సోమవారం 01 జూన్ 2020
Telangana - May 05, 2020 , 00:36:11

పారిశ్రామికవాడల్లో మళ్లీ సందడి

పారిశ్రామికవాడల్లో మళ్లీ సందడి

  • సుదీర్ఘ విరామం తర్వాత పరిశ్రమలు పునఃప్రారంభం
  • పరిమిత సంఖ్యలో విధులకు హాజరవుతున్న కార్మికులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో బోసిపోయిన పారిశ్రామికవాడలు 40 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తెరుచుకున్నాయి. కార్మికుల సందడి, యంత్రాల చప్పుళ్లతో పరిశ్రమల్లో కళ సంతరించుకొన్నది. ఇన్నాళ్లూ ఉపాధిలేక అల్లాడుతున్న కార్మికులతోపాటు అనుబంధ రంగాలపై ఆధారపడినవారిలో మళ్లీ చిరునవ్వులు కనిపిస్తున్నాయి. పరిమిత సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులతో పరిశ్రమలను నడిపేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. కరోనా లక్షణాలున్నవారిని విధుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. నిర్ణీత దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడంతోపాటు శానిటైజేషన్‌ను తప్పనిసరి చేసింది.

 ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారిశ్రామికవాడలను శానిటైజ్‌చేసి ఉద్యోగులు, కార్మికులకు మాస్కులు అందజేయడంతో సోమవారం రాష్ట్రంలో దాదాపు అన్ని పరిశ్రమల్లో కార్యకలాపాలు మొదలయ్యాయి. నిర్ణీత దూరాన్ని పాటించేందుకు వీలుగా కార్మికులను పూర్తిస్థాయిలో కాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలన్నింటినీ పాటిస్తూ పరిశ్రమలను నడిపిస్తున్నామని, తద్వారా ప్రజలకు అవసరమైన వస్తువులు, సరుకులు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్‌) అధ్యక్షుడు కే సుధీర్‌రెడ్డి చెప్పారు. పరిశ్రమలను ఒక షిప్ట్‌ నడిపించేందుకు అనుమతిచ్చిన సీఎం కేసీఆర్‌తోపాటు, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


logo