ఆదివారం 31 మే 2020
Telangana - May 22, 2020 , 08:33:31

ఆమెకు 40..ప్రియుడికి 26..మాయమాటలతో ట్రాప్ చేశాడు

ఆమెకు 40..ప్రియుడికి 26..మాయమాటలతో ట్రాప్ చేశాడు

హైదరాబాద్  : ఆమెకు 40... ప్రియుడికి 26.. 14 సంవత్సరాల తేడానే సిక్కిం రాష్ర్టానికి చెందిన సంపన్న మహిళ హత్యకు.. చేవెళ్ల తంగిడిపల్లి బ్రిడ్జి వేదికగా మారింది. మార్చి 17న గుర్తుతెలియని మహిళ దారుణ హత్య వెలుగులోకి వచ్చిన ఘటనలో.. పలు ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసు మిస్టరీని ఛేదించిన సైబరాబాద్‌ పోలీసులు.. హత్య చేసిన ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన వ్యక్తిని గుర్తించారు. అయితే సహకరించిన వ్యక్తి ని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. ప్రధాన నిందితుడి అరెస్ట్‌కు కరోనా అడ్డు తగిలింది. ప్రధాన నిందితుడు ముంబైలో ఉండడంతో..అక్కడ కరోనా తీవ్రతతో అరెస్ట్‌ ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు.  

ట్రాప్‌ చేసింది ఇలా...

సిక్కిం రాష్ర్టానికి చెందిన పాసీ శెర్పా(40) సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌. ఆమెకు ముంబైకి చెందిన ఓ 26 ఏండ్ల యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. అలా ఫేస్‌బుక్‌ చాటింగ్‌ స్నేహంగా మారింది. ఈ స్నేహం ముసుగులో యువకుడు ఆమె అందాన్ని పొగిడాడు. దీంతో ఆమె... తన బాధలు చెప్పుకున్నది. దీన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు.. మాయ మాటలతో ఆమెను ట్రాప్‌ చేశాడు. అతని వలలోకి రాగానే.. ఆమెను రెండు సార్లు ముంబైకి పిలిపించుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకుని మాయ చేశాడు. అతని మోజులో పడ్డ శెర్పా... భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి యువకుడిని పెండ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యింది. అయితే.. పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని యువకుడు.. నీకు నాకు మధ్య చాలా వయస్సు తేడా ఉంది... నేను మరో పెండ్లి చేసుకుంటాను.. అని చెప్పాడు. అయినా శెర్పా.. తననే పెండ్లి చే సుకోమని వెంట పడింది. దీంతో శెర్పాను వదిలించుకునేందుకు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకుని.. అందుకు స్కెచ్‌ వేశాడు. దీని కోసం హైదరాబాద్‌లోని తన స్నేహితుడిని పావుగా వాడుకున్నాడు.

హైదరాబాద్‌కు లింక్‌ ...?

ముంబైలో పరిచయం అయిన హైదరాబాద్‌ గచ్చిబౌలి హాస్టల్‌లో నివాసం ఉంటున్న అక్తర్‌ బారీకి.. సదరు యు వకుడు ఫోన్‌ చేసి.. తన గర్ల్‌ ఫ్రెండ్‌తో నగరానికి వస్తున్నానని..  కారు ఏర్పాటు చేయమని కోరాడు. మార్చి 16న ఆ యువకుడు ప్రియురాలితో కలిసి నగరంలోని విమానాశ్రయానికి రాగా.. అక్తర్‌ బారీ అద్దె కారును తీసుకొచ్చి వారిని రిసీవ్‌ చేసుకున్నాడు. అక్కడి నుంచి వికారాబాద్‌ వరకు వెళ్లిన వారు.. అక్తర్‌ బారీని దించేసి... మేము వికారాబాద్‌ రీసార్ట్‌లో గది తీసుకున్నాం.. నీవు హాస్టల్‌కు వెళ్లు.. రాత్రికి తిరిగి వస్తాం అని చెప్పాడు. కాగా.. తన పథకంలో భాగంగా సదరు యువకుడు కారులోనే ప్రియురాలిని గొంతు నులిమి చంపి ... కిందపడేసి.. ఎవరూ గుర్తు పట్టకుం డా దుస్తులు తీసేసి.. రాళ్లతో ముఖాన్ని ఛిద్రం చేసి వెళ్లిపోయాడని సమాచారం. 

అక్కడినుంచి  మార్చి 17న తెల్లవారు జామున యువకుడు వచ్చి కారును అక్తర్‌ బారీకి అప్పజెప్పి.. తిరిగి విమానంలో శంషాబాద్‌ నుంచి ముంబైకి వెళ్లిపోయాడు. మార్చి 17న ఉదయం చేవెళ్ల తంగిడిపల్లి బ్రిడ్జి వద్ద  గుర్తు తెలియన మహిళ మృతదేహం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి కేసును ఛేదించారు.

ఇలా వెలుగులోకి...

దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలతో పాటు స్థానిక పౌరులు ఇచ్చిన సమాచారంతో కొంత క్లూ రాబట్టారు.. ఆ తర్వాత మృతదేహాన్ని పడేసిన వద్ద ఆగిన కారును గుర్తించా రు. దాని ఆధారంగా ముంబై యువకుడికి సహకరించిన అక్తర్‌ బారీ బయటపడ్డాడు. అతన్ని అరెస్ట్‌చేసి.. విచారించడంతో ముంబై యువకుడి గురించి చెప్పాడు. సోషల్‌ మీడియా.. విమానాశ్రయం సీసీ కెమెరాలను జల్లెడ పడితే.. మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైలో ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు కరోనా అడ్డురావడంతో అరెస్ట్‌ను తా త్కాలికంగా విరమించుకున్నారు. కరోనా తగ్గుముఖం పడితే ప్రధాన నిందితుడిని పట్ట్టుకొస్తామని పోలీసులు స్పష్టం చేశారు.


logo