గురువారం 04 జూన్ 2020
Telangana - May 23, 2020 , 01:14:12

సాఫీగా ‘వలస’ ప్రయాణంసీఎం ఆదేశాలతో అధికారుల ఏర్పాట్లు

సాఫీగా ‘వలస’ ప్రయాణంసీఎం ఆదేశాలతో అధికారుల ఏర్పాట్లు

  • వాహనాల్లో సొంత గ్రామాలకు కార్మికులు
  • దాతల ఔదార్యంతో దారిలో భోజనాలు 

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో ఉత్తరాది రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కార్మికులు సొంత ప్రాంతాలకు సాఫీగా వెళ్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభంలో కాలినడకన వెళ్తూ ఇబ్బందులుపడ్డ వలసజీవులు.. ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో వాహనాల్లో తరలిపోతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా మీదుగా వెళ్తున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యాన, ఢిల్లీ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సా యంతోపాటు స్కూల్‌ బస్సులు, ఇతర వాహనాలను సమకూరుస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాలినడకన రోడ్డుపైకి వచ్చిన వారిని గుర్తించి ఆయా రాష్ర్టాలకు వెళ్లే లారీలు, ట్రక్కు లు, వ్యాన్లలో పంపిస్తున్నారు. కాలినడకన వస్తు న్న వారికి ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం డొల్లారలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు, భోరజ్‌ రవాణాశాఖ చెక్‌పోస్టుల వద్ద  భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించి వాహనాల్లో సొంత రాష్ర్టాలకు పంపిస్తున్నారు. ఉత్తరాది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాలకు వచ్చేవారికి కరోనా పరీక్షలు నిర్వహించి పాసులు జారీచేస్తున్నారు. 

వివరాల సేకరణ..

ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దు జాతీయ రహదారి-44 మీదుగా రాకపోకలు సాగించే వారికి డొల్లార వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి చేతిపై క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నారు. 14 రోజులపాటు వీరిని స్థానిక అధికారులు పర్యవేక్షిస్తారు. వేరే రాష్ర్టాలకు చెందిన వారికి రెవెన్యూ అధికారులు పాసులు జారీ చేస్తున్నారు.

మూడు బస్సుల్లో బీహార్‌కు 

అడ్డాకుల: మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకులలో వారం రోజులుగా అధికారుల సంరక్షణలో ఉన్న బీహార్‌ రాష్ర్టానికి చెందిన 80 మంది వలస కూలీలు శుక్రవారం సొంత రాష్ర్టానికి బయలుదేరా రు. ఉన్నతాధికారుల ఆదేశంతో మూడు ప్రత్యేక బస్సుల్లో వీరిని తరలించారు.  తమిళనాడులోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వలసకూలీలు మూడు కంటైనర్లలో వెళ్తుండగా ఈ నెల 16న అడ్డాకుల టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. వీరికి ఏడు రోజులుగా స్థానికంగా ఉన్న ఓ దాబాలో ఆశ్రయం కల్పి చారు. స్థానిక ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు.

 తెలంగాణ సర్కార్‌కు కృతజ్ఞతలు 

తెలంగాణ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నది. వలస కార్మికులకు బియ్యం, డబ్బులు ఇచ్చింది. మేము హమాలీ పనులు చేసేందుకు బీహార్‌ నుంచి ఆదిలాబాద్‌కు వచ్చాం. చేసిన పనికి కూడా డబ్బులు వచ్చినాయి. ఇప్పడు మేం పోవడానికి చెక్‌పోస్టు వద్ద నుంచి లారీలో పంపించడం సంతోషంగా ఉంది. సర్కారుకు కృతజ్ఞతలు. 

- నాథురాం, వలస కూలీ, బీహార్‌


logo