శనివారం 29 ఫిబ్రవరి 2020
గోదారి పరవళ్లు

గోదారి పరవళ్లు

Feb 14, 2020 , 02:03:56
PRINT
గోదారి పరవళ్లు
  • కొనసాగుతున్న ఎత్తిపోతలు
  • ఎల్లంపల్లి నుంచి మానేరు దిశగా ఉరకలు

కరీంనగర్‌ ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ: కాళేశ్వరం లింక్‌-2లో గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి కరీంనగర్‌ జిల్లాలోని ఎల్‌ఎండీ వరకు గోదావరి  పరుగులు తీస్తున్నది. ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంప్‌హౌస్‌లో ఈ నెల 10వ తేదీ నుంచి దఫదఫాలుగా మోటర్లను నడిపిస్తూ నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు.. గురువారం రాత్రి 8 గంటలకు మళ్లీ మోటర్లు ప్రారంభించారు. ముందుగా 7వ మోటర్‌, ఆ తర్వాత 3, 4వ మోటర్లను ఆన్‌చేయగా.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో 2, 5, 6వ మోటర్లను నడిపించారు. మొత్తం ఆరు పంపుల ద్వారా 18,900 క్యూసెక్కుల నీటిని కాళేశ్వరం ఏడో ప్యాకేజీలోని నంది రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. 


ఇక్కడి నుంచి నిమిదో ప్యాకేజీ రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్‌ సర్జ్‌పూల్‌కు చేరుతున్నాయి. ఇక్కడ కూడా సోమవారం రాత్రి 9 గంటల నుంచి బాహుబలి మోటర్లు ఎత్తిపోస్తున్నాయి. రోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకు ఐదు పంపులు నడుస్తున్నాయి. గురువారం మాత్రం ఒకేసారి 1, 2, 3, 4, 6, 7వ పంపులను నడిపించారు. ఇవి ఎత్తిపోసిన సుమారు 19 వేల క్యూసెక్కుల జలాలు గ్రావిటీ కాల్వ మీదుగా వరద కాల్వకు చేరుకొని, శ్రీ రాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయానికి పరుగులు తీస్తున్నాయి. ఈ జలాశయానికి 5 టీఎంసీలు ఎత్తిపోయనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఎత్తిపోతల ప్రక్రియను ప్రాజెక్ట్‌ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, 6,7,8వ ప్యాకేజీల ఈఈ నూనె శ్రీధర్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 


4 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్‌ఎండీకి గురువారం నాలుగు వేల క్యూసెక్కుల నీటిని పంపించారు. ఎస్సారార్‌ జలాశయం లో 24.472 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.   లక్ష్మీపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి వచ్చిన నీటిని యథావిధిగా దిగువకు వదలుతున్నట్టు ఈఈ అశోక్‌ కుమార్‌ తెలిపారు. గురువారం ఎస్సారార్‌ జలాశయం నుంచి దిగువకు రివర్స్‌ స్లూయిస్‌ (4 తూముల) ద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని పంపినట్టు ఆయన పేర్కొన్నారు.


ఎల్‌ఎండీలో పెరుగుతున్న నీటిమట్టం

ఎస్సారార్‌ రిజర్వాయర్‌ నుంచి వస్తున్న నీటితో తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి 5,754 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంగా వస్తుండగా, అంతే మొత్తంలో అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 8.436 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.logo