ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 01:27:00

బంగ్లాదేశ్‌కు పసుపు రైలు

బంగ్లాదేశ్‌కు పసుపు రైలు

  • నిజామాబాద్‌ నుంచి తొలిసారి గూడ్స్‌ ద్వారా..
  • 42 బోగీల్లో 2,474 టన్నుల పసుపు ఎగుమతి
  • ఫలించిన దక్షిణమధ్య రైల్వే అధికారుల కృషి 

హైదరాబాద్‌/ నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తొలిసారి పసుపు పట్టాలెక్కింది. ఆదివారం నిజామాబాద్‌ నుంచి ప్రత్యేక గూడ్స్‌ రైలులో బంగ్లాదేశ్‌కు బయలుదేరింది. 42 బోగీల్లో 2,474 టన్నుల పసుపు ఎగమతయింది. నిజామాబాద్‌ కేంద్రంతోపాటు చుట్టపక్కల గ్రామాలు పసుపు సాగుకు ప్రసిద్ధి. ఇప్పటివరకు నిజామాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారానే బంగ్లాదేశ్‌కు పసుపు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. రోడ్డుమార్గంలో బంగ్లాదేశ్‌కు పసుపు తరలించడమనేది భారీ ఖర్చుతో కూడుకున్నది. ఎక్కువ సమయం కూడా తీసుకుంటున్నది. దీన్ని గమనించిన దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పసుపు రైతులతో చర్చలు జరిపారు. 

రైలుమార్గం ద్వారా పసుపును సరఫరా చేస్తే కలిగే ప్రయోజనాలను వారికి వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైల్వే కల్పిస్తున్న రాయితీలపై అవగాహన కల్పించారు. రైలు ద్వారా ఎగుమతితో ఖర్చు తగ్గడంతోపాటు వేగంగా, భద్రంగా వినియోగదారులకు చేర్చవచ్చని వివరించారు. దీంతో రైలుద్వారా పసుపు రవాణాకు రైతులు సమ్మతి తెలిపారు. అందులోభాగంగా నిజామాబాద్‌ నుంచి బంగ్లాదేశ్‌లోని బీన్‌పోల్‌కు తొలిసారిగా 42 బోగీల్లో 2,474 టన్నుల పసుపుతో గూడ్స్‌ రైలు ఆదివారం బయలుదేరిందని దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు ద్వారా పసుపు రవాణా కోసం రైతులు, వ్యాపారులను ఒప్పించేందుకు ప్రత్యేక చొరవ చూపిన హైదరాబాద్‌ డివిజన్‌ అధికారులను దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా ప్రత్యేకంగా అభినందించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైల్వే అందిస్తున్న రాయితీలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు.


logo