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నం. కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకుపోతున్నాం.

దేశానికే ఆదర్శం తెలంగాణ

కేసీఆర్‌ సీఎం అయ్యాక అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు. తెలంగాణ ఉద్యమ శీర్షికలైన నీళ్లు, నిధులు, నియామకాలను ప్రభుత్వ లక్ష్యాలుగా ఎంచుకుని.. అభివృద్ధి, సంక్షేమంతో పాలన సాగించారు. పాలనతో కొత్త దశను చూపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును వేగంగా పూర్తిచేశారు. మూడున్నరేండ్లలోనే ఇంటింటికీ శుద్ధమైన మంచినీటిని అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామపంచాయతీల పునర్విభజన చేశారు. ఇచ్చినమాట ప్రకారం గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మార్చారు. టీఎస్‌ఐపాస్‌, టీఎస్‌బీపాస్‌ వంటివి తెచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని విధానాలను, పథకాలను నీతి ఆయోగ్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించాయి. ‘ఉద్యమనేతలు లక్ష్యాన్ని సాధించడం చాలామందిని చూశాం. అయితే ఉద్యమనేత పరిపాలనా దక్షుడుగా విజయవంతం కావడం చాలా అరుదు. అలాంటి నాయకుడు కేసీఆర్‌’ అంటూ అరుణ్‌ జైట్లీ చెప్పిన విషయాలు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.

ఐఏఎస్‌ ఉద్యోగాలు భర్తీ చేసేదెవరు?

కాకతీయ వర్సిటీ స్టూడెంట్‌ సునీల్‌నాయక్‌ అలాచేసి ఉండాల్సి కాదు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకోవద్దు. సునీల్‌నాయక్‌ను రెచ్చగొట్టిందెవరు? ‘ఐఏఎస్‌ ఉద్యోగాల భర్తీ విషయంలో’ అని వీడియోలో సునీల్‌నాయక్‌ పేర్కొన్నారు. ఐఏఎస్‌ ఉద్యోగాలు భర్తీ చేసేది కేసీఆర్‌ ప్రభుత్వమా? కేంద్ర ప్రభుత్వమా? ఆ పిల్లగాడిని రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నదెవరు? విషయంలేని.. విషం మాత్రమే ఉన్న పార్టీ బీజేపీ. తెలంగాణ ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీచేసింది. దేశంలోని మిగిలిన రాష్ర్టాల్లో ఆరున్నరేండ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలెన్ని? బీజేపీ రాష్ర్టాల్లో భర్తీ చేసినవెన్ని? దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు చర్చకు రావాలి. గుజరాత్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఐదేండ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ ఉన్నది. తెలంగాణలో ఇది మూడేండ్లు ఉంటే బీజేపోళ్లు గగ్గోలు పెడుతున్నరు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రధాని అయిన మోదీ.. ఏడేండ్లలో ఇచ్చిన 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? ఏపీ ప్రజలు మొత్తకుంటున్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అడ్డగోలు బేరానికి అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఉన్న ఉద్యోగాలనే పోగొడుతున్న బీజేపీకి.. ఇక్కడ ఉద్యోగాల గురించి మాట్లాడే హక్కు ఉన్నదా?

Advertisement
బీజేపీలో విషయం లేదు.. నిలువెల్లా విషమే
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement