శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 00:38:00

యువతకు వైరస్‌ వల

యువతకు వైరస్‌ వల

  • కరోనా ప్రభావం వారిలోనే అధికం
  • కోలుకున్నవారిలోనూ యువతే ఎక్కువ
  • వైరస్‌ వ్యాప్తిపై ప్రభుత్వం అంచనాలు
  • కట్టడికోసం ప్రత్యేక విధానాలు అమలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యువతపై కరో నా వల విసురుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నవారిలో యువతరమే ఎక్కువగా ఉంటున్నది. 20 నుంచి 39 ఏండ్లలోపువారు కరోనా బారిన పడినప్పటికీ వేగంగా కోలుకొంటున్నట్టు వైద్యశాఖ గుర్తించింది. ఇతర వయసులవారి కన్నా యువత బయట తిరిగే అవకాశం ఎక్కువగా ఉన్నదని, ఈ కారణంగానే వారికి వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నది. వైరస్‌ వ్యాప్తి.. కట్టడికి అనుసరించాల్సిన ప్రత్యేక విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకువయసులవారీగా వైరస్‌ సోకుతున్నవారు, వేగంగా కోలుకొంటున్నవారు, తీవ్ర ప్రభావంతో మరణించినవారి వివరాలపై వైద్యశాఖ రూపొందించిన అంచనాల్లో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా కరోనా నియంత్రణకు అనువైన విధానాలు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్యశాఖ కసరత్తు మొదలుపెట్టింది.

భయపెడుతున్న వైరస్‌ వ్యాప్తి

రాష్ట్రంలో మొదటి 55 రోజుల్లో వెయ్యి మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత 30 రోజుల్లో ఆ సంఖ్య 2 వేలకు చేరుకున్నది. అనంతరం 8 రోజుల్లోనే మరో వెయ్యి కేసులు పెరిగాయి. ఇలా వైరస్‌ వ్యాప్తి అందరినీ భయపెడుతూనే ఉన్నది. జూన్‌ 30వ తేదీలోపు పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,419కి చేరే అవకాశం ఉన్నట్టు అంచనా. రోజువారీగా పరీక్షలు చేయించుకున్నవారిలో సరాసరి 19 శాతం మందికి పాజిటివ్‌గా నమోదవుతున్నది. ఈ నెల 2 వరకు రాష్ట్రంలో 2,891 మందికి కరోనా నిర్ధారణ కాగా.. ఇందులో 20- 39 ఏండ్ల వయసువారు 1,370 (42 శాతం) మంది ఉన్నారు. పాజిటివ్‌గా నమోదైనవారిలో 60 ఏండ్లు పైబడినవారు 8 శాతం మందే ఉన్నారు. వృద్ధులు బయట తిరిగే అవకాశం తక్కువ కాబట్టి వారికి వైరస్‌ సోకే ప్రమాదం తక్కువని వైద్యశాఖ గుర్తించింది.

కోలుకున్నవారిలో..

కరోనా బారిన పడి చికిత్స ద్వారా వేగంగా కోలుకొన్నవారిలోనూ యువతే అధికంగా ఉన్నారు. డిశ్చార్జి అయిన 1,526 మందిలో 20- 39 ఏండ్ల వయసువారు 49 శాతం ఉండగా, 60 ఏండ్లు పైబడినవారు 38శాతం ఉన్నారు.

మరణాల్లో వృద్ధులే అధికం

వైరస్‌తో చనిపోయినవారిలో వృద్ధులే అధికంగా ఉన్నారు. వయసు ప్రభావం, ఇతర అనారోగ్య కారణాల వల్లే మరణిస్తున్నారు. కరోనా మరణాల్లో 60 ఏండ్లు పైబడినవారు 40 శాతం, 40- 59 ఏండ్లవారు 13 శాతం, ఇతరులు 6 శాతం ఉన్నారు.

వయసులవారీగా కేసులు, రికవరీ, మరణాలు

వయసు
పాజిటివ్‌
రికవరీ
మరణాలు
20 ఏండ్లలోపువారు
540
340
5
20- 39 ఏండ్లవారు
1,370
663
7
40- 59 ఏండ్లవారు
683
409
43
60 ఏండ్లుపైబడి
298
114
37
మొత్తం
2,891
1,526
92


logo