e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home Top Slides తౌటే విధ్వంసం

తౌటే విధ్వంసం

  • కుంభవృష్టి.. భీకర గాలులు.. కేరళ, కర్ణాటక, గోవాల్లో భారీ నష్టం
  • వందల సంఖ్యలో దెబ్బతిన్న ఇండ్లు
  • కూలిన విద్యుత్తు స్తంభాలు, చెట్లు
  • గోవాలో నిలిచిన విద్యుత్తు సరఫరా
  • కర్ణాటక, గోవాల్లో ఆరుగురి మృతి
  • అత్యధికంగా నాదాలో 38 సెం.మీ వర్షం
  • కేరళలో ఉవ్వెత్తున ఎగిసిన కెరటాలు
  • రేపు గుజరాత్‌లో తీరం దాటనున్న తౌటే
  • హై అలర్ట్‌.. లక్షన్నర మంది తరలింపు
  • తెలంగాణలో పలు జిల్లాల్లో అకాల వర్షం

అతి తీవ్ర తుఫాన్‌గా మారిన తౌటే.. కేరళ, కర్ణాటక, గోవా రాష్ర్టాల్లో విధ్వంసం సృష్టించింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడగా భీకరమైన గాలులతో కూడిన కుండపోత వర్షాలకు తీర ప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయి. వందల ఇండ్లు దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.

తౌటే విధ్వంసం

బెంగళూరు/ పనాజి/ అహ్మదాబాద్‌, మే 16: అతి తీవ్ర తుఫాన్‌గా మారిన తౌటే తుఫాన్‌… కేరళ, కర్ణాటక, గోవా రాష్ర్టాల్లో విధ్వంసం సృష్టించింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడగా భీకరమైన గాలులతో కూడిన కుండపోత వర్షాలకు తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి పలు ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. కర్ణాటకలో నలుగురు, గోవాలో ఇద్దరు మరణించారు. రానున్న 24 గంటల్లో తౌటే మరింత తీవ్రరూపం దాలుస్తుందని, మంగళవారం ఉదయం గుజరాత్‌లోని పోర్‌బందర్‌, మహువా మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ముందుజాగ్రత్తగా గుజరాత్‌లో తీర ప్రాంత జిల్లాల నుంచి లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తౌక్టేతో మహారాష్ట్రకూ ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది.

నాదాలో 38.5 సెం.మీ. వర్షం నమోదు
కర్ణాటకలోని ఏడు జిల్లాల్లోని 70 గ్రామాలపై తౌటే ప్రభావం తీవ్రంగా ఉంది. దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ, శివమొగ్గ, కొడగు, చిక్కమంగళూరు, హసన్‌ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఉడుపి జిల్లాలోని నాదాలో గరిష్ఠంగా 38.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టికి తోడు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లింది. గోవాలోనూ ఆదివారం ఉదయం నుంచి భీకరమైన గాలులతో భారీ వర్షాలు కురిశాయి.చెట్లు కూలిపడటంతో చాలాచోట్ల 33 కేవీ ఫీడర్లు, మహారాష్ట్ర నుంచి గోవాకు విద్యుత్తు సరఫరా చేస్తున్న 220 కేవీ లైన్లు దెబ్బతిన్నాయి.

తౌటే విధ్వంసం

‘అల’జడి
కేరళలోని ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలను సూచించే ఆరెంజ్‌ అలర్ట్‌ను ఐఎండీ జారీ చేసింది. భారీ అలలతో సముద్రపు నీరు ముందుకు చొచ్చుకురావడంతో పలు తీర గ్రామాల్లో ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇండ్లలో చిక్కుకుపోయిన ప్రజలను తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య నేవీ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. త్రిశూర్‌, తిరువనంతపురం, అలప్పుజ, కొజికోడ్‌ జిల్లాలో కెరటాలు విరుచుకుపడ్డాయి. కేరళలో 9 జిల్లాలపై తౌటే ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు.

కరోనా రోగుల తరలింపు
కరోనాతో విలవిలలాడుతున్న రాష్ర్టాలకు తుఫాన్‌ రూపంలో మరో ఆపద ముంచుకురావడంతో కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలోని జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) ఆదివారం సమావేశమైంది. తౌక్టే ప్రభావిత రాష్ర్టాల్లో కొవిడ్‌ దవాఖానాలను అంతరాయం కలుగకుండా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. వర్చువల్‌గా నిర్వహించిన ఆ సమీక్షలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొవిడ్‌ దవాఖానలు, వ్యాక్సిన్‌ కోల్డ్‌ చైన్‌, ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు.

పిడుగుపడి సూర్యాపేటలో ఇద్దరు మృతి
తౌటే తుఫాను ప్రభావం వల్ల తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో మిరపకాయలు ఏరుతున్న కూలీలపై పిడుగు పడి కారింగుల ఉమ(34), వీరబోయిన భిక్షం(72) మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తౌటే విధ్వంసం

ట్రెండింగ్‌

Advertisement