మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 02:04:03

యాసంగీ పండుగే

యాసంగీ పండుగే

  • ప్రాజెక్టుల కింద రికార్డుస్థాయిసాగుకు అవకాశం
  • కృష్ణా నదిలో కనిష్ఠంగా 115 టీఎంసీల లభ్యత
  • గోదావరిపై 246 టీఎంసీల నిల్వతో ప్రాజెక్టులు
  • రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షఎకరాలకు సాగునీరు‘

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కోటి ఎకరాల మాగాణం సాకారమైంది. నిన్నటిదాకా గుక్కెడు నీటి కోసం తండ్లాడిన తెలంగాణ.. చరిత్ర పుటల్ని బరువెక్కించే రీతిలో రికార్డుస్థాయిలో పంటలు పండిస్తున్నది. రాష్ట్ర ఏర్పాటునుంచి పడిన ఒక్కో అడుగు గత ఏడాది యాసంగిలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టాయి. గత చేదు అనుభవాలను మరిచిన తెలంగాణ రైతన్న ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటల దిగుబడిలో దేశంలోనే ముందువరుసలో నిలుస్తున్నాడు. ఈసారి వరుణుడు కూడా కరుణించడంతో వానకాలంలో ప్రాజెక్టుల కింద 52 లక్షల ఎకరాల్లో సాగు ముగుస్తుండగా.. యాసంగిలోనూ అదేస్థాయిలో వ్యవసాయం పండుగయ్యే అనువైన పరిస్థితులు ఉన్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలో నేటికీ వరద ఉరకలెత్తుతుండటంతో జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా, చిన్ననీటిపారుదల వ్యవస్థల కింద యాసంగిలోనూ దాదాపు 52 లక్షల ఎకరాల మేర పంటలు సాగుచేసే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 2020-21 ఏడాది తెలంగాణ చరిత్రలోనే ప్రాజెక్టుల కింద కోటి ఎకరాల మాగాణాన్ని సాకారంచేసిన ప్రారంభ సంవత్సరంగా చరిత్రకెక్కనున్నది.

రిజర్వాయర్లలో ‘జల’సిరులు

వర్షాకాలం ముగిసినా నేటికీ ప్రాజెక్టులకు వరద కొనసాగుతుండటంతోపాటు జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. కృష్ణాలో ప్రధానంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నిల్వలోనే ఉన్నాయి. ఈ క్రమంలో కనీస నీటి సేకరణ స్థాయి (ఎండీడీఎల్‌) ఎగువన (శ్రీశైలం 834 అడుగులు, సాగర్‌ 510 అడుగులు) దాదాపు 350 టీఎంసీల జలాలు వాడుకునేందుకు అందుబాటులో ఉన్నా యి. ఇందులో తెలంగాణ వాటా 34 శాతంగా లెక్కిస్తే సుమారు 115 టీఎంసీలు వాడుకోవచ్చు. జూరాల, మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు వేల చెరువులు నిండుగా ఉన్నాయి. గోదావరి బేసిన్‌లో భారీ ప్రాజెక్టుల్లోనే ఏకంగా 246 టీఎంసీల నీటి నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. సింగూరు-24, నిజాంసాగర్‌-9.16, ఎల్‌ఎండీ-24.07, ఎల్లంపల్లి-20.17, శ్రీరాంసాగర్‌-90.31, కడెం-7, శ్రీరాజరాజేశ్వర-25.87, వరద కాల్వ-1.5, కాళేశ్వరం బరాజ్‌లు-36, కొండపోచమ్మ-6.5, అన్నపూర్ణ- రంగనాయకసాగర్‌-4.5.. ఇలా 246 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ఇందులో ఎండీడీఎల్‌ మినహాయించినా కనిష్ఠంగా 185 టీఎంసీలవరకు అందుబాటులో ఉన్నాయి. గోదావరిలో నీటి లభ్యతకు ఢోకా లేదనేది గత వేసవిలోనూ రుజువైంది. నిండు వేసవి మే నెలలోనూ లక్ష్మీబరాజ్‌ నుంచి గోదావరిజలాలను ఎత్తిపోసిన సందర్భం మన కండ్ల ముందే జరిగింది. దీంతో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను వాడుకోవడంతోపాటు ఎక్కడ నీళ్లు అవసరమైనా వెంటనే మళ్లీ నింపేందుకు కాళేశ్వరం మోటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాసంగిలోనూ వానకాలం సీజన్‌లో మాదిరిగానే పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. గత యాసంగిలో ప్రాజెక్టుల కింద గరిష్ఠంగా 33.44 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈసారి 52 లక్షల మైలురాయిని అందుకోనుండటం విశేషం.