ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 14:31:40

భక్తులకు శ్రీ యాదాద్రీశుడి దర్శనం

భక్తులకు శ్రీ యాదాద్రీశుడి దర్శనం

యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి ఆలయం భక్తుల దర్శనానికి నేడు తిరిగి తెరుచుకుంది. భక్తుల దర్శనాల నిమిత్తం 78 రోజుల అనంతరం ఆలయాన్ని సోమవారం నాడు తిరిగి తెరిచారు. యాదాద్రి కొండపై గల బాలాలయంలో స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో భక్తుల రక్షణ నిమిత్తం తీసుకున్న జాగ్రత్త చర్యలను కలెక్టర్‌ పరిశీలించారు. క్యూలైన్‌తో పాటు ఆలయంలోని పలు ప్రాంతాల్లో హ్యాండ్‌ శానిటైజర్లను ఏర్పాటు చేశారు. 

భౌతికదూరం పాటిస్తూ నేడు ఆలయ సిబ్బందికి, విశ్రాంత ఉద్యోగులకు స్వామి దర్శనానికి అనుమతించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ అనంతరం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరీక్షలు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది కొండపై సిద్ధంగా ఉంది. మాస్కులు ధరించాల్సిందిగా, భౌతికదూరం పాటించాల్సిందిగా పేర్కొంటూ ఆలయ నిర్వాహకులు ఎప్పటికప్పుడు మైకుల్లో ప్రకటనలు చేస్తున్నారు. 

మీడియాతో కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ మాట్లాడుతూ... ఆలయంలోకి 10 ఏళ్ల లోపు చిన్నారులకు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు అనుమతి లేదన్నారు. ప్రసాదం కౌంటర్లలో, ఇతర దుకాణాల్లో భక్తులు సరిగ్గా అవసరమయ్యే నగదును ఇచ్చి వస్తువులను కొనుగోలు చేయాల్సిందిగా తెలిపారు. నేడు ఆలయ సిబ్బందికి, ఉద్యోగులకు, స్థానికులకు దర్శనానికి అనుమతించగా రేపటి నుంచి అన్ని ప్రాంతాల భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్‌కార్డు తీసుకుని రావాల్సిందిగా పేర్కొన్నారు. 

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయం, పానగ్‌లోని ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం, పిల్లలమర్రిలోని చెన్నకేశవస్వామి ఆలయం, మటంపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వాడపల్లిలోని శ్రీ మీనాక్షి అగస్తేశ్వరస్వామి ఆలయం 78 రోజుల అనంతరం భక్తుల దర్శనాల నిమిత్తం నేడు తిరిగి తెరుచుకున్నాయి. logo