e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home Top Slides దళిత బంధు 16 నుంచి

దళిత బంధు 16 నుంచి

  • దళిత బంధు కోసం 250 కోట్లు విడుదల
  • లబ్ధిదారులకు ప్రత్యేక కార్డు.. పథకం కోసం ప్రత్యేక చట్టం
  • పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రారంభం
  • ప్రతి జిల్లాలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ప్రైజ్‌
  • గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు
  • దళితవాడల్లో మౌలిక సదుపాయాల కల్పన

హైదరాబాద్‌, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి అమలుచేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. దళితులను పెట్టుబడిదారులుగా అభివృద్ధిచేయడం కోసం ప్రతి జిల్లాలో ‘సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ప్రైజ్‌’ ఏర్పాటుచేయాలని తీర్మానించింది. ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆరు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజాసంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. దళిత బంధు అమలుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిన వెంటనే షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ ఈ పథకం కోసం రూ.250 కోట్లను విడుదలచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా కారణంగా తల్లిదండ్రులు చనిపోయి ఆనాథలైన పిల్లలను పూర్తిస్థాయిలో సంరక్షించుకోవాలనే అంశంతో మంత్రివర్గ సమావేశం మొదలైంది. తర్వాత రైతులకు రూ.50 వేల రుణమాఫీ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్‌ఉన్న నేపథ్యంలో పత్తి పంట సాగును మరింత పెంచాలని తీర్మానించింది. వృద్ధాప్య పెన్షన్‌ వయోపరిమితిని 57 ఏండ్లకు కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరాను వారంలోగా సంపూర్ణంగా అమలుచేయాలని అధికారులను క్యాబినెట్‌ ఆదేశించింది.

16 నుంచి దళితబంధు అమలు
ఆగస్టు 16 నుండి దళితబంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నుంచి ప్రారంభించాలని క్యాబినెట్‌ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించింది. పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై విసృ్తతంగా చర్చించింది. పథకం పూర్వాపరాలను సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ సహచరులకు విశదీకరించారు. రాష్ట్రంలోని ఆన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -

దళితబంధు భద్రతకు ప్రత్యేక చట్టం
దళిత జాతిలోని పేదరికాన్ని రూపుమాపాలని ప్రవేశ పెడుతున్న తెలంగాణ దళితబంధు పథకానికి రాష్ట్ర క్యాబినెట్‌ ముక్త కంఠంతో ఆమోదముద్ర వేసింది. దళితజాతి కష్టాలు తీర్చడానికి ప్రవేశపెడుతున్న ఈ పథకం అమలుకు మంత్రివర్గ సభ్యులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. దళితబంధు పథకానికి చట్టభద్రత కల్పిస్తూ ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని క్యాబినెట్‌ అభిప్రాయపడింది. గతంలో ఎస్సీ ప్రగతి నిధి చట్టం తెచ్చి, ఒక బడ్జెట్‌లో దళితులకు కేటాయించిన నిధులలో మిగిలిన నిధులను తర్వాతి బడ్జెట్‌కు బదలాయించే విధానం తీసుకొచ్చామని, ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అదేవిధంగా దళితబంధు కూడా దేశానికి దారి చూపే పథకం అవుతుందని క్యాబినెట్‌ అభిప్రాయపడింది.

గిరిజనులకన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు
రెకలకష్టం తప్ప మరే ఆస్తి లేని దీనస్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో 20% జనాభా కలిగిన దళితుల చేతుల్లో ఉన్న సాగుభూమి కేవలం 13 లక్షల ఎకరాలేనని, దళితుల పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని.. సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులున్నారని పేరొన్నారు. దళితుల అభివృద్ధి, అరకొర సహాయాలతో సాధ్యం కాదని, అందుకే దళితబంధులో ఒక యూనిట్‌ పెట్టుకోవడానికి పదిలక్షల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆర్థికస్థితిలో మెరుగుదల రాదని సీఎం తెలియజేశారు. లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెద్ద పెట్టుబడితో పెద్ద యూనిట్‌ పెట్టుకునే అవకాశాన్ని ఈ పథకం ద్వారా కల్పించాలనే సీఎం నిర్ణయానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ లబ్ధిదారులదేనని, ప్రభుత్వం అధికారులు, దళితబంధు స్వచ్ఛంద కార్యకర్తలూ ఈ దిశగా మార్గదర్శనం చేస్తారని, అవగాహన కల్పిస్తారని సీఎం అన్నారు.

లబ్ధిదారుడు ఎంచుకొన్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ అవసరమైన శిక్షణతోపాటు, అవగాహన కల్పించాలని క్యాబినెట్‌ అభిప్రాయపడ్డది. శిక్షణ, పర్యవేక్షణకోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమలులో జిల్లా కలెక్టర్‌, జిల్లా మంత్రి కీలకపాత్ర పోషిస్తారని సీఎం కేసీఆర్‌ అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతిజిల్లాలో ‘సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ప్రైజ్‌’ ఏర్పాటు చేయాలని చెప్పారు. యూనిట్‌ పెట్టగానే ప్రభుత్వ బాధ్యత తీరిపోదని, అది సరిగ్గా నడుస్తున్నదా లేదా అనేది నిరంతరం పర్యవేక్షించడం కూడా ముఖ్యమని క్యాబినెట్‌ పేర్కొన్నది. దళితబంధు అమలుకు పటిష్ఠమైన యంత్రాంగం అవసరమని, వివిధ శాఖలలో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావును క్యాబినెట్‌ ఆదేశించింది. దళితబంధు లబ్ధిదారులకు అందజేసే ప్రత్యేక కార్డు నమూనాలను క్యాబినెట్‌ పరిశీలించింది. ఈ కార్డును ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసి లబ్ధిదారుని పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. దళితవాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా అన్ని హంగులూ దళితవాడలకు ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana