శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 01:33:11

ఈ-చెత్తకు మీరే బాధ్యులు

ఈ-చెత్తకు మీరే బాధ్యులు

  • ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను అదుపు చేయాల్సింది వినియోగదారులే : పీసీబీ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను అదుపుచేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. పెద్దమొత్తంలో ఎలక్ట్రానిక్‌ పరికరాలు వాడుతున్న వారిని బల్క్‌ కన్జ్యూమర్ల క్యాటగిరీలో చేర్చి.. వ్యర్థాల బాధ్యతను వారిపైనే పెట్టనున్నది. ఆయా సంస్థల నుంచి వార్షిక రిటర్న్‌లను సేకరించాలని యోచిస్తున్నది. కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో టన్నులకొద్దీ ఈ-వ్యర్థాలు పోగవుతున్నాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఏడాదికి 25 వేల మెట్రిక్‌ టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు బయటపడుతున్నాయి. అత్యధికంగా ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను ఉత్పత్తిచేస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ ఆరో స్థానంలో ఉన్నది. ప్రతీఏటా 25 శాతం అదనంగా వ్యర్థాలు పోగవుతున్నాయి. వీటిని సురక్షితంగా సేకరించకపోవడం, నిర్వహణ కేంద్రాలకు తరలించకపోవడంతో పెద్ద ఎత్తున కాలుష్యం వెలువుడుతున్నది. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను ధ్వంసం చేయడం, కాల్చివేయడం కారణంగా పలు రసాయన విషవాయువులు గాలిలో కలుస్తున్నాయి. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు పీసీబీ తాజాగా వార్షిక రిటర్న్‌లను అస్త్రంగా విసిరింది. ఆయాసంస్థల్లో ఎన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువులు వాడుతున్నారు? ఎన్నిపాడయ్యాయి? వాటిని      రీసైకిల్‌ ప్లాంట్లకు చేర్చి, సురక్షితంగా డిస్పోజ్‌ చేశారా? అనే వివరాలను వార్షిక రిటర్న్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ రిటర్న్‌ల ఆధారంగా ఏవైనా ఉల్లంఘనలకు పాల్పడినా.. పర్యావరణానికి నష్టం కలిగించినా ఆయా సంస్థలపై చర్యలు        తీసుకోనున్నారు.

బల్క్‌ కన్జ్యూమర్లు అంటే: 

రూ.కోటి టర్నోటర్‌ మించిన, 20 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలు, సంస్థలన్నింటినీ బల్క్‌ కన్జ్యూమర్లు క్యాటగిరీలోకి వస్తారు.

వార్షిక రిటర్న్‌లు సమర్పించాల్సినవాళ్లు: 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలు, బ్యాంక్‌లు, విద్యాసంస్థలు, జాతీయ,అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నడుస్తున్న సంస్థలు, హెల్త్‌కేర్‌ ఫెసిలిటీలు, ఫ్యాక్టరీల చట్టం ప్రకారం రిజిస్టర్డ్‌ అయిన కంపెనీలు.