శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 03:06:29

తిప్పలు లేకుండా అప్పు అతివలకు పెన్నిధిలా ‘స్త్రీనిధి’

తిప్పలు లేకుండా అప్పు అతివలకు పెన్నిధిలా ‘స్త్రీనిధి’

  • స్వయం ఉపాధికి బాటలు
  • పాడిపశువులు, కోళ్ల పెంపకానికి ప్రాధాన్యం
  • ఎలక్ట్రిక్‌ ఆటోలు, చిన్నపాటి షాపులకు రుణం
  • మార్చినెలాఖరుకు రూ. 2,400 కోట్ల లక్ష్యం
  • అతివలు తిప్పలు లేకుండా తక్కువ వడ్డీకి అప్పులు పొందుతున్నారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన స్త్రీనిధి సంస్థ ఈ ఏడాది మరో రికార్డువైపు పరుగులు తీస్తున్నది. పాడి పరిశ్రమ, నాటుకోళ్ల పెంపకం, కిరాణా, కూరగాయల షాపులకు విరివిగా రుణాలిస్తూ ప్రోత్సహిస్తున్నది. స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయిస్తూ అతివల పాలిట పెన్నిధిలా నిలుస్తున్నది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహిళలకు స్వయం ఉపాధి మార్గం చూపించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటైన స్త్రీనిధి సంస్థ మహిళా సంఘాలకు రుణాల మంజూరులో దూసుకుపోతున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1140 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. మిగిలిన రూ.1260 కోట్లను మార్చి నెలాఖరులోగా అందించి రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. 

పాడికి ప్రాధాన్యం

ఈ ఏడాది స్త్రీనిధి సంస్థ పాడిపశువులు, నాటుకోళ్ల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ మేరకు పశువుల కొనుగోలుకు ఇచ్చే రుణాన్ని రూ.60 వేల నుంచి రూ.75 వేలకు పెంచింది. ఇలా వచ్చే రెండేండ్లలో లక్ష పాడి పశువులకు రుణాలివ్వాలని నిర్ణయించింది. ఇదే కాకుండా 50 నుంచి 100 నాటుకోళ్ల పెంపకానికి ఒక్కో సభ్యురాలికి రూ.12,500 నుంచి రూ.22వేలు వరకు రుణం ఇస్తున్నది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వీటితో పాటు కాలుష్యం లేకుండా తక్కువ ఖర్చుతో నడిచే ఎలక్ట్రిక్‌ ఆటోల కొనుగోలుకు రూ.3 లక్షల వరకు రుణం ఇస్తున్నది. ఈ ఏడాది వెయ్యి ఆటోలను రుణంపై అందించాలని నిర్ణయించింది. రోడ్ల మీద చిన్న దుకాణాలు పెట్టుకునే వారిని ఆదుకోడానికి రూ.10 వేల చొప్పున రుణ సాయం అందిస్తున్న స్త్రీనిధి ఇప్పటి వరకు 22,600 మంది వీధి వర్తకులకు రుణాలు అందించింది. వీటితో పాటు రాష్టవ్యాప్తంగా వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అద్దెకు ఇచ్చేందుకు 100 కస్టమ్స్‌ హైరింగ్‌ సెంటర్‌ల ఏర్పాటుకు రుణాలు సమకూర్చనున్నది. 

రికార్డు సృష్టించేందుకు సిద్ధం

కరోనా విపత్కర పరస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది రుణ లక్ష్యం గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్లు తగ్గినా, మంజూరులో మాత్రం ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మొత్తం లక్ష్యంలో 45.62% రుణాలు ఇచ్చింది. మూడునెలల్లో మిగిలిన లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు రచిస్తున్నది. 

ఏడు లక్షలకుపైగా సభ్యులు

స్వయం సహాయక సంఘాల్లో 2013-14లో 3,36,900 మంది మహిళలకు సభ్యత్వం ఉండగా, ప్రస్తుతం ఏడు లక్షల పైచిలుకు మంది సభ్యులుగా ఉన్నారు. స్త్రీ నిధిలో సభ్యత్వం ఉన్న మహిళ రూ.5వేల నుంచి రూ.3లక్షల వరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీకి(కేవలం 11.5%) మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇలా వచ్చిన వడ్డీలో 10% తిరిగి మహిళా సంఘాలకే ఇస్తున్నారు. రుణం తీసుకున్న మహిళ చనిపోతే తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా అప్పటి వరకు సదరు మహిళ చెల్లించిన డబ్బును స్త్రీనిధి సురక్ష పథకం కింద తిరిగి తన  వారసులకే ఇస్తారు. ఇలాంటి వినూత్న పథకాలతో స్త్రీనిధి దేశవ్యాప్త గుర్తింపు సాధించింది. ఇప్పటికే చాలా రాష్ర్టాల వారు మన దగ్గరికి వచ్చి అధ్యయనం చేసి వెళ్లడం గమనార్హం. 
logo