శనివారం 06 జూన్ 2020
Telangana - May 22, 2020 , 01:20:34

అద్భుత ప్రగతి సాధించారు

అద్భుత ప్రగతి సాధించారు

-మంత్రి కేటీఆర్‌కు సీఎం కేసీఆర్‌ ప్రశంస

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రికార్డు సృష్టించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. అద్భుత ప్రగతి సాధించారంటూ ఐటీ శాఖను, మంత్రి కేటీఆర్‌ను అభినందించారు. భవిష్యత్తులో ఐటీ పెట్టుబడులను ఆకర్షించే గమ్యస్థానంగా తెలంగాణ  ఉంటుందని దీనితో స్పష్టమైందని సీఎం వ్యాఖ్యానించారు. కొవిడ్‌-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ఐటీ పరిశ్రమలు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి 2019-20 సంవత్సరంలో ఐటీ ఎగుమతులు, ఉపాధి కల్పనపై నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2020 జనవరి నుంచి మార్చి వరకు) కరోనా కారణంగా ఆర్థికరంగంలో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 17.93 శాతం వృద్ధిని నమోదు చేయగలిగిందని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో సాధించిన జాతీయ వృద్ధిరేటు కంటే ఇది రెట్టింపు అని వివరించారు. కరోనా ప్రభావాలను అధిగమించే సత్తా, చురుకుదనం హైదరాబాద్‌ పర్యావరణ వ్యవస్థకు, ఐటీకి ఉందని దీనితో స్పష్టమైందన్నారు. ఇప్పటికే చాలామంది పెట్టుబడిదారులు దీనిపై చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే కొన్ని ప్రకటనలు కూడా రావొచ్చని చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సాధించిన అన్ని విజయాలను వివరిస్తూ జూన్‌ ఒకటో తేదీన ఐటీ విభాగం పురోగతి నివేదికను విడుదల చేస్తుందన్నారు. గత ఐదేండ్లుగా క్రమం తప్పకుండా ఐటీ శాఖ పురోగతి నివేదిక విడుదల చేస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. 


logo