e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home Top Slides దొంగ అనక? దొర అనాలా?

దొంగ అనక? దొర అనాలా?

  • తెలంగాణ నీటిని దోచుకుపోయినవైఎస్‌
  • ఆయన తెలంగాణకు నరరూప రాక్షసుడే
  • పీ జనార్దన్‌రెడ్డి చావుకు కారణం ఆయనే
  • నవ్వుతూనే తెలంగాణకు అన్యాయం చేశారు
  • నిప్పులు చెరిగిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నీటిని దోచుకెళ్లిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని దొంగ అనక దొర అనాలా అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. తండ్రి తరహాలోనే నీటిని దోపిడీ చేస్తున్న వైఎస్‌జగన్‌ను గజదొంగ అనక ఇంకేం అంటారో చెప్పాలని అన్నారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పీజేఆర్‌ (పీ జనార్దన్‌రెడ్డి) చావుకు కారణం వైఎస్‌ఆరేనని, నీళ్ల దోపిడీ చేసింది.. భూములు తీసుకుపోయింది ఆయనేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం గురజాడ కాన్ఫరెన్స్‌ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్‌ఆర్‌ బతికుంటే తెలంగాణ రానియ్యకుండె. వంద మందినైనా ఖతం చేస్తుండె కానీ రానియ్యకుండె. గుండె మీద చేయి వేసుకొని ఈ మాటలు మీ ఆంధ్రా ప్రాంత నాయకులు అంటున్నరా లేదా ఒక్కసారి అడగండి. తెలంగాణను బాగుపర్చుకుందామని సయోధ్యతో ఉందామని అంటే మీరు నోట్లో చెక్కర.. కడుపులో కత్తెర అన్నట్టు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రవాళ్లు మాకు దుష్మన్‌ కాదు. అన్నదమ్ముల్లాగానే భావిస్తాం. కానీ మీరు కూడా ఇలాంటి అక్రమాలను ప్రశ్నించాలి’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలంగాణలో ఉంటున్న ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మహబూబ్‌నగర్‌ను ఎండబెడతామంటే ఊరుకోం..
‘వైఎస్‌ఆర్‌ ఒకటి చేస్తే జగన్‌ రెండు చేసిండు. ఆయన 10వేల క్యూసెక్కులని చెప్పి 40వేలు తీసుకుపోతే జగన్‌ దాన్ని 80వేల క్యూసెక్కులు చేశారు. కృష్ణా బేసిన్‌ పరీవాహక ప్రాంతం కానటువంటి నెల్లూరుకు నీటిని తీసుకుపోవడం ఎక్కడి న్యాయం? ఇవాళ మళ్లీ మా మహబూబ్‌నగర్‌ జిల్లాను ఎండబెడుతాం అంటే ఎట్లా ఊరుకుంటాం?’ అని శ్రీనివాస్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

- Advertisement -

బీజేపీ, కాంగ్రెస్‌ మీ పని మీరు సక్కగ చేయండి
‘పక్క రాష్ట్రంలో ఏమైనా నీళ్ల గొడువస్తే అక్కడున్న అన్ని పార్టీలు ఏకమైతయ్‌. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మీ అధికారాన్ని ఉపయోగించి అది అక్రమ ప్రాజెక్టు, ఇప్పటికే గ్రీన్‌ ట్రిబ్యునల్‌ స్టే ఇచ్చింది, దాన్ని ఆపాలని ఒత్తిడి చేయండి. జాతీయ పార్టీగా కాంగ్రెస్‌ కేంద్రంపై ఒత్తిడి తేవాలి’ అని శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు.

మాది గౌరవించే సంస్కృతి
‘తెలంగాణలో ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఉన్నాయి. మరి మా చాకలి ఐయిలమ్మది, కొమరం భీమ్‌ లాంటి పోరాట వీరులవి ఆంధ్రాలో ఉండాలి కదా. ఆంధ్రా ప్రాంతానికి చెందిన చాలామంది తెలంగాణను నాశనం చేసి, దివాళా తీయించినోళ్లే.. వారి విగ్రహాలు చూసి తెలంగాణలో గుండెలు మసిమసి అయిపోతున్నయ్‌. కానీ విద్వేషాలు రెచ్చిపోతయని ఓపిక, సహనంతో ఉన్నాం’ అని మంత్రి పేర్కొన్నారు.

మేం మనసులో పెట్టుకున్నాం.
‘మాకు జరిగిన అవమానాలను మేం మనుసులో పెట్టుకున్నం. మొన్నటికి మొన్న కరోనా టైంలో ఆక్సిజన్‌ కోసం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు పోతే బంద్‌ చేసిండ్రు. తిరుపతిలో ఒకాయన తెలంగాణ మంత్రులను పేరుపెట్టి మాట్లాడుతడు. మా కాగితాలు తీసి ఇసిరేస్తడు. ఏ ప్రాంతం నుంచి వచ్చినవారికైనా హైదరాబాద్‌లో ఎంత గౌరవం, ఎంత సత్కారం లభిస్తుంది. అది తెలంగాణ సంస్కృతి’ అని శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. సీపీఐ నాయకుడు నారాయణ ఒక పెద్ద మనిషిగా నీటి పంపకాలపై తమ వైఖరిని వెల్లడించాలని కోరారు.

ప్రథమ చికిత్స చేసి ఉంటే పీజేఆర్‌ బతికేవారు
‘ఆనాడు పీ జనార్దన్‌రెడ్డి పోతిరెడ్డిపాడు మీద కొట్లాడితే ఏం జరిగింది. ఎన్ని అవమానాలు పెట్టారు. ఇదే వైఎస్‌ఆర్‌ సభకు పోయి ఆయనను స్టేజీ మీదకు పిలవకపోతే ఆవేదనతో అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోలేదా. పక్కనే సీఎంకు అంబులెన్స్‌ ఉంటది. కనీసం వచ్చి ప్రథమ చికిత్స చేసిందా. గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. పీజేఆర్‌ చావుకు వైఎస్‌ఆర్‌ కారకులు కాదా’ అని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

తెలంగాణ అన్నోళ్లను చంపిండు
‘తెలంగాణ అన్నోళ్లను నక్సలైట్ల పేరు మీద వైఎస్‌ఆర్‌ ఎంతమందిని చంపిండో మాకు తెలియదా. తెలంగాణలో ఉన్న భూములు ఎన్ని దోచుకుపోయారో మాకు తెలియదా. ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, తట్టెడు మన్ను తీయకుండా మొబలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద ఎన్ని వేల కోట్లు ఎత్తుకుపోయారు. తెలంగాణకు ఏం చేశారు వైఎస్‌ఆర్‌. తెలంగాణలో ఒక సామెత ఉంది. నవ్వుకుంట నవ్వుకుంటనే పిసుకుతడురా అని. దొంగ కాదు తెలంగాణ ప్రజలకు నరరూప రాక్షసుడు వైఎస్‌ఆర్‌. ఇంతమంది చావులకు కారకుడు ఆయనే. తెలంగాణ వెనుకబాటుతనానికి కారణం ఆయనే. తెలంగాణ గడ్డ మీద ఉన్నది పౌరుషం గల బిడ్డలు. వాళ్లు ఆస్తిత్వం, ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి అనుకుంటున్నరు. మీ నాటకాలు ఈ గడ్డ మీద సాగనివ్వరు’ అంటూ శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana