శనివారం 30 మే 2020
Telangana - Mar 30, 2020 , 00:28:42

రైతులూ.. పంట కోతల్లో జాగ్రత్త

రైతులూ.. పంట కోతల్లో జాగ్రత్త

  • పీజేటీఎస్‌ఏయూ పరిశోధన సంచాలకుడు జగదీశ్వర్‌ సూచనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగి పంటల కోతలు సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ ఆర్‌ జగదీశ్వర్‌ సూచించారు. వరి, కంది, మక్కజొన్న పంటల్లో కోత అనంతరం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రైతులకు లాభం చేకూరుతుందని చెప్పారు. ఈ యాసంగిలో వరిపంట విస్తీర్ణం సాధారణం కంటే రెండింతలకుపైగా సుమారు 37 లక్షల ఎకరాల్లో సాగైందని తెలిపారు. ప్రస్తుతం వరిపంట గింజ గట్టిపడే దశలో ఉన్నట్టు చెప్పారు. వివిధ జిల్లాల్లో మెడ విరుపు విస్తృతంగా వ్యాపించడం, తెల్లకంకి వల్ల అధిక నష్టం జరిగే ప్రమాదం ఉన్నదన్నారు. వరికి మద్దతు ధర రావాలంటే పంట కోత సమయంలో మెలకువలు పాటించాలన్నారు. డాక్టర్‌ ఆర్‌ జగదీశ్వర్‌ మరిన్ని సూచనలు ఇలా..

గింజలు బాగా ఎండిన తరువాతే కోతలు

  • పంటమీదనే గింజలు బాగా ఎండిన తర్వాత కోతలు చేపట్టాలి. అప్పుడే తేమశాతం తగ్గి మంచి ధర లభిస్తుంది. పంట కోత సమయంలో వర్షాలు పడి గింజ తడిసి మొలకెత్తకుండా ఉండేందుకు లీటరు నీటికి 5 గ్రాముల ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. 
  • కంది నూర్పిడి చేసే సమయంలో 13-14 శాతం తేమ ఉంటుంది. దీర్ఘకాలిక నిల్వకు 9-10 శాతం ఉండేలా చూసుకోవాలి. నిల్వచేసే గోనె సంచులకు కొంతమేర వేప ద్రావణం పిచికారీ చేసుకోవాలి లేదా సంచులను కొంతవరకు వేప కషాయంలో ముంచి ఆరబెట్టి వాడుకోవాలి.
  • మక్కజొన్నను యంత్రం ద్వారా నూ ర్పిడి చేసేటప్పుడు కండెలో తేమ 25 శాతం కన్నా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. తేమ 12 శాతం వచ్చేవరకు ఎండలో ఆరబెట్టాలి. శుభ్రపరిచి నిల్వ చేసుకోవాలి. ఇందుకోసం వీలైనంత వరకు కొత్త సంచులను వా డాలి. పాత సంచులు వాడాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ధాన్యపు సంచులను గోదాముల గోడ నుం చి అరమీటరు దూరంలో ఉండేలా అమర్చుకోవాలి. సంచులను నేలపై కాకుండా చెక్కబల్లలపై పేర్చుకోవాలి. 
  • గోదాముల గోడలు శుభ్రపర్చుకొని.. లీటరు నీటికి డైక్లోరోవాస్‌ 7మి.లీ. లేదా మలాథియాన్‌ 10మి.లీ.. కలిపి ప్రతి 100 చ.మీ.కు మూడు లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.
  • గోదాం వసతిలేని రైతులు గాలివెళ్లే ప్రదేశంలో టార్పాలిన్‌పై ధాన్యం పోయాలి. రోజులో 2 లేదా 3సార్లు ధాన్యాన్ని కిందకు, మీదకు కలుపుకోవాలి. ఆహార అవసరాలకు ధాన్యాన్ని నిల్వ చేసుకొనే రైతులు అందులో వేపాకు పొడి లేదా సీతాఫల్‌ పొడి లేదా పరాద్‌ అనే ఆయుర్వేద బిళ్లలు (టన్ను ధాన్యానికి 3-4 బిళ్లలు) వేయాలి. పురుగు మందులు వాడొద్దు.


logo