శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 00:57:12

ఆధ్యాత్మిక నగరి.. యాదాద్రి

ఆధ్యాత్మిక నగరి.. యాదాద్రి

  • నభూతో నభవిష్యత్‌లా యాదాద్రి పునర్నిర్మాణం
  • 1,900 ఎకరాల్లో నలుదిశలా టెంపుల్‌సిటీ.. 
  • ఇప్పటివరకు రూ.700 కోట్లు నిధుల ఖర్చు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురై జీర్ణావస్థకు చేరిన ఆలయాలు స్వరాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తున్నాయి. ప్రధానంగా లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది. నభూతో నభవిష్యత్‌లా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తూ ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం ఇప్పటివరకు రూ.700 కోట్ల వరకు ఖర్చుచేశారు. వైటీడీఏ ఆధ్వర్యంలో గుట్టపైన, దిగువన పరిసర ప్రాంతాల్లో మొత్తం 1,900 ఎకరాల్లో నలుదిక్కులా టెంపుల్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ప్రధాన ఆలయమున్న గుట్టపైనా, టెంపుల్‌ సిటీగా తీర్చిదిద్దుతున్న గుట్టపైనా, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నిర్మిస్తున్న గుట్టపైనా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్పకళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా చేపట్టిన యాదాద్రి పునరుద్ధరణ పనులు తుదిదశకు చేరాయి. 

అద్భుత పుణ్యక్షేత్రంగా భద్రాద్రి

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయాభివృద్ధి కోసం 2014 నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. భద్రాచల రామయ్య ఆలయ ప్రాశస్త్యం, ప్రపంచవ్యాప్తంగా శ్రీరామచంద్రుడిపై ప్రజలకున్న భక్తిభావం ఉప్పొంగేలా భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే ఒక అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. కొమురవెల్లి మల్లన్న, కురవి వీరన్న తదితర పుణ్యక్షేత్రాలతోపాటు చారిత్రక నాగార్జునకొండ వంటి బౌద్ధారామాల అభివృద్ధి కూడా ప్రభుత్వం కామన్‌ గుడ్‌ ఫండ్‌ కింద బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. 

అమరవీరులకు నివాళిగా మహా దీపకళిక

తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరుల స్మృతికి ఘనంగా నివాళులు అర్పించేందుకు, అమరుల త్యాగాలను స్మరించేందుకు ఒక మహాస్మృతి కేంద్రాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిచింది. హుస్సేన్‌సాగర్‌ తీరంలో ప్రమిద ఆకృతిలో నిర్మించే అపురూప స్మారకానికి రూ.90 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనావేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్మస్‌ తదితర పండుగలకు అధికారిక హోదా కల్పించింది. బక్రీద్‌, క్రిస్మస్‌, దసరా, దీపావళి ఇలా ప్రతి పండుగను ప్రభుత్వమే ఘనంగా చేస్తున్నది. మేడారం, పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తున్నది.


logo