సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 19:18:30

ప్రభుత్వ లక్ష్యాల సాధన దిశగా కృషిచేయాలి : మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రభుత్వ లక్ష్యాల సాధన దిశగా కృషిచేయాలి : మంత్రి కొప్పుల ఈశ్వర్

పెద్ద‌ప‌ల్లి : ప‌్ర‌భుత్వ ల‌క్ష్యాల సాధ‌న దిశ‌గా కృషి చేస్తూ క్షేత్ర‌స్థాయిలో అభివృద్ధికి పాటుప‌డాల‌ని అధికారుల‌ను మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఎన్‌టీపీసీలోని మిలీనియం హాల్‌లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేతకాని నిర్వహించిన మానిటరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వ్యవసాయ పరంగా, పారిశ్రామికంగా పెద్దపల్లి జిల్లా మంచి అభివృద్ధి సాధించిందన్నారు. జిల్లాలో సహజ వనరులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచే దిశగా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. 

ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతకాని మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న నిధులను సమర్ధంగా వినియోగించుకుంటూ ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చే విధంగా పని చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్‌ప‌ర్స‌న్ పుట్ట మధు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అమలు చేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వారికి కనీస అవసరాలు తీర్చే దిశగా పనిచేయాలన్నారు. 


అనంత‌రం జిల్లాలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, వైద్య‌ విద్య, సివిల్ సప్లయిస్, విద్యుత్ శాఖలపై మంత్రి జిల్లా అధికారులతో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి  కార్యక్రమాల నిర్వహణకు నరేగా నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 235 కోట్ల నిధులు  నరేగా కింద ఖర్చు ఉందని, ఇప్పటివరకు 49 కోట్లు మాత్ర‌మే ఖర్చు చేసిన‌ట్లు తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ నిధులను వినియోగిస్తూ 228 పల్లె ప్రకృతి  వనాలు, 262 కంపోస్ట్ షెడ్డు, 263 స్మశాన వాటికలు, 462 చెరువుల పూడికతీత పనులు, 24,407 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టిన‌ట్లు వీటిని త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు, 

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి , రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, రామగుండం మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, రామగుండం మేయర్ అనిల్ కుమార్, ఇత‌ర‌ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కేంద్ర ప్రభుత్వ బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.