శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 02:41:22

గ్రామ సభల్లోకి మహిళాసంఘాలు

గ్రామ సభల్లోకి మహిళాసంఘాలు

  • ప్రతి సమావేశానికి ఒక ప్రణాళిక
  • తీర్మానాల్లో వారి భాగస్వామ్యం
  • త్వరలో అమల్లోకి కొత్త విధానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభల్లో మహిళల ప్రాధాన్యం పెంచేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అడుగులు వేస్తున్నది. గ్రామాల్లో జరిగే ప్రతిసభలో స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)ను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఇందుకు గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (జీపీడీపీ)లో భాగం గా ఎస్‌హెచ్‌జీ మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే మండలస్థాయిలో ఏపీఎం, సీసీలకు శిక్షణనిచ్చింది. నాలుగు విడుతలుగా 545 మండలాల్లోని 1,090 మంది అధికారులు శిక్షణ పొందారు. వీళ్లు గ్రామాల్లో ఉండే వీవోలు, మహిళా సంఘాల సభ్యులకు.. గ్రామసభలో ఏం చేయాలి?, గ్రామ అభివృద్ధిలో తమ వంతు పాత్ర ఎలా పోషించాలి? అనే అంశాలపై శిక్షణ ఇస్తారు.

గ్రామసభలో మహిళలు ఏం చేస్తారు?

గ్రామ సభలో పాల్గొనడానికి ముందు ఎస్‌హెచ్‌జీ మహిళలంతా ఒక దగ్గర సమావేశమవుతారు. ముందుగా భూమి (నేల)పై గ్రామ పంచాయతీ పటం వేసి, రూట్‌మ్యాప్‌ రూపొందిస్తారు. ఎక్కడెక్కడ ఏ వనరులు (పంచాయతీ భవనం, పాఠశాల, అంగన్‌వాడీ, వైద్యశాల, చెరువు, కుంటలు, బోరింగ్‌ తదితరాలు) మ్యాప్‌లో పొందుపరిచి, అక్కడ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తిస్తారు. గ్రామాభివృద్ధి, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకొని ప్రాధాన్యక్రమంలో అత్యవసరంగా చేయాల్సి పనులేంటి?, ఏ పనులు ముందు చేయాలనేది ప్రతిపాదిస్తారు. ప్రతి గ్రామసభ మహిళా సంఘాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నాకే తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రజాసమస్యలు పరిష్కారమవటమే కాకుండా మహిళలు అభివృద్ధిలో భాగస్వాములవుతారు

ప్రణాళికలు ఇలా..

  • గ్రామాభివృద్ధికి ఎస్‌హెచ్‌జీ మహిళలు గ్రామ పేదరిక నిర్మూలన కార్యక్రమం (వీపీఆర్పీ) కింద నాలుగు ప్రణాళికలను రూపొందించి వాటిని గ్రామసభలో సమర్పించాల్సి ఉంటుంది. 
  • ఎన్‌టైటిల్‌మెంట్‌ ప్లాన్‌ (గ్రామంలో అర్హులకు అందాల్సిన పథకాలు, ప్రయోజనాలను ఇందులో పేర్కొంటారు)
  • జీవనోపాధి ప్రణాళిక 
  • సామాజిక అభివృద్ధి ప్రణాళిక 
  • ప్రజారవాణా, సర్వీసులు-వనరుల అభివృద్ధి ప్రణాళిక. ప్రస్తుతం ఈ ప్రణాళికలు తయారు చేసేటప్పుడు ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే విషయాలపై మెటీరియల్‌ తయారీ ప్రక్రియ నడుస్తున్నది. వీలైనంత త్వరగా మెటీరియల్‌ తయారుచేసి, ఎస్‌హెచ్‌జీలకు శిక్షణ పూర్తిచేసి.. రెండు, మూడు నెలల్లో జీపీడీపీ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువస్తామని సెర్ప్‌ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.