సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 00:44:49

సకల సదుపాయాలతో యాదాద్రి

సకల సదుపాయాలతో యాదాద్రి

యాదాద్రి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పవిత్రమైన పంచనారసింహక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణపనులు తుదిదశకు చేరుకోవడంతో అధికారులు మౌలిక వసతుల ఏర్పాటుపై దృష్టి సారించారు. ప్రధానాలయంలో మూలవరుల పునర్దర్శనం ప్రారంభమయ్యేనాటికి అశేష భక్తకోటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయాలని వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం అధికారులు, కాంట్రాక్టర్లు, స్థపతులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన.. తుది దశ పనులను వేగంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఆలయ దక్షిణభాగంలో ఇటీవల కుంగిపోయిన ప్రాంతంలోకి కృష్ణశిలలను పూర్తిగా తొలిగించి.. పచ్చిక బయళ్లను పెంచాలని సూచించారు. 

పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని సౌకర్యాల కల్పన చేపట్టాలన్నారు. ప్రధానాలయానికి ఇత్తడి కిటికీలను అమర్చే పనులు ఊపందుకొన్నాయి. శివాలయంలోని ఉపాలయాలను కృష్ణశిలలతో ఆకట్టుకొనేలా నిర్మించాలని పేర్కొన్నారు. శివాలయంలోని నిర్మాణాలకు స్టోన్‌ కలర్‌ వేసేపనులను కిషన్‌రావు, ఆలయ ఈవో గీతతో కలిసి ప్రారంభించారు. కొండపైకి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులో సుగంధం వెదజల్లే మొక్కలు నాటడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు. కిషన్‌రావు వెంట ఈవో గీతతోపాటు ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, ఆర్కిటెక్టు ఆనందసాయి, ప్రధాన స్థపతి ఆనందాచార్యుల వేలు, ఈఈ వసంత్‌నాయక్‌, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.logo