గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 00:34:17

నారీ.. నాలుగోసారి

నారీ..  నాలుగోసారి

  • ఇప్పటివరకు ముగ్గురే మేయర్లుగా ఎన్నిక
  • ఏనాడూ పూర్తికాలం పదవిలో కొనసాగని దుస్థితి
  • ఈసారి జనరల్‌ మహిళకు పీఠం కేటాయింపు
  • కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయంపై మహిళాలోకం హర్షం

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) చర్రితలో నాలుగోసారి ఓ మహిళ మేయర్‌ పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈసారి మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు అయింది. 1955లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటైంది. 

అంతకుముందు వరకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉండేవి. 1955నాటికి సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో(ఎంసీహెచ్‌) విలీనమయ్యాయి. 2007లో మరో 12 సబర్బన్‌ మున్సిపాలిటీలను కలుపుకొని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఏర్పడింది. అయితే 1956 నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళలకే మేయర్‌ పీఠం దక్కింది. అందులోనూ వారు ఏనాడూ పూర్తి కాలం పదవిలో కొనసాగలేదంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఈసారి కేసీఆర్‌ సర్కార్‌ అతివలకు మేయర్‌ పదవిని కేటాయించడంపై మహిళా లోకం హర్షం వ్యక్తంచేస్తున్నది. హైదరాబాద్‌సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

దశాబ్దకాలం తర్వాత మళ్లీ..

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటై దశాబ్దాలు గడిచినా మహిళలకు ఎప్పుడూ సముచిత స్థానం దక్కలేదు. ఏడాది లేదంటే రెండేండ్లు మాత్రమే వారు పాలన కొనసాగించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 1962-63 మధ్య రాణి కుముదినిదేవి తొలిసారిగా మేయర్‌ పదవిని చేపట్టారు. అనంతరం మధ్యలోనే ఆమెను పార్టీ తొలగించింది. ఆ తరువాత సామాజికవేత్త సరోజినీ పుల్లారెడ్డి 1965-66 వరకు మేయర్‌గా కొనసాగారు. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలవడంతో మేయర్‌ పదవిని వదులుకున్నారు. నాలుగు దశాబ్దాల అనంతరం 2009లో బండ కార్తీకరెడ్డి తొలి ‘గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌' చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ ముందస్తుగా చేసుకున్న ఒప్పందం కారణంతో ఏఐఎంఐఎంకు మేయర్‌ పదవిని అప్పగించాల్సి వచ్చిం ది. దీంతో 2011లో బండ కార్తీకరెడ్డి మేయర్‌గా వైదొలిగారు. సుమారు దశాబ్ద కాలం తరువాత  మళ్లీ మహిళలకు మేయర్‌ పీఠం వరించనుంది. 

ఎప్పుడూ అస్థిర పాలనే..

ఎంసీహెచ్‌ ఏర్పాటయినప్పటి నుంచి ఇప్పటివరకూ అస్థిర పాలనే కొనసాగింది. ఎప్పడూ రాజకీయ పంపకాల్లో భాగంగా మేయర్‌ పదవి వివాదాస్పదంగా నిలుస్తూ వస్తున్నది. 1952 నుంచి 1970 వరకు మేయర్‌గా పని చేసినవారందరూ ఏడాది నుంచి మూడేండ్లకు మించి పదవిలో కొనసాగిన దాఖలాలు లేవు.  ఆ తర్వాత 1970 నుంచి 1986 వరకు అంటే 16 ఏండ్ల పాటు అసలు కార్పొరేషన్‌కు ఎన్నికలే నిర్వహించలేదు. అటు తరువాత 1991 నుంచి 2002 వరకు అదే పరిస్థితి. 2007 నుంచి 2009 వరకూ ప్రత్యేక పాలన కిందనే హైదరాబాద్‌ కార్పొరేషన్‌ కొనసాగింది. 2014లో తొలిసారిగా పూర్తిస్థాయి మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఐదేండ్లపాటు సుస్థిరమైన పాలనను అందించింది.

బల్దియా మేయర్లు వీరే..

1952-54 మాడపాటి హనుమంతరావు

1954-55 ధరణిధర్‌ సంఘి

1955-56 షాబుద్దీన్‌ అహ్మద్‌ఖాన్‌

1956-58 కిషన్‌లాల్‌

1958-59 కృష్ణస్వామి ముదిరాజ్‌

1959-60 రోషన్‌ అలీఖాన్‌

1960-61 వేదప్రకాశ్‌ దోషజ్‌

1961-62 రామ్మూర్తి నాయుడు

1962-63 రాణి కుముదిని దేవి

1963-64 బనారసీలాల్‌ గుప్తా

1964-65 ఎంఆర్‌ శ్యామ్‌రావు

1965-66 సరోజినీ పుల్లారెడ్డి

1966-67 అక్బర్‌ అలీ అన్సారీ

1967-68 కే కొండారెడ్డి

1968-69 కుముద్‌నాయక్‌

1969-70 లక్ష్మీనారాయణ ముదిరాజ్‌

1986-87 ప్రకాశ్‌రావు

1987-88 ఎంకే మోబీన్‌

1988-89 అనుముల సత్యనారాయణరావు

1989-90 జుల్ఫీకర్‌ అలీ

1990-91 అలంపల్లి పోచయ్య

2002-07 తీగల కృష్ణారెడ్డి 

2009-11 బండ కార్తీక రెడ్డి

2012-14 మాజిద్‌ హుస్సేన్‌

2015 నుంచి బొంతు రామ్మోహన్‌