బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 10:16:30

పసుపు రైతుల పోరుబాట

పసుపు రైతుల పోరుబాట
  • మెట్‌పల్లిలో బైఠాయింపు
  • నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ రాజీనామాకు డిమాండ్‌

మెట్‌పల్లి, నమస్తేతెలంగాణ/మెట్‌పల్లి టౌన్‌: పసుపు రైతులు పోరుబాట పట్టారు. పసుపుబోర్డు ఏర్పాటు చేయాల్సిందేనంటూ ముక్తకంఠంతో నినదించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చి.. విస్మరించిన నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, కోరుట్ల మండలాలకు చెందిన పసుపు రైతులు సోమవారం పెద్ద ఎత్తున మెట్‌పల్లికి తరలివచ్చి ఆందోళనకు దిగారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు నుంచి ర్యాలీగా బయలుదేరి జాతీయ రహదారి మీదుగా పాత బస్టాండ్‌కు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించారు. స్పైస్‌ ఎక్స్‌టెన్షన్‌ బోర్డు పేరుతో రైతులను అర్వింద్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం పసుపుక్వింటాల్‌కు రూ.5వేలు మాత్రమే ధర పలుకుతున్నదని.. పెట్టుబడి రాక అప్పుల పాలు కావాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు

పసుపు క్వింటాల్‌కు రూ.15వేలు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. పసుపు పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని, పసుపు నిల్వలకోసం కోల్డ్‌స్టోరేజీలు ఏర్పాటుచేయాలన్నారు. రైతుల నిరసనతో పాతబస్టాండ్‌ వద్ద సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీస్‌ అధికారులు జోక్యం చేసుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. కలెక్టర్‌ స్వయం గా వచ్చి హామీ ఇస్తేనే ఆందోళనను విరమిస్తామని రైతులు తేల్చిచెప్పారు. చివరకు సబ్‌కలెక్టర్‌ కార్యాలయ డీఏవో అక్కడికి వచ్చి.. రైతుల నుంచి వినతిపత్రం స్వీకరించడంతో ఆందోళన విరమించారు.


logo